iDreamPost

వర్ణించలేని మౌనానుభూతి ఈ విమానం – Nostalgia

వర్ణించలేని మౌనానుభూతి ఈ విమానం – Nostalgia

సగటు సినిమా ప్రేక్షకుడికి హీరో హీరోయిన్ ఇతర పాత్రధారులు మాట్లాడుకుంటేనే దాని తాలూకు అనుభూతిని ఆస్వాదించగలుగుతారు. అలా కాకుండా అసలు మాటలే లేకుండా ఊహించగలమా. అంతకన్నా సాహసం వేరొకటి ఉంటుందా. దాని పేరే పుష్పక విమానం. 1987లో ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారికి ఓ మూకీ సినిమా తీయాలన్న ఆలోచన వచ్చింది. ఆర్ధిక ఇబ్బందులతో బాధ పడుతున్న నిరుద్యోగ యువకుడికి ఓ ధనవంతుడి వల్ల అనుకోకుండా స్వర్గ సుఖాలను అనుభవించే అవకాశం వస్తుంది. ఈ క్రమంలో జరిగే సంఘటలను ఆయన కథగా రాసుకున్నారు. మిత్రుడిగా భావించే కమల్ హాసన్ తో వెంటనే పంచుకున్నారు.

ఆలస్యం చేయకుండా లోక నాయకుడు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ మొదట్లో ఏ నిర్మాతా దీనికి సాహసించలేదు. అబ్బే మాటలు లేకుండా సినిమా ఎవరు చూస్తారని సాక్ష్యాత్తు ఎల్వి ప్రసాద్ అంతటి దిగ్గజమే కామెంట్ చేశారు. కానీ సింగీతం వెనుకడుగు వేయలేదు. నాగరాజ్ అనే వ్యాపారవేత్తకు ఈ ప్రాజెక్ట్ నచ్చి అందులో భాగమయ్యారు. కన్నడలో తీస్తే వంద శాతం పన్ను రాయితీ కాబట్టి షూటింగ్ మొత్తం బెంగళూరులో చేశారు. టైటిల్స్ మారిస్తే చాలు ఏ భాషకైనా వాడుకునే వెసులుబాటు ఉండటంతో ఇబ్బందేమీ లేదు. హీరోయిన్ గా మొదట శ్రీదేవితో అనుకుని ఈ అదృష్టం అనుకోకుండా అమల తలుపు తట్టింది.

కీలక పాత్రలకు టినూ ఆనంద్, లోకానాధ్, పిఎల్ నారాయణ, ప్రతాప్ పోతన్ తదితరులను ఎంపిక చేసుకున్నారు. ఎల్ వైద్యనాథన్ సంగీతం సమకూర్చారు. కేవలం నెలన్నర రోజుల్లో షూట్ పూర్తి చేశారు సింగీతం. బడ్జెట్ కూడా తక్కువే. తెలుగులో స్రవంతి రవికిశోర్ రిలీజ్ చేశారు. హిందీలో పుష్పక్ పేరుతో వెళ్ళింది. తమిళంలో పేసుం పడంగా విడుదలయ్యింది. 1987 నవంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్పక విమానం ఆడియన్స్ ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. సినిమా అయ్యాక తాము అసలు మాటలే లేని చిత్రం చూశామంటే నమ్మబుద్ది కానంత గొప్పగా వాళ్ళను మెప్పించింది. అందుకే ఒక చరిత్రగా నిలిచిపోయింది

Also Read : క్రియేటివిటీ భేష్ కంటెంట్ వీక్ – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి