iDreamPost

కనువిందుచేసే ‘తూర్పు’ ప్రకృతి వెనుక కనిపించని అసాంఘిక శక్తులు

కనువిందుచేసే ‘తూర్పు’ ప్రకృతి వెనుక కనిపించని అసాంఘిక శక్తులు

తూర్పుగోదావరి జిల్లా మన్యం అంటే.. కొండలు, కోనలు.. ఎత్తేయిన చెట్లు.. చల్లని వాతావరణం, కల్మషం ఎరుగన అడవి బిడ్డలు. అడవి తల్లి ఒడిలో సేద తీరేందుకు వెళ్లే పర్యాటకులకు కనిపించేవి ఇవి మాత్రమే. కానీ ఆ కనువిందు చేసే ప్రకృతి వెనుక కనిపించని అసాంఘిక శక్తులు ఎన్నో ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు మన్యాన్ని అడ్డాగా చేసుకుని యథేచ్ఛగా సాగిస్తున్నాయి. వారి కాసుల కక్కుర్తికి అభం శుభం తెలియని అబలలు బలవుతున్నారు.

తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడికి చెందిన ఓ 16 ఏళ్ల బాలిక రంపచోడవరంలో సామూహిక అత్యాచారానికి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. రాజమహేంద్రవరంలో బట్టల దుకాణంలో పనికి వెళ్లిన ఆ బాలికను తెలిసిన వారే.. 50 కిలోమీటర్ల దూరంలోని ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం తీసుకెళ్లారు. 12 మంది అ బాలికపై బలాత్కారం చేశారు. బాలికపై బలాత్కారం చేసేందుకు రాజమండ్రి నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని రంపచోడవరానికే ఎందుకు తీసుకెళ్లారు..? అటవీ ప్రాంతమైతే రంపచోడవరానికి 20 కిలోమీటర్ల ముందే మండల కేంద్రమైన గోకవరం ఉంది. రాజమండ్రి చుట్టుపక్కల అటవీ ప్రాంతం ఉంది. కానీ ఆ బాలికను రంపచోడవరం ఎందుకు తీసుకెళ్లారన్న విషయంపై పోలీసులు దృష్టి పెడితే సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి.

తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు మినహా ఇతర ప్రాంతాల వారు తూర్పు మన్యంలోని మారేడుమిల్లిని సందర్శించేందుకు ఆసక్తి చూపుతారు. టూరిస్టు ప్రాంతంగా మారేడుమిల్లి ప్రసిద్ధి చెందింది. అయితే మారేడుమిల్లికి 30 కిలోమీటర్ల ముందే ఉన్న రంపచోడవరంలో గడిపేందుకు ఉభయగోదావరి జిల్లాల బడాబాబులు, అధికారులు, రాజకీయ నాయకులు ఆసక్తి చూపుతారు. వారాంతాల్లో రంపచోడవరం మైదాన ప్రాంతం వారితో కళకళలాడుతుంటుంది. కార్లు చక్కర్లు కొడతాయి. కారణం రేవ్‌ పార్టీలు, చికెన్, మటన్‌ మాత్రమే కాదు కోరుకున్న మాంసం, మద్యం అక్కడ లభిస్తుంది. రిసార్టుల్లో అర్థరాత్రి రేవ్‌ పార్టీలు, వ్యభిచారం సర్వసాధారణం. రంపచోడవరాన్ని కేంద్రంగా చేసుకుని అసాంఘిక శక్తులు గత కొన్నేళ్లుగా చెలరేగిపోతున్నాయి.

రంపచోడవరంలో జరిగే వ్యవహారాలు స్థానికంగా ఉండే అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలియంది కాదు. వారికి తెలియకుండా అక్కడ ఏమీ జరగదు. అయినా ఆ వైపు కన్నెత్తిచూడరు. శని, ఆది వారాల్లో రంపచోడవరంలో సోదాలు నిర్వహిస్తే అక్కడ జరిగే అసాంఘిక కార్యకలాపాలు వెలుగుచూస్తాయి. కొత్తగా వచ్చిన పోలీసు అధికారి రేవ్‌ పార్టీలపై దాడులు చేసిన ఘటనలు గతంలో జరిగాయి. అయితే ఆ దాడులు వెలుగులోకి రాలేదు. కనీసం పత్రికల్లో కూడా సింగిల్‌ కాలమ్‌ వార్తకు పరిమితం అయ్యేవి. ఏ మాత్రం సివియారిటీ లేకుండా సాధారణ వ్యవహారంలా ఆ వార్తల్లో సమాచారం ఉండేది.

రాజమండ్రి బాలికపై జరిగిన సామూహిక అత్యాచారంపై లోతుగా దర్యాప్తు చేస్తే రంపచోడవరంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలు వెలుగులోకి వస్తాయి. ఆ బాలికను రంపచోడవరంలో ఎక్కడికి తీసుకెళ్లారు..? ఎక్కడ ఉంచారు..? అక్కడ వారు ఉండేందుకు ఆవాసం ఎవరు కల్పించారు..? రిసార్టులు అనుమతులు ఉన్నాయా..?రంపచోడవరంలో ఏమి జరిగింది..? అనే అంశాలపై సిన్సియర్‌ అధికారి అయిన రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ షిముషి బాజ్‌పేయి దృష్టి పెడితే అక్రమార్కులకు అడ్డుకట్ట పడుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి