iDreamPost

దేవుడు ఆదేశించాడు.. రజనీ వెనక్కితగ్గారు..

దేవుడు ఆదేశించాడు.. రజనీ వెనక్కితగ్గారు..

రాజకీయాల్లోకి వస్తున్నానని ఇటీవల ప్రకటించిన తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. వెనక్కి తగ్గారు. 31వ తేదీన పార్టీ పేరు, ఇతర వివరాలు ప్రకటిస్తానని రజనీకాంత్‌ తెలపడంతో.. ఆయన అభిమాలు, దేశ వ్యాప్తంగా రాజకీయ ఔత్సాహికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో తాను రాజకీయాల్లోకి రావడంలేదని, పూర్తిగా తప్పుకుంటున్నానని ప్రకటించిన రజనీకాంత్‌.. ఆయన అభిమానుల్లో తీవ్ర నిరుత్సాహాన్ని నింపారు. దేవుడు ఆదేశించాడని, అందుకే రాజకీయాల్లోకి రావడంలేదంటూ రజనీ పేర్కొన్నారు. తన నిర్ణయం వెనుక కారణాలను వెల్లడిస్తూ, అభిమానులకు క్షమాపణ చెబుతూ మూడు పేజీల లేఖను రజనీ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు.

‘‘అనారోగ్య కారణాల వల్లే నేను రాజకీయాలకు దూరం అవుతున్నాను. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంటున్నందుకు అందరూ క్షమించండి. రాజకీయ ప్రకటనకు ముందు నేను అనారోగ్యానికి గురవడం, ఆసుపత్రిలో చేరడం.. ఇవన్నీ దేవుడి హెచ్చరికగా భావిస్తున్నాను. అందుకే రాజకీయాల్లో అడుగుపెట్టకూడదని నిర్ణయించుకున్నాను.

అంతేకాదు ప్రసార మాధ్యమాల ద్వారానో, సోషల్ మీడియా ద్వారానో ప్రచారం చేసి రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావడం సాధ్యం కాదు. లక్షలాది మంది ప్రజల్ని నేరుగా కలిసి వారితో చర్చిస్తేనే రాజకాయాల్లో సమూల మార్పు సాధ్యపడుతుంది. ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితుల్లో అది అసంభవం. అంతేకాదు కరోనా కొత్త రూపాన్నీ సంతరించుకుంటోంది. ఈ పరిణామాలన్నింటికీ గమనించే నేను రాజకీయాలకు దూరం అవుతున్నాను’ అంటూ రజినీకాంత్ తన లేఖలో వివరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి