iDreamPost

మాస్ మహారాజా కథ మళ్ళి మొదటికే

మాస్ మహారాజా కథ మళ్ళి మొదటికే

నిన్న విడుదలైన రవితేజ డిస్కో రాజాకు ఆశించిన టాక్ రాలేదు. మీడియాలో సైతం రివ్యూలు నెగటివ్ గా ఉండటం దీనికి శరాఘాతంగా మారింది. కథలో పాయింట్ మంచిదే అయినప్పటికీ దాన్ని డీల్ చేయడంలో దర్శకుడు విఐ ఆనంద్ చేసిన పొరపాట్లు నిర్మాతలు కూడా మూల్యాన్ని చెల్లించేలా చేశాయి. మాస్ మహారాజా మార్కెట్ కు మించి బడ్జెట్ ని ఖర్చు పెట్టిన వాళ్ళకు మొత్తం పెట్టుబడి రావడం కష్టమే అనిపిస్తోంది. రవితేజకు ఇది నాలుగో డిజాస్టర్ గా మిగలడం ఖాయమని ట్రేడ్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేసింది.

ఈ వీకెండ్ ని డిస్కో రాజా ఎలా కాపాడుకుంటాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇప్పుడు చెప్పుకోదగ్గ వసూళ్లు రాకపోతే ఇక రెండో వారం మీద ఆశలు పెట్టుకోవడం కూడా కష్టమే. గత ఏడాది మొత్తం గ్యాప్ తీసుకుని తనలో ఎనర్జీని పూర్తిగా వాడుకుంటూ రవితేజ చాలా మనసు పెట్టి డిస్కో రాజా చేశాడు. 2018లో టచ్ చేసి చూడు, నేల టికెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ తాలూకు గాయాలు ఇది మాన్చేస్తుందని చాలా నమ్మకంతో ఉన్నాడు. ఇప్పుడు అది కాస్తా వమ్ము అయ్యింది.

ఒకప్పుడు మార్కెట్ లో చాలా బలంగా ఉండి ఈజీగా 25 కోట్లు రాబట్టే స్టేజి నుంచి ఇప్పుడు 10 కోట్లు రావడమే మహా కష్టంగా మారిపోయిన తరుణంలో రవితేజకు సాలిడ్ హిట్ ఇచ్చే దర్శకుడు కావాలి. ఇప్పటికీ తనకు మంచి ఫాలోయింగ్ ఉంది. నిన్న ఓపెనింగ్స్ రూపంలో అది బయట పడింది కూడా. సరైన కథను ఎంచుకుని దానికి తగ్గట్టు దర్శకుడు మెప్పించే స్థాయిలో తీయగలిగితే అంతకన్నా ఫ్యాన్స్ కోరుకునేది ఏముంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి