iDreamPost

అటు జనసేన సమావేశం ఇటు ఎడ్ల పందాలు… రాపాక ఎటు?

అటు జనసేన సమావేశం ఇటు ఎడ్ల పందాలు… రాపాక ఎటు?

మొదటినుండి జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు అప్పుడప్పుడూ షాకులిస్తూనే ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే అనేక సందర్భాల్లో పవన్ అభీష్టానికి వ్యతిరేకంగా రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలు చేయడం అప్పుడప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉంది. తాజాగా అలాంటి సంఘటన మరోసారి జరిగింది.

మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులోపవన్ కళ్యాణ్ తలపెట్టిన విస్తృత సమావేశానికి హాజరు కాకుండా గుడివాడలో ఎడ్ల పందేలను తిలకించడానికి రాపాక వరప్రసాద్ వెళ్లడం చర్చనీయాంశం అయింది. మొదటినుండి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ వ్యవహరిస్తున్న రాపాక తీరు చర్చనీయాంశంగానే ఉంది.

కృష్ణాజిల్లా గుడివాడలో ఎన్టీఆర్‌ టు వైఎస్సార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలను మంత్రి కొడాలి నానితో కలిసి ఎమ్మెల్యే రాపాక ప్రారంభించారు. రాపాక వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, కొడాలి నాని ఎడ్లపందేలను చూడటానికి రమ్మని ఆహ్వానించినందువల్లే గుడివాడ వెళ్లాలని తెలిపారు.తనకు ఎడ్ల పందేలు చూడటం అంటే ఇష్టమని తెలిపారు. తనను ఆహ్వానించిన కొడాలి నానికి కృతజ్ఞతలు రాపాక వరప్రసాద్ తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్న ప్రభుత్వానికి తన మద్దతు అని స్పష్టం చేసారు. రాజధాని రైతులు రోడ్లపై ధర్నాలు చేసే బదులు జగన్ ని కలిస్తే న్యాయం జరుగుతుందని రాపాక వరప్రసాద్ పేర్కొన్నారు.

మా నాయకుడు పవన్ కల్యాణ్‌కు నాకు మధ్య ఎటువంటి చర్చలు ఉండవు అని తేల్చి చెప్పడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కి మధ్య ఏం జరుగుతుందనేది జనసేన కార్యకర్తలకు అర్ధం కావడం లేదు. కావాలనే రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నిర్వహించిన విస్తృత సమావేశానికి హాజరు కాలేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. సమావేశం మధ్యలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లిపోవడంతో సమావేశం జరగలేదు. కాగా కేంద్ర ప్రభుత్వ పెద్దల అపాయింట్ మెంట్ ఖరారు అయినందువల్లే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారని జనసేన పార్టీ నాయకులు తెలిపారు.

కాగా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, పార్టీ సమావేశాలకు గైర్హాజరు అవుతున్న రాపాకపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటారని గతంలో ఊహాగానాలు వెలువడ్డాయి. తాజా సంఘటనతో మరోసారి రాపాక విషయమై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి