iDreamPost

ఏపీ సీఎం జగన్ తో భేటీ కానున్న రాజమౌళి, దానయ్య.. అందుకేనా?

ఏపీ సీఎం జగన్ తో భేటీ కానున్న రాజమౌళి, దానయ్య.. అందుకేనా?

ఇటీవల ఏపీలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలని పరిష్కరించాలని కోరుతూ చిరంజీవితో సహా పలువురు సినీ ప్రముఖులు ఏపీ సీఎం జగన్‌ని కలిశారన్న సంగతి తెలిసిందే. ఆ భేటీలో సినీపరిశ్రమకి ప్రభుత్వం తరపున సపోర్ట్ చేస్తామని జగన్ ప్రకటించారు. రాధేశ్యామ్ సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు సినిమా టికెట్స్‌ని పెంచుతూ జీవో విడుదల చేశారు. ఇందుకు కృతజ్ఞతగా సినీ పరిశ్రమ ప్రముఖులంతా జగన్‌కి ధన్యవాదాలు కూడా తెలిపారు. భారీ బడ్జెట్ సినిమాలకు మొదటి 10 రోజులు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు కానీ అందులో 20 శాతం షూటింగ్ ఏపీలోనే చేసి ఉండాలని కూడా జీవోలో పేర్కొన్నారు.

అయినా రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో వాటికి పదిరోజులు రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రాధేశ్యామ్ సినిమా బడ్జెట్ 170 కోట్లు ఉందని చెబుతూ బిల్లులు సమర్పించడంతో ఉన్న టికెట్ రేట్లను మరో పాతిక రూపాయలు అదనంగా పెంచి అమ్ముకోవచ్చు అంటూ ప్రీమియం క్యాటగిరి వరకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే ఈ జీవో జారీ అయిన తర్వాత మొదటిసారి ఇండస్ట్రీ నుంచి రాజమౌళి,దానయ్య ముఖ్యమంత్రి జగన్ ని కలవనున్నారు.

ఈరోజు ప్రత్యేక విమానంలో వీరిద్దరూ హైదరాబాదు నుంచి ఏపీకి బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వారు అక్కడి నుంచి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి రోడ్డు మార్గంలో వెళ్లి ముఖ్యమంత్రితో భేటీ కాబోతున్నారు. ఈ నెల 25న ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల విషయంలోనే ముఖ్యమంత్రిని కలవబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.ముందుగా టికెట్ రేట్లు పెంచినందుకు వారు జగన్మోహన్ రెడ్డికి
ధన్యవాదాలు తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత రాధేశ్యాంతో పోలిస్తే తమది ఇంకా బడ్జెట్ సినిమా కావడంతో మరింత రేటు పెంచుకునే అవకాశం ఇవ్వమని కోరే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ భేటీ జరిగిన తర్వాత మరింత సమాచారం వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి