iDreamPost

OTTలో దుమ్ము రేపుతున్న.. క్రైమ్ థ్రిల్లర్ ‘పోర్ తొళిల్’ మూవీ రివ్యూ!

OTTలో దుమ్ము రేపుతున్న.. క్రైమ్ థ్రిల్లర్ ‘పోర్ తొళిల్’ మూవీ రివ్యూ!

క్రైమ్ థ్రిల్లర్స్ కు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఉంటారు. ఇటీవల ఆద్యంతం ఉత్కంఠతతో అలరించే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ కు విశేష ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సస్పెన్స్ క్రైమ్ కథతో ఇటీవలే తమిళంలో వచ్చిన మూవీ ‘పోర్ తొళిల్’. డైరెక్టర్ విఘ్నేష్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రం తమిళంలో థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా కథ ఏంటి? మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:

తిరుచ్చిలో జరిగిన యువతి హత్య కేసును ఛేదించే బాధ్యత ముగ్గురు పోలీస్ అధికారులపై పడుతుంది. అడిషనల్ డీజీపీ మహేంద్రన్ ఆదేశాల మేరకు ఎస్పీ లోక్ నాథన్ వద్ద డీఎస్పీ ట్రైనీగా పనిచేసేందుకు ప్రకాశ్ (అశోక్ సెల్వన్) వస్తాడు. అతడితో పాటుగా టెక్నికల్ అసిస్టెంట్ వీణ (నిఖిలా విమల్) కూడా వస్తుంది. ఇక ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులకు పెను సవాల్ గా వరుస హత్యలు జరుగుతూనే ఉంటాయి. యువతి హత్యతో పాటు ఈ హత్యలు చేస్తుంది ఎవరు? మర్డర్లకు కారణం ఏంటి? ఈ కేసు మిస్టరీ ఛేదించే క్రమంలో ఈ ముగ్గురు పోలీసులకు ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నదే కథ.

విశ్లేషణ:

సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ మూవీస్ అంటే ప్రేక్షకుడి ఊహకందని ట్విస్టులతో కథ ముందుకుపోతూ ఉంటుంది. ‘పోర్ తొళిల్’ మూవీ కూడా ఇదే కోవకు చెందింది. దర్శకుడు తాను ఎంచుకున్న కథను కాస్త కొత్తగా తెరకెక్కించడంలో విజయం సాధించాడు. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఉత్కంఠతో కూర్చోబెట్టడంలో సఫలం అయ్యాడు డైరెక్టర్ విఘ్నేష్ రాజా. యువతి హత్య, పాత్రల పరిచయంతో నేరుగా ప్లాట్ పాయింట్ కు వచ్చేశాడు డైరెక్టర్. ఒక పక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే.. మరో పక్క వరుసగా సేమ్ హత్యలు జరుగుతుండటంతో.. ప్రేక్షకుల్లో ఎక్కడాలేని అటెన్షన్ ను క్రియేట్ చేశాడు. ఈ మూవీ చూస్తున్నంత సేపు ప్రేక్షకుడే క్రైమ్ సీన్ లో ఉండి వాటిని నేరుగా చూస్తున్న భావన కలుగుతుంది. ప్రతి సంఘటనను క్లైమాక్స్ కు ఇంటర్ లింక్ చేసిన విధానం మెప్పిస్తుంది.

ఇక మూడు హత్యల తర్వాత హంతకుడు పట్టుబడ్డాడన్న వార్త వస్తుంది. దీంతో ఎవరా వ్యక్తి? అన్న ఆసక్తి రేగుతుంది. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు డైరెక్టర్. కాగా.. సెకండాఫ్ లో అసలు హంతకుడు వేరే ఉన్నాడంటూ.. లోకనాథన్, ప్రకాశ్ చేసే ప్రయత్నాలు అలరిస్తాయి. కెన్నడీ (శరత్ బాబు) పాత్ర ఎంట్రీతో సినిమా మరో లెవల్ కు వెళ్తుంది. దీంతో నెక్ట్స్ ఏం జరుగుతుందా అన్న ఆసక్తి ప్రేక్షకుడికి కలుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇవే ట్విస్టులు రా బాబు అనక తప్పదు. ఇక పతాక సన్నివేశాలకు ముందు వచ్చే ఓ షాకింగ్ ట్విస్టును మాత్రం ఎవ్వరూ ఊహించరు. ఆ ట్విస్ట్ ఏంటో? ఆ సీరియల్ కిల్లర్ ఎవరో తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే!

ఎవరెలా చేశారంటే:

ఈ సినిమాలో కనిపించే పాత్రల తక్కువే. కానీ ప్రతి పాత్ర సినిమాను ప్రభావితం చేసే పాత్రే. ఇక ఎస్పీ లోకనాథన్ గా శరత్ కుమార్ అద్భుతంగా నటిస్తే.. అశోక్ సెల్వన్ తన పాత్రలో ఒదిగిపోయాడు. వీణగా నిఖిలా విమల్ తన పరిధి మేరకు నటించింది. ఇక కెన్నడీగా శరత్ బాబు పాత్రను ఎవరూ ఊహించి ఉండరు అంటే అతిశయోక్తికాదు. ఆయన చనిపోయే ముందు నటించిన చివరి చిత్రాల్లో పోర్ తొళిల్ మూవీ ఒకటి. సినిమాలో మిగతా పాత్రలు కూడా తమ పరిధిమేరకు అద్భుతంగా నటించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే.. కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్, మ్యూజిల్, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రభావవంతంగా ఉన్నాయి. ముఖ్యంగా కథను తీర్చిదిద్దిన విధానం అద్భుతం. పోర్ తొళిల్ రెండో భాగం కూడా ఉందని డైరెక్టర్ హింట్ ఇవ్వడం కొసమెరుపు. చివరిగా ట్విస్టులతో టెన్షన్ పెట్టించే పోర్ తొళిల్.

బలాలు

  • కథ, కథనాలు
  • నటీనటులు
  • డైరెక్షన్

బలహీనతలు

  • అక్కడక్కడ స్లోగా సాగే సీన్స్

(గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి