iDreamPost

ఊహించిన విధంగానే రాజస్థాన్‌ రాజ్యసభ ఫలితాలు.

ఊహించిన విధంగానే రాజస్థాన్‌ రాజ్యసభ  ఫలితాలు.

రాజస్థాన్‌లో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా ఊహించిన విధంగానే వచ్చాయి. ఇవాళ జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష బిజెపికి ఒకస్థానం దక్కింది.

రాజస్థాన్‌లో ఖాళీగా ఉన్న మూడు స్థానాలలో ప్రతిపక్ష బిజెపి రెండిటిలో విజయం కోసం ఢిల్లీ పెద్దల అండదండలతో వ్యూహాలు రచించిన ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీ వేణు గోపాల్, నీరజ్ డాంగి విజయం సాధించగా బిజెపి నుంచి రాజేంద్ర గెహ్లాట్ ఎగువ సభకు ఎన్నికయ్యారు. ఇక బిజెపి నుంచి రెండో అభ్యర్థిగా బరిలోకి దిగిన ఓంకార్ సింగ్ లఖావత్ పరాభవాన్ని మూటగట్టుకున్నాడు.

రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ తర్వాత ఈ నెల మొదట్లో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రతిపక్ష బిజెపి తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతోందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ఆరోపించాడు. అలాగే తన ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి బిజెపి నాయకత్వం ప్రయత్నిస్తుందని ప్రతిపక్ష శిబిరాన్ని సీఎం నిందించాడు. ఇదే సమయంలో ప్రతిపక్ష బిజెపి కూడా అధికార పక్షంపై ఇదే రకమైన ఆరోపణలను మోపింది. ఈ నేపథ్యంలో అధికార,ప్రతిపక్ష పార్టీలు తమ శాసనసభ్యులను ఖరీదైన హోటల్‌కు తరలించి క్యాంపు రాజకీయాలను నడిపాయి.

200 మంది శాసనసభ సభ్యులలో కాంగ్రెస్‌కు 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు, రాష్ట్రీయ లోక్‌దళ్, సిపిఐ (ఎం), భారతీయ గిరిజన పార్టీ (బిటిపి) వంటి ఇతర పార్టీల శాసనసభ్యుల మద్దతు కూడా ఉంది.

అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి పార్టీలలోని ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి అంకగణితం 2-1తో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. కానీ బిజెపి తమ రెండో అభ్యర్థిగా ఓంకర్ సింగ్ లఖవత్ ను ప్రకటించింది. దీంతో మూడు ఖాళీ సీట్ల కోసం నలుగురు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కానీ బిజెపి తమ రెండో అభ్యర్థికి గెలుపుకు సరిపడిన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంలో విఫలం చెందింది.

ఇక నేటి రాజ్యసభ ఎన్నికలలో మొత్తం 200 ఓట్లకు గాను చెల్లుబాటు అయిన 198 ఓట్లు లెక్కించబడ్డాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థులు అయిన వేణుగోపాల్‌కు 64 ఓట్లు రాగా, నీరజ్ డాంగి కి 59 ఓట్లు వచ్చాయి. బిజెపి ప్రధాన అభ్యర్థి రాజేంద్ర గెహ్లోట్ 54 ఓట్లు దక్కించుకోగా రెండవ అభ్యర్థి ఓంకర్ సింగ్ లఖవత్ 20 ఓట్లు మాత్రమే పొందాడు. ఎగువ సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరికీ కలిపి మొత్తం 123 ఓట్లు రాగా, బిజెపి అభ్యర్థులకు అనుకూలంగా 74 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

శుక్రవారం ఫలితాలతో మొత్తం పది రాజ్యసభ స్థానాలు ఉన్న రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఇద్దరి అభ్యర్థుల తాజా విజయంతో ఆ పార్టీ ఎంపీల సంఖ్య మూడుకు పెరిగింది. ఎగువ సభలో ప్రతిపక్ష బిజెపి ప్రాతినిథ్యం 7కు పడిపోయింది. ఇక రాజస్థాన్ గురించి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ మూడో రాజ్యసభ సభ్యుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.

తాజాగా ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ పార్టీ కేంద్ర నాయకత్వానికి అత్యంత సన్నిహితుడు కాగా నీరజ్ డాంగి పార్టీ దళిత నేత మరియు ముఖ్యమంత్రి గెహ్లోట్ కు విశ్వసనీయమైన సహాయకుడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి