iDreamPost

Rashmi Rocket : రష్మి రాకెట్ సినిమా రిపోర్ట్

Rashmi Rocket : రష్మి రాకెట్ సినిమా రిపోర్ట్

గత రెండు మూడేళ్లుగా బాలీవుడ్లో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలను దక్కించుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్న తాప్సీ పన్ను కొత్త సినిమా రష్మీ రాకెట్ మొన్న జీ 5 ద్వారా నేరుగా ఓటిటి రిలీజ్ లో వచ్చేసింది. గతంలో థియేట్రికల్ విడుదల ప్రయత్నాలు చేశారు కానీ వివిధ కారణాల వల్ల సాధ్యం కాకపోవడంతో ఫైనల్ గా డిజిటల్ కే ఓటు వేశారు. ఆకాష్ ఖురానా దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా కేవలం తాప్సీ ఇమేజ్ మీద మార్కెట్ చేశారు. తను తప్ప ఇంకే స్టార్ మెటీరియల్ ఇందులో లేకపోవడంతో బ్రాండింగ్ మొత్తం హీరోయిన్ పేరు మీదే జరిగింది. మరి ఈ స్పోర్ట్స్ కం సోషల్ డ్రామా మెప్పించేలా ఉందో లేదో రిపోర్ట్ లో చూద్దాం

ఇది అబ్బాయిగా అభియోగం మోపబడ్డ ఓ లేడీ అథ్లెట్ కథ. గుజరాత్ భుజ్ ప్రాంతానికి చెందిన రష్మి(తాప్సీ పన్ను)పరుగులో గొప్ప నైపుణ్యం కలిగి ఉంటుంది. 2001 భూకంపంలో తండ్రిని కోల్పోయాక ఆ క్రీడను మానేస్తుంది. తల్లి భానుబెన్(సుప్రియ పాఠక్)తో పాటు ఆర్మీ క్యాంపుకు దగ్గరలో ఉండే రష్మికి అక్కడ స్నేహితులు ఏర్పడతారు. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఓ సైనికుడి ప్రాణాలను రష్మి కాపాడిన తీరు చూసిన కెప్టెన్ గగన్ ఠాకూర్(ప్రియాంశు పైనులి)ఆమెను మళ్ళీ అథ్లెట్ వైపు ప్రోత్సహిస్తాడు. ఆసియన్ గేమ్స్ లో మూడు మెడల్స్ సాధించాక రష్మి లింగ నిర్ధారణ మీద అనుమానాలు రేకెత్తుతాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.

రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాగా కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్ ను తీసుకున్న సాహసం చేసిన ఆకాష్ ఖురానా దాన్ని పూర్తి స్థాయి ఎంగేజింగ్ గా తీయడం మాత్రం తడబడ్డారు. కోర్ట్ రూమ్ లో జరిగే సన్నివేశాలు దానికి ముందు వెనుకా వచ్చే సన్నివేశాలు ల్యాగ్ కు గురయ్యాయి. అయినా కూడా ఆర్టిస్టుల నటన, క్లిష్టమైన అంశాలను హ్యాండిల్ చేసిన తీరు క్రీడా నేపధ్యం కలిగిన సినిమాలను ఇష్టపడే వాళ్ళను ఆకట్టుకుంటుంది. ఎంఎస్ ధోని లాంటి గ్లామర్ టచ్ ఇందులో లేకపోయినా స్పోర్ట్స్ వరల్డ్ లో తెరెవెనుక జరిగే దారుణాలు అవమానాలు చూపించే ప్రయత్నం బాగుంది. పూర్తిగా నిరాశ పరిచే అవకాశం లేని రష్మి రాకెట్ ని వన్ టైం వాచ్ ఆప్షన్ గా పెట్టుకోవచ్చు

Also Read : Movie Collections : కలెక్షన్ల టార్గెట్ 35 కోట్లు దాటితే ఏంటి పరిస్థితి 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి