iDreamPost

ఆపరేషన్ కమలం.. ముందే మొదలైన రిసార్టు రాజకీయం

ఆపరేషన్ కమలం.. ముందే మొదలైన రిసార్టు రాజకీయం

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఏ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో ఎవరికీ తెలియదు.. ఉన్నట్టుండి పొలిటికల్ పిక్చర్ మారిపోతుంది. రాజకీయం రంగులు మారుతుంది. ప్రతిపక్షం అధికార పక్షం అయిపోతుంది.. అధికార పక్షం ప్రతిపక్షం అయిపోతుంది.. దీనికి ‘అధికార బదిలీ’ అని పేర్లు కూడా పెట్టాయి కొన్ని పార్టీలు. కొన్నిసార్లు తక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీ.. అధికారంలోకి ఎక్కుతుంది. ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంటుంది. వీటన్నింటికీ రిసార్టులు, స్టార్ హోటళ్లు కేంద్రాలు. రిసార్టు రాజకీయాలు గత కొన్నేళ్లుగా సాధారణం అయిపోయాయి.

ఈ అధికార బదిలీల్లో బీజేపీ ఈ మధ్య ముందుంటోంది. దీంతో అస్సాంలో కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడుతోంది. ‘ఆపరేషన్ కమల్’కు తమ పార్టీ అభ్యర్థులు ఆకర్షితులు కాకుండా చర్యలు తీసుకుంది. ఎన్నికల రిజల్ట్స్ రాకముందే తమ క్యాండిడేట్లను రిసార్టులకు తరలించింది. అస్సాంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని అనుకుంటున్న కాంగ్రెస్.. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

ఇలా ఎందుకు?

అస్సాంలో 10 పార్టీలతో కూడిన ‘మహాజాట్’కు కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది. ఈ క్రమంలో తమ అభ్యర్థులను ఈనెల 9న రాజస్థాన్ లోని జైపూర్ లో ఫైర్ మౌంట్ హోటల్‌కు తరలించింది. అయితే కరోనా భయంతో వీరిలో కొందరు తిరిగి గువాహటి వచ్చేశారు. దీంతో అస్సాంలోని కొన్ని హోటళ్లను కాంగ్రెస్ బుక్ చేసింది. ఈనెల 22న గువాహటి, కజిరంగా, తేజ్ పూర్ హోటళ్లకు వారిని తరలిస్తునట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బయట ఏం జరుగుతున్నదో తెలియకుండా మే 2వ తేదీ దాకా వారిని అక్కడే ఉంచనున్నట్లు పేర్కొంటున్నాయి. ఎన్నికల రిజల్ట్స్ రాగానే బీజేపీ ఫిరాయింపులకు దిగుతుందని కాంగ్రెస్ కూటమి భయపడుతోంది. గతంలో మేఘాలయ, మణిపూర్, గోవాలో కాంగ్రెస్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో ఈ సారి అలా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

గోవాలో ఎక్కువ సీట్లు సాధించినా..

2017 ఎన్నికల్లో బీజేపీకి తక్కువ సీట్లొచ్చాయి. మొత్తం 40 స్థానాల్లో 17 స్థానాల్లో కాంగ్రెస్, 13 స్థానాల్లో బీజేపీ, మహారాష్ట్రవాది గోమంతక్ 3 స్థానాలు, గోవా ఫార్వర్డ్ పార్టీ 3 స్థానాల్లో, ఎన్సీపీ 1 సీటులో గెలిచాయి. స్వతంత్రులు 3 స్థానాల్లో గెలుపొందారు. అయితే తక్కువ సీట్లు ఉన్నా.. ఇతర పార్టీల సభ్యులను చేర్చుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి తన సంఖ్యా బలాన్ని పెంచుకోవడం ప్రారంభించింది. తర్వాత కాంగ్రెస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంది.

Also Read : తిరుప‌తి బై పోల్ : త‌గ్గిన పోలింగ్ శాతంతో ఒణుకుతోంది ఎవరంటే…

కొన్ని నెలలపాటు సాగిన కర్ణాటకం

224 సీట్లు ఉన్న కర్ణాటక అసెంట్లీలో 222 సీట్లకు 2018లో ఎన్నికలు జరిగాయి. బీజేపీ 104 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ మెజారిటీకి 9 సీట్ల దూరంలో నిలిచిపోయింది. కాంగ్రెస్ 78, జేడీఎస్ 37 సీట్లలో గెలిచాయి. అయితే తగినంత బలం లేకున్నాగవర్నర్ ను కలిసిన బీజేపీ లీడర్ యడ్యూరప్ప.. తమకు మెజారిటీ ఉందని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడంతో కర్నాటక 23వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. అయితే బలం నిరూపించుకోలేక రెండు రోజులకే రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్ మద్దతుతో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ బీజేపీ దెబ్బకు ఏడాదికే కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. 15 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సభకు రాకుండా బీజేపీ చూసుకుంది. వారిని బెంగుళూరు నుంచి ముంబైలోని హోటల్ కు తరలించింది. అంతకుముందు 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించింది. దీంతో అవిశ్వాస తీర్మానంలో బీజేపీ గెలిచింది. యడ్యూరప్ప మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.

ఈ ఎపిసోడ్ కొన్ని నెలలపాటు సాగింది. హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. స్పీకర్ గా ఉన్న రమేశ్ కుమార్ బీజేపీ వ్యూహాలకు దీటుగా వ్యూహాలను రచించారు. కానీ చివరికి ఓటమికి అంగీకరించక తప్పలేదు. ఈ క్రమంలో మొదటినుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు మూడు పార్టీలు చాలా కష్టపడ్డాయి. కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను కర్ణాటక నుంచి వేరే ప్రాంతాలకు తరలించింది. శాసనసభ్యుల్ని రెండు గ్రూపులుగా విడదీసి… కొంతమందిని ఏపీకి.. మరికొందర్ని పంజాబ్‌కు తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి.

మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య వెన్నుపోటు

230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ 114, బీజేపీ 109 సీట్లు గెలిచాయి. నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఒకరు విజయం సాధించారు. మెజారిటీకి రెండు సీట్ల దూరంలో నిలిచిన కాంగ్రెస్.. ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఏడాదిన్నర కూడా గడవకముందే పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా రెబల్ గా మారారు. బీజేపీలోకి చేరిన ఆయన తనతోపాటు 19 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లారు. మొత్తం 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఈ క్రమంలో ఉన్న ఎమ్మెల్యేలు చేజారకుండా సుమారు 90 మందిని కాంగ్రెస్ జైపూర్‌కు తరలించింది. బీజేపీ కూడా 100 మంది ఎమ్మెల్యేలను గురుగ్రామ్‌లోని క్యాంప్‌కు తరలించింది. ఎంపీలో 2020 మార్చి 5న మొదలైన పొలిటికల్ డ్రామా 20 రోజులు సాగింది. మార్చి 20న కమల్ నాథ్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. 23వ తేదీ శివ రాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు. అలా కర్ణాటక తర్వాత మధ్యప్రదేశ్ లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అయింది.

Also Read : నేరడి బ్యారేజ్ వైపు జగన్ ముందడుగు

రాజస్థాన్ లో పప్పులు ఉడకలే

కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్ లో నడిచిన బీజేపీ రాజకీయాలు.. రాజస్థాన్ లో నడవలేదు. డిప్యూటీ సీఎంగా ఉన్న సచిన్ పైలట్ ద్వారా కాంగ్రెస్ సర్కారును పడగొట్టాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కలిసి.. సచిన్ పైలట్ ను పార్టీ మారకుండా అడ్డుకోగలిగారు. దీంతో కాంగ్రెస్ ఊరటకలిగింది. అదీకాక.. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కన్నేసిన బీజేపీ.. వరుసగా కూల్చుకుంటూ రావడాన్ని ముందే పసిగట్టింది. రాజస్థాన్ చేజారకుండా జాగ్రత్తపడింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఢిల్లీ – జైపూర్‌‌ హైవేలోని రిసార్ట్‌ కు తరలించింది. మధ్యప్రదేశ్‌లో ఎదురైన ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.

మహారాష్ట్రలో.. అటు అజిత్.. ఇటు ఉద్ధవ్

288 సీట్లు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన కూటములుగా బీజేపీ-శివసేన, కాంగ్రెస్-ఎన్సీపీ పోటీ చేశాయి. 105 సీట్లు గెలిచి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లలో గెలిచాయి. అయితే ముఖ్యమంత్రి పదవి తమకు ఇవ్వాలని పట్టుబట్టిన శివసేన.. అది కుదరకపోవడంతో బీజేపీ కూటమి నుంచి బయటికి వచ్చింది. ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజారిటీ లేకపోవడంతో గవర్నర్ అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టారు.

కొన్నాళ్లకు కాంగ్రెస్, ఎన్సీపీతో చర్చలు జరిపిన శివసేన.. ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే కూడా రెడీ అయ్యారు. కానీ ఇంతలో బీజేపీ షాక్ ఇచ్చింది. శరద్ పవార్ బంధువైన అజిత్ పవార్.. బీజేపీతో జతకట్టారు. దీంతో ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు. అజిత్ తీరును వ్యతిరేకించిన శరద్ పవార్.. తాము శివసేన, కాంగ్రెస్ తోనే ముందుకు వెళ్తామని ప్రకటించారు. దీంతో మహా రాజకీయం అసక్తికరంగా మారింది. తగిన బలం లేక ఫడ్నవీస్, అజిత్ పవార్ రాజీనామా చేశారు. తర్వాత అజిత్ పవార్ తిరిగి ఎన్సీపీలోకి రావడంతో అంతా సర్దుమణిగింది. ఉద్ధవ్ థాక్రే మఖ్యమంత్రి అయ్యారు. అజిత్ మళ్లీ డిప్యూటీ సీఎం అయ్యారు.

ఈ సమయంలో ఇక్కడ రిసార్టు రాజకీయాలు జోరుగా సాగాయి. కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ, శివసేన పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రిసార్టులకు, హోటళ్లకు తరలించాయి. శివసేన తమ లీడర్లను రంగ్ శారద అనే హోటల్ లో ఉంచింది. రాజస్థాన్ లోని జైపూర్ లో బుయేనా విస్టా రిసార్ట్స్ కి కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను తరలించింది.

ఈ తరహాలో బిజెపి చేస్తున్న రాజకీయాలను దృష్టి లో పెట్టుకున్న కాంగ్రెస్ అస్సాం లో ముందుగానే జాగ్రత్త పడుతోంది. అస్సాం భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో మే 2 వ తేదీ తర్వాత తెలుస్తుంది.

Also Read : పాయింట్ గట్టిదే కానీ లెట్ అయ్యింది రేవంత్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి