iDreamPost

బెదురులంక 2012 సినిమా రివ్యూ!

బెదురులంక 2012 సినిమా రివ్యూ!

హీరో కార్తికేయకు ఆర్ఎక్స్100 మూవీ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ ని ఏ మూవీ ఇవ్వలేకపోయాయి. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలను అందించలేదు. దీంతో ఇప్పుడు టైమ్ తీసుకొని మరీ ‘బెదురులంక 2012’ అనే మూవీ చేశాడు. యుగాంతం నేపథ్యంలో కామెడీ ఎంటర్టైన్మెంట్ తో రూపొందిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో క్లాక్స్ అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. బెన్నీ ముప్పనేని ఈ సినిమాని నిర్మించారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రిలీజై ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి బెదురులంక 2012.. కార్తికేయకు ఎలాంటి ఫలితం అందించింది? రివ్యూలో చూద్దాం!

కథ:

2012 డిసెంబర్.. ప్రపంచం అంతా యుగాంతం వస్తుందనే ప్రచారాన్ని నమ్మి భయంలో ఉంది. బెదురులంక అనే గ్రామానికి చెందిన భూషణం(అజయ్ ఘోష్.. ఊరి పంతులు బ్రహ్మం(శ్రీకాంత్ అయ్యంగర్), పాస్టర్ కొడుకు డేనియల్(రామ్ ప్రసాద్)లతో కలిసి.. ఊరి జనాలను మరింతగా భయపెట్టాలని ప్లాన్ వేస్తాడు. కట్ చేస్తే.. అదే ఊర్లో ఉండే శివ(కార్తికేయ) ప్రెసిడెంట్ కూతురు చిత్ర(నేహా శెట్టి)తో లవ్ లో ఉంటాడు. ఇలాంటి తరుణంలో భూషణం తన ప్లాన్ ప్రకారం.. ప్రెసిడెంట్ తో ఓ షాకింగ్ నిర్ణయం అనౌన్స్ చేయిస్తాడు. దీంతో ఊరంతా భయంలో ఉంటుంది.. కానీ, శివ ఒక్కడే భూషణం, ప్రెసిడెంట్ మాటలను లెక్క చేయడు. దాంతో శివను ఊరి నుండి వెలేస్తాడు ప్రెసిడెంట్. అక్కడినుండి శివ ప్రెసిడెంట్ ని ఎలా ఎదురించాడు? జనాలలో యుగాంతం మూఢనమ్మకాలను ర్ల పోగొట్టాడు? చివరికి తన ప్రేమను ఎలా గెలిచాడు? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

2012లో యుగాంతం అనే కాన్సెప్ట్ జనాలను ఎలా వణికించిందో అందరికీ తెలిసిందే. యుగాంతం వస్తుందని గుడ్డిగా నమ్మిన జనాలు.. ఎలా భయపడ్డారు? ఆ టైమ్ ని అదునుగా భావించి కొందరు మతాల పేరుతో ఎలా జనాల్ని మోసం చేశారు? అనేది బెదురులంక మూవీలో కంటిన్యూగా కనిపించే పాయింట్. ఇప్పటికి యుగాంతం బేస్ చేసుకొని చాలా సినిమాలు వచ్చాయి.. కానీ, అవన్నీ ఎక్కువగా సీరియస్ మోడ్ లో చూపించారు. అదే యుగాంతం కాన్సెప్ట్ ని డైరెక్టర్ క్లాక్స్.. పూర్తి స్థాయిలో కామెడీని జోడించి చూపించే ప్రయత్నం చేశాడు. పరిస్థితులు బట్టి.. మతాల పేరు చెప్పి జనాలను మోసం చేసేవారు ఎల్లప్పుడూ పుట్టుకొస్తూనే ఉంటారని ఇందులో మనకు అర్ధమయ్యేలా చూపించాడు.

సినిమా విషయానికి వస్తే.. ఫస్టాఫ్ లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ తో పాటు.. కథలోకి తీసుకెళ్లడానికి దర్శకుడు చాలా టైమ్ తీసుకున్నాడు. కాకపోతే యుగాంతం నేపథ్యంలో తాను రాసుకున్న స్క్రిప్ట్ మట్టుకు గట్టిగా ఫాలో అయినట్లు తెలుస్తుంది. మొదట కథలోకి తీసుకెళ్ళడానికి భూషణం.. బ్రహ్మం.. డేనియల్.. క్యారెక్టర్స్ తో పాటు ప్రెసిడెంట్, శివ, చిత్ర ఇలా చాలా క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యేసరికి మనకు కథలోకి వెళ్లడానికి చాలా టైమ్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. అయితే.. కామెడీ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ విషయంలో డైరెక్టర్ ని మెచ్చుకోవాలి. తాను ఈ జానర్ అయితే ఎంచుకున్నాడో అవన్నీ టచ్ చేస్తూనే సినిమా నడిపించాడు.

ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ ఇంకా బెటర్ గా రాసుకున్నాడు. ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ ఆలోచనాత్మకంగా ఉంటాయి. దేవుడి మీద భక్తి కంటే భయమే ఎక్కువగా కనిపిస్తుంది.. అని హీరో చెప్పే డైలాగ్ బాగుంది. ఊరంతా యుగాంతం భయంలో ఉంటే.. అదే ఆసరాగా చేసుకుని దోచేయాలని భావించే మనస్తత్వాలు ఓవైపు.. వాళ్లను ఎదురించి నిలిచి ఊరి నుండి వెలివేయబడిన హీరో ఓవైపు.. సెకండాఫ్ లో ఈ పోరు ఇంటరెస్టింగ్ గా అనిపిస్తుంది. ఎట్టకేలకు మూఢ నమ్మకాలతో నిండిపోయిన ఊరి జనాలను మార్చడం.. ఎంత కష్టమో చూపిస్తూ.. ఫుల్ ఫన్ తో నవ్వించాడు డైరెక్టర్. సినిమాలో గోదావరి జిల్లాల వెటకారం బాగా వర్కౌట్ అయింది. అన్ని క్యారెక్టర్స్ అక్కడి లోకాలిటికి దగ్గరగా అనిపిస్తాయి.

హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ పెద్దగా ఆకట్టుకోదు. ఎందుకంటే.. వారి లవ్ కి కరెక్ట్ బ్యాక్ డ్రాప్ చూపించలేదు. సినిమా నిడివి కూడా చిన్నదే కావడం ప్లస్ అని చెప్పాలి. అయితే.. శివ క్యారెక్టర్ లో కార్తికేయ బాగా మెప్పించాడు. ఓవైపు కామెడీతో పాటు చాలా వేరియేషన్స్ ఇందులో కనిపిస్తాయి. నేహా శెట్టి పర్వాలేదు. ఆమె క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ తక్కువగా ఉంది. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ తదితరులు మెప్పించారు. టెక్నికల్ గా సినిమాకు సినిమాటోగ్రఫీ బాగుంది. మణిశర్మ పాటల కంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ఆర్ట్ వర్క్, ఎడిటింగ్ కూడా బాగున్నాయి. అయితే.. డెబ్యూ డైరెక్టర్ క్లాక్స్ వర్క్ మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ లు:

  • కాన్సెప్ట్
  • కామెడీ
  • సినిమాటోగ్రఫీ
  • నిడివి

మైనస్ లు:

  • సాంగ్స్
  • లవ్ ట్రాక్

చివరిమాట: బెదురులంక.. బాగా నవ్విస్తుంది!

రేటింగ్: 2.5/5

(గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి