iDreamPost

‘పెదకాపు 1’ మూవీ రివ్యూ!

‘పెదకాపు 1’ మూవీ రివ్యూ!

ఇండస్ట్రీలో దర్శకులు ఏదొక టైమ్ లో తమ రెగ్యులర్ పంథాను మార్చి సినిమాలు చేస్తుంటారు. సెన్సిటివ్ డైరెక్టర్ అనిపించుకున్నవారు ఒక్కోసారి ఊరమాస్ సినిమా తీసి మెప్పించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఊరమాస్ సినిమాలు తీసేవారు అప్పుడప్పుడు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ తీసి సర్ప్రైజ్ చేస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ రెండు చేసి చూపించాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. కొత్తబంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి క్లాస్ మూవీస్ తర్వాత.. నారప్పతో ఊరమాస్ సినిమా అందించారు. ఇప్పుడదే బాటలో ‘పెదకాపు’ తెరకెక్కించారు. డెబ్యూ హీరో విరాట్ కర్ణని పరిచయం చేస్తూ.. అఖండ ఫేమ్ మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన పెదకాపు.. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ట్రైలర్, సాంగ్స్ తో అంచనాలు పెంచిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!

కథ:

ఈ పెదకాపు సినిమా కథ.. 1980వ దశకంలో మొదలవుతుంది. నాటి రోజులలో కుల రాజకీయాలు రాజ్యమేలుతుండగా.. రాజమండ్రి ప్రాంతంలోని ఓ గ్రామానికి పెదకాపు(విరాట్ కర్ణ) ఉండేవాడు. అంటే.. ఆ ఏరియా వాళ్లకి పెద్ద దిక్కు అన్నమాట. పెదకాపు కుల రాజకీయాల అణిచివేతపై పోరాడుతుంటాడు. కట్ చేస్తే.. పెదకాపుకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతుంటారు సత్య రంగయ్య(రావు రమేష్), భయ్యన్న(ఆడుకాలం నరేన్). సరిగ్గా 1982లో సీనియర్ ఎన్టీఆర్ పార్టీ స్థాపించడంతో.. అక్కడి పరిస్థితులలో మార్పులు చోటుచేసుకుంటాయి. మరి ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తర్వాత ఆ ఏరియాలో ఎలాంటి మార్పులు జరిగాయి? సత్య రంగయ్య, భయ్యన్న కుట్రలను పెదకాపు ఎలా ఎదుర్కొన్నాడు? ఇందులో అనసూయ, శ్రీకాంత్ అడ్డాల క్యారెక్టర్స్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

పెదకాపు అనే పదం ఎక్కువగా గోదావరి ప్రాంతాల్లో వింటుంటాం. గోదావరి జిల్లాల్లో పెదకాపులు అనేవారు ప్రతీ ఏరియాకు ఉంటుంటారు. ఫ్యామిలీ, జనం, చుట్టరికం, ఏరియాలను తమదిగా భావించి.. కాపు కాస్తుంటారు పెదకాపు అనేవారు. పెదకాపు అంటే కులానికి సంబంధించినది కాదని.. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్రమోషన్స్ లో చెబుతూ వచ్చారు. కానీ.. గోదావరి జిల్లాల వారికి పెదకాపు అంటే.. కాపు కులానికి సంబంధించిన పెద్దనే అని బాగా తెలుసు. పెదకాపు పేరుతో దుకాణాలు, హోటల్స్ వగైరా వ్యాపారాలు కూడా ఉంటాయి. ఇప్పుడదే టైటిల్ పెట్టి.. సినిమా తీసి వెండితెరపై ప్రెజెంట్ చేశాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.

పెదకాపు అనేది కులానికి చెందింది కాదని.. నా వాళ్లు అనుకున్న వారికి అండగా ఉండి, వారిని కాపాడుకునే వాడే సాధారణ వ్యక్తి అని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ.. ఈ పదం కులానికి సంబంధించినదే గాని బయట ఎక్కడా వినిపించదు మరి. ఆ విషయం పక్కన పెట్టి.. సినిమా విషయానికి వెళ్దాం. శ్రీకాంత్ అడ్డాల ప్రతీసారి తాను మాట్లాడకుండా తన సినిమాలు ఎక్కువగా మాట్లాడాలని తాపత్రయపడుతుంటాడు. కొత్త బంగారు లోకంతో యూత్ ని కదిలించాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో ఫ్యామిలీ ఎమోషన్స్ టచ్ చేశాడు. ఆ తర్వాత ముకుంద ఓ మెట్టు దిగి.. బ్రహ్మోత్సవంతో కొన్నాళ్ళు కనిపించకుండా పోయాడు.

కట్ చేస్తే.. కొన్నాళ్ళ గ్యాప్ తర్వాత నారప్ప రీమేక్ తో అందరిని సర్ప్రైజ్ చేశాడు. వెట్రిమారన్ తరహా మేకింగ్ తో నారప్పని.. అందులో ఎమోషన్స్ ని నిలబెట్టాడు. ఆ సినిమా తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకొని.. ఈసారి కూడా నారప్ప లాంటి రియాలిటీకి దగ్గరగా ఉన్న కథనే చెప్పాలని నమ్మాడు. పెదకాపుని రెడీ చేశాడు. విషయం ఏంటంటే.. శ్రీకాంత్ అడ్డాల పెదకాపు కల్చర్ చూస్తూ పెరిగాడు. ఎందుకంటే.. తాను కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే కావడం విశేషం. అయితే.. సినిమాలో 1980వ దశకం ఎంచుకొని.. దాని చుట్టూ తాను రియల్ లైఫ్ లో చూసిన ఇన్సిడెంట్స్.. ఎమోషన్స్ ని అల్లుకుంటూ పెదకాపు కథ రాసుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల.

ట్రైలర్ లో చూపించినట్లుగా.. సినిమా కాస్త పీరియడిక్ టచ్ తో సాగుతుంది. 1980లలో కథా నేపథ్యాన్ని పరిచయం చేస్తూ.. పెదకాపు అనే క్యారెక్టర్ ని పరిచయం చేసిన తీరు బాగుంది. సామాన్యుడిగా మనిషి ఎప్పుడు దుఃఖం నుంచి సుఖంలోకి.. చీకటి నుంచి వెలుగులోకి రావాలని అనుకుంటాడు. ఎదగాలని తపన పడతాడు. అప్పుడు అలా ఎదగాలి అనుకునేవాడికి, ఎదగనివ్వనోడికి, తన దారిన తాను పోయేవాడికి, ఆ దారి మూసేసి తోక్కేయ్యాలనుకునే వాడికి మధ్య యుద్ధం తప్పదు’ అంటూ తాను ఏం చెప్పబోతున్నాడో క్లారిటీ ఇచ్చేసాడు. శ్రీకాంత్ అడ్డాల స్క్రీన్ ప్లే స్టైల్ ఈ సినిమాలో కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది.

ఇక సినిమాలో ఎమోషన్స్ ప్రెజెంట్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం మాత్రం కాస్త కన్ఫ్యూస్ చేస్తుంది. ఎందుకంటే.. ఓ ఎమోషన్ ని చూపిస్తూ చివరిదాక వెళ్లి.. అక్కడినుండి వేరే ఎమోషన్ కి మార్చేస్తాడు. అది కొంచం ఇబ్బంది పెట్టే విషయం. ముందుగా ఓ పాప కథతో సినిమా మొదలై.. అది తెలుసుకునే లోపు పెదకాపు వైపు వెళ్తుంది. కట్ చేస్తే.. అక్కడినుండి వెంటనే బ్రదర్ సెంటిమెంట్ ఫాలో అవుతుంది. సరే అనుకునేలోపు కథ మొత్తం ఒక్కసారిగా రాజకీయ పార్టీ వైపు సాగుతుంది. ఇలా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం దర్శకుడు సన్నివేశాలలో సహజత్వం మిస్ అయినా పట్టించుకోలేదు అనిపిస్తుంది. కొన్ని పాత్రలు సరైన ఎండింగ్ లేకుండా ప్రవర్తిస్తుంటాయి.

సరే.. రెండు భాగాలుగా రాసుకున్నాడు కాబట్టి అలా చేశాడని అనుకోవచ్చు. కానీ.. చూపించిన క్యారెక్టర్స్ అయినా పూర్తి స్థాయిలో ఎలివేట్ చేసుంటే బాగుండు అని ప్రేక్షకులకు అనిపిస్తుంది. కానీ.. రెండో భాగానికి ఆసక్తి రేపే విషయంలో మాత్రం సగం సగం సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. పెదకాపు క్యారెక్టర్ ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తుంది. కొన్ని చోట్ల సామాన్యుడు అనే ఫీలింగ్ రాదు. హీరోయిన్ తో లవ్ ట్రాక్ పెద్ద ఇంపాక్ట్ కలిగించదు. ఇక రక్తపాతం విషయంలో హద్దులు దాటేసారని అనిపిస్తుంది. నిజంగా గోదావరి ప్రాంతంలో ఆ స్థాయి రక్తపాతం జరిగిందా అని ఆశ్చర్యం కలగకమానదు. అయితే.. పెదకాపు క్యారెక్టర్ లో ఎమోషన్స్ ని ఎలివేట్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఎక్స్ పెక్ట్ చేయలేరు.

పెదకాపు మొత్తానికి కొన్ని ఆటుపోట్ల మధ్య ఇంటెన్స్ డ్రామాతో సాగింది. కొత్త కుర్రాడు విరాట్ కర్ణకు నటనలో ఈజ్ ఉంది. కానీ.. భారీ డైలాగ్స్ వచ్చినప్పుడు కొత్త వాడని తేలిపోతుంది. మెయిన్ క్యారెక్టర్స్ లో ఆడుకాలం నరేన్, రావు రమేష్, తనికెళ్ళ భరణి, అనసూయ.. ఇలా చాలా క్యారెక్టర్స్ ఆకట్టుకుంటాయి. కానీ.. వాటిని నడిపించిన తీరు కొన్నిసార్లు నిరుత్సాహపరుస్తుంది. అందరు నటులు అదరగొట్టేసారు. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కూడా ఓ క్యారెక్టర్ లో ఎంటర్ అవ్వడం సర్ప్రైజ్ చేస్తుంది. సినిమాకు సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన బలాలు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. కొత్త జానర్ మార్చాడు. కానీ.. దాన్ని పూర్తి స్థాయిలో ప్రెజెంట్ చేయడంలో తడబడ్డాడు. పెదకాపు సంతకం జనాలు డిసైడ్ చేయాలి.

ప్లస్ లు:

  • క్యారెక్టర్స్ డిజైనింగ్
  • స్టోరీ ఐడియా
  • సినిమాటోగ్రఫీ
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • యాక్షన్ బ్లాక్స్/ఇంటర్వెల్

మైనస్ లు:

  • అసంపూర్ణమైన పాత్రలు
  • మల్టీపుల్ స్టోరీస్
  • సాంగ్స్

చివరిమాట: పెదకాపు.. కొంతవరకే మెప్పించాడు!

రేటింగ్: 2.5/5

(గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి