iDreamPost

రవితేజను గోపీచంద్ గట్టెక్కిస్తాడా?

రవితేజను గోపీచంద్ గట్టెక్కిస్తాడా?

మాస్ మహారాజ్ రవితేజ సినిమా వస్తుందంటే మాస్ ఆడియెన్స్ కి పండగే.. అలాంటిది గత కొద్ది సంవత్సరాలుగా రవితేజ కెరీర్ తిరోగమనంలో ఉంది. మూస ధోరణిలో సినిమాలు చేస్తున్న రవితేజకి అనుకోని అపజయాలు ఎదురవుతున్నాయి.

దాంతో కొత్త ప్రయత్నంగా సైన్స్ ఫిక్షన్ చిత్రం డిస్కో రాజాతో ప్రేక్షకులను పలకరించాడు రవితేజ. స్టోరీ లైన్ పరంగా మాత్రమే కొత్తగా కనిపించిన డిస్కోరాజా స్క్రీన్ ప్లే పరంగా రొటీన్ బాట పట్టడంతో ప్రేక్షకులు నిర్ధ్వందంగా తిరస్కరించారు. ఇప్పటికే రవితేజ నటించిన “టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంథోనీ” లు ఘోర పరాజయాలు పాలవడంతో, డిస్కో రాజా మాత్రం విన్నూత్న కథాంశంతో రూపొందుతుందని రవితేజ మొదటినుండి చెప్పుకొచ్చాడు.. డిస్కో రాజాకి సీక్వెల్ కూడా ఉంటుందని నమ్మకంగా చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

కానీ విన్నూత్న కథాంశం కాస్త రొటీన్ కథాంశంగా మారిపోవడంతో, భారీ డిజాస్టర్ గా తేలిపోయింది. ఇప్పటికే తెలుగులో మార్కెట్ కోల్పోయిన రవితేజకు ఇది మింగుడు పడని విషయమే.. ఇప్పుడు రవితేజ ఆశలన్నీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న “క్రాక్” పైనే ఉన్నాయి. గతంలో కూడా రవితేజ ప్లాపుల్లో ఉన్నప్పుడు హిట్ ట్రాక్ ఎక్కించిన ఘనత గోపీచంద్ మలినేనికి ఉంది.

కిక్ విజయం తర్వాత రవితేజ నటించిన ఆంజనేయులు, శంభో శివ శంభో పరాజయం పాలవగా, డాన్ శీనుతో రవితేజకు మళ్ళీ హిట్ రుచి చూపించాడు గోపీచంద్ మలినేని.. “మిరపకాయ్” విజయం తర్వాత వరుసగా 5 పరాజయాలు ఎదురయ్యాయి. దొంగల ముఠా, వీర, నిప్పు, దరువు, సారొచ్చారు వరుసగా ప్లాపులుగా మారడంతో, రవితేజ కెరీర్ ఒడిదుడుకులకు లోనయ్యింది. దీంతో గోపీచంద్ మలినేని బలుపు సినిమాతో మళ్ళీ రవితేజను హిట్ ట్రాక్ ఎక్కించాడు.

ఇప్పుడు వరుసగా నాలుగు ప్లాపులతో మరోసారి రవితేజ కెరీర్ భారీ ఒడిదుడుకులకు లోనయ్యింది. రవితేజ కథల ఎంపికపై ప్రేక్షకులకు అనుమానాలు కూడా మొదలయ్యాయి. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో మాస్ మహారాజా ఉన్నాడు. ఇప్పుడు  రవితేజ ఆశలన్నీ గోపీచంద్ రూపొందించబోయే క్రాక్ పైనే ఉన్నాయి. తనకి అచ్చోచ్చినా డైరెక్టర్ కావడం, రవితేజను మాస్ కి ఎలా చూపించాలో తెలిసిన డైరెక్టర్ కావడంతో క్రాక్ పై ప్రస్తుతానికి మంచి అంచనాలే ఉన్నాయి. ఒకవేళ క్రాక్ కూడా పరాజయం పాలయితే రవితేజ కెరీర్ గురించి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి