iDreamPost

Radhe Shyam : పాత పాటే పాడుతున్న ప్రభాస్ నిర్మాతలు

Radhe Shyam : పాత పాటే పాడుతున్న ప్రభాస్ నిర్మాతలు

అసలు యువి సంస్థ స్ట్రాటజీ ఏంటో అభిమానులకు అర్థం కావడం లేదు. ముక్కు మూసుకుని గిరి గీసుకుని ఇంకొకరి భాగస్వామ్యంలో తీసిన మంచి రోజులు వచ్చాయికి టీజర్ స్టేజి నుంచే యమా హడావుడి చేశారు. అఫ్కోర్స్ ఇంత చేసినా సినిమా ఫ్లాప్ అయ్యింది. అది వేరే విషయం. కానీ మూడు వందల కోట్లని ఒకటే ఊరిస్తూ వచ్చిన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ కు మాత్రం ఏదో మొక్కుబడిగా ప్రమోషన్లు చేస్తూ నిమ్మకు నీరెత్తనట్టు ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అడిగితే అదిగో ఇదిగో అంటూ పెళ్ళిలో కొత్త దంపతులకు అరుంధతి నక్షత్రం చూపించినట్టు టైం పాస్ చేస్తున్నారు తప్ప ఇప్పటిదాకా ఎగ్జైటింగ్ గా అనిపించేది ఏదీ జరగలేదు.

నిన్న ఆర్ఆర్ఆర్ టీమ్ విడుదల చేసిన నాటు నాటు పాట తర్వాత ఒక్కసారిగా దాని మీద అంచనాలు పెరిగిపోయాయి. రాజమౌళి బ్రాండ్ కి ప్రత్యేకంగా మార్కెటింగ్ అక్కర్లేక పోయినా కూడా వందల కోట్లతో ముడిపడిన బిజినెస్ కాబట్టి జక్కన్న టీమ్ చాలా జాగ్రత్తగా పబ్లిసిటీ ప్లాన్ చేసుకుంది. అటు చూస్తే రాధే శ్యామ్ నుంచి రెండు చిన్న టీజర్లు వచ్చాయి కానీ హైప్ విషయంలో అవి ఏ విధంగానూ సహాయపడలేదు. కనీసం ఓ లిరికల్ వీడియో అయినా వదిలి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది కానీ అదీ జరగలేదు. పుష్ప, శ్యామ్ సింగ రాయ్ లే కాదు స్కైలాబ్ లాంటి చిన్న సినిమాలు సైతం జనంలోకి గట్టిగా వెళ్తున్నాయి.

కానీ రాధే శ్యామ్ విషయంలో మాత్రం ఈ దూకుడు కనిపించడం లేదు. కంటెంట్ మీద నమ్మకం ఉండొచ్చు. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారకూడదు. ఆర్ఆర్ఆర్ కు దీనికి వారం గ్యాప్ పెద్ద మ్యాటర్ కాదు. ఒకవేళ రాజమౌళి సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే దాన్ని ఫేస్ చేస్తూ రన్ ని నిలబెట్టుకోవడం రాధే శ్యామ్ కు సులభం కాదు. ఓపెనింగ్స్ తో సరిపెట్టుకునే సిచువేషన్ లేదిప్పుడు. ఇకనైనా రాధే శ్యామ్ బృందం కాస్త కాదు చాలా వేగంగా కదలాల్సిన అవసరం ఉంది. రెండు మూడు పోస్టర్లతో పని జరగదు. అంతకు మించి ఎంతో జరగాలి. మరి డార్లింగ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నట్టు యువి తన ప్రణాళిక మార్చుకుంటుందో లేదో చూడాలి

Also Read : Bholaa Shankar : మెగా ఆఫర్ ని మెహర్ ఎలా వాడుకుంటారో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి