iDreamPost

గెలిచే అవకాశం ఉంటే ‘వర్ల’కు ఇస్తారా..!

గెలిచే అవకాశం ఉంటే ‘వర్ల’కు ఇస్తారా..!

ప్రజా కోర్టులో ఓట్లు వేసి గెలిచే విషయంలో.. గెలుపు, ఓటములను ప్రజలే నిర్ణయిస్తారు. ఈ కోర్టులో గెలిచేస్తామన్న ధీమా కంటే గెలవకపోతామా? అన్న ఆశే ఎక్కువగా ఉంటుంది. అదే పెద్దల సభ వంటి వాటిలో గెలవడం, ఓడిపోవడం అన్నది ఆయా రాజకీయ పక్షాల బలాబలాలపై ఆధారపడి ఉంటుంది. తమకు ఉన్న సభ్యుల సంఖ్యను బట్టి ఆ పార్టీ అభ్యర్ధి గెలుస్తాడో? లేదో? ముందుగానే తెలిసిపోతుంది. అనూహ్యమైన పరిస్థితులు, బొటాబొటీ సభ్యుల సంఖ్య వంటి విపరీత రాజకీయ పోకడలు ఉంటే తప్ప ఈ గెలుపు, ఓటములు ఖరారు కావడం దాదాపు ముందుగానే నిర్ణయించబడుతుంది. ఇది అదరికీ తెలిసిన విషయమే.

ఇప్పుడు ప్రస్తావనార్హం ఏంటంటే రాజ్యసభ లో ఖచ్చితంగా గెలిచే అవకాశమే ఉండి ఉంటే టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అవకాశం ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వర్ల రామయ్యకు ఇచ్చుండేవారా? అన్న ప్రశ్న ప్రస్తుతం జోరుగా విన్పిస్తోంది. పార్టీకి అవసరమైన ప్రతిసారీ మైకుముందు కొచ్చి పార్టీ గొంతును విన్పించేందుకు వర్లరామయ్య శక్తి మేరకు కృషి చేస్తున్నారు. అయితే గత రాజ్యసభ ఎన్నికల్లో ఆయనకు అవకాశం ఇచ్చేందుకు ఛాన్స్‌ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఆఖరివరకు ఊరించి, రామయ్యను ఉస్సూరుమన్పించేసారు. పార్టీకి ఆర్ధిక దన్నుగా ఉన్న సీయం రమేష్‌కు, కనకమేడల రవీంద్రకుమార్‌లకు కేటాయించారు. దీంతో అవసరార్ధ రాజకీయం చేసే చంద్రబాబు తీరు ఇంతేగా అన్న నిట్టూర్పులు సొంతపార్టీ నేతల్లోనూ, అప్పట్లో అలకబూనిన వర్ల రామయ్య నుంచి కూడా విన్పించాయి.

అయితే ఇప్పుడు జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరపున అభ్యర్ధి గెలవాలంటే 40 మందికిపైగా ఎమ్మెల్యేలు అవసరం. ఉన్నదేమో 23 మందాయే. సాంకేతికం ఇందులో ఎంత మంది తమకు ఓటు వేస్తారో? అన్నది చంద్రబాబుక్కూడా సందేహం. ఇటువంటి పరిస్థితుల్లో వర్ల రామయ్యకు సీటు కేటాయించడం ద్వారా రాజకీయ సమాజానికి ఎటువంటి మెస్సేజ్‌ ఇద్దామనుకుంటున్నారంటావ్‌? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

చంద్రబాబు గురించి బాగా తెలిసిన వారు ‘అవసరానికి వాడుకోవడంలో ఈయన్ను మించిన వారులేరుగా’ అంటూ సర్ధిచెప్పుకుంటున్నప్పటికీ, మరీ ఇంత దారుణమా అంటూ ప్రజలు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు. బలవంతంగా టీడీపీపై రుద్దబడ్డ లోకేష్‌ను కాదని, వర్ల రామయ్యకు సీటు కేటాయించినప్పుడే చంద్రబాబు చిత్తశుద్ది బైటపడింది అంటూ ప్రత్యర్ధి పార్టీలు ఇప్పటికే మైకుల ముందు మోతమోగించేస్తున్నాయి. అయినప్పటికీ ‘ఏదో’ రాజకీయ వ్యూహం రచిస్తున్న మాదిరి వర్లరామయ్యను అభ్యర్ధిగా ప్రటించేసారు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా చంద్రబాబుకు ఒక సూటి ప్రశ్న ఉత్పన్నమవుతోంది.. గెలిచే అవకాశం లేకపోతే ఎస్సీలు, బీసీలకు సీట్లు కేటాఇస్తారా? ఖచ్చితంగా గెలిచేటప్పుడు మాత్రం పెట్టుబడిదారులకు సీట్లు ఇస్తారా? అంటూ ఉన్నదున్నట్లుగానే అడిగేస్తున్నారు.

అయితే ఇక్కడ చంద్రబాబు మార్కు రాజకీయ స్ట్రాటజీ తెలిసిన వారు మాత్రం ‘‘ఎవరితో ఉపయోగం ఉంటే వారితో మాత్రమే చంద్రబాబు మాట్లాడతారు’’ అన్న మాటను గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అధికార పార్టీమీద ‘‘దళితులు, బీసీలకు ఈ పార్ట వ్యతిరేకంగా ఉందన్న ముద్రవేయడమే’’ చంద్రబాబు అవలంభిస్తున్న రాజకీయం. అందుకు అనుగుణంగానే ఆయన పనులు ఉంటాయని కొందరు విశ్లేషకులు చెబుతున్న మాటలను కూడా ఇక్కడ పక్కనపెట్టేయడానికి వీల్లేదు. ఏది ఏమైనా తుమ్మితే ఊడిపోయే ముక్కుకోసం వర్లరామయ్యలాంటి కరుడుగట్టిన టీడీపీ నాయకుడిని ఎరగా వెయ్యాలనుకోవడం చంద్రబాబు ‘వాడుకుని’ వదిలేసే విధానాన్ని మరోసారి ప్రజలకు గుర్తు చేస్తోందన్నది విస్తృతంగా ప్రజల్లో చర్చసాగుతోందన్నది పలువురి విశ్వాసం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి