iDreamPost

Pushpa On Prime : తగ్గేదేలే అనేసిన అమెజాన్ ప్రైమ్

Pushpa On Prime : తగ్గేదేలే అనేసిన అమెజాన్ ప్రైమ్

ముందు నుంచి ప్రచారం జరిగినట్టే పుష్ప పార్ట్ 1 ది రైజ్ ఓటిటి ప్రీమియర్ కు డేట్ టైం ఫిక్స్ అయిపోయింది. ఈ నెల 7 అంటే ఎల్లుండి రాత్రి 8 గంటల నుంచే షోలు స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. కేవలం 21 రోజుల గ్యాప్ తో ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ రావడం ఈ మధ్య కాలంలో ఇదే ఫస్ట్ అని చెప్పొచ్చు. గత నాలుగైదు రోజులుగా నిర్మాతల నుంచి అభ్యర్థన కారణంగా ఏమైనా వాయిదా పడొచ్చనే బన్నీ అభిమానుల ఆశలపై ప్రైమ్ నీళ్లు చల్లేసింది. ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను తరహాలో తన మానాన తాను అగ్రిమెంట్ ప్రకారం పక్కాగా విడుదల తేదీని ప్లాన్ చేసుకుంది. దానికి తగ్గట్టే జస్ట్ 30 గంటల ముందు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది.

నిజానికి మైత్రి ఒప్పందం చేసుకున్నప్పుడు వాళ్ళ లెక్క వేరు. ఎలాగూ జనవరి 7 ఆర్ఆర్ఆర్ వస్తుంది కాబట్టి అప్పుడు పుష్పకు పెద్దగా థియేటర్లు మిగలవు. పైగా ఈ స్థాయి ఫలితం కూడా ఊహించలేదు. పాన్ ఇండియా అయినప్పటికీ నార్త్ ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం గురించి అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయ్యింది. పుష్ప తర్వాత వచ్చిన సినిమాలేవీ దాన్ని మించే స్థాయిలో మాస్ ని మెప్పించలేకపోయాయి. పైగా ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లు వాయిదా పడటంతో ప్రేక్షకులు అయితే అఖండ లేదా పుష్ప అని రెండే ఆప్షన్లు పెట్టుకున్నారు. మిగిలినవాళ్లు శ్యామ్ సింగ రాయ్ కు ఓటేయడంతో నానికీ హిట్టు పడింది.

ఇదంతా ఊహించని పరిణామం. ఒకవేళ పుష్ప ఫ్లాప్ అయ్యుంటే ఇప్పుడీ చర్చ కూడా ఉండేది కాదు. ట్విస్ట్ ఏంటంటే పుష్ప హిందీ వెర్షన్ మాత్రం స్ట్రీమ్ కావడం లేదు. తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ భాషలను మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. అలా అయినా కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం మాత్రం ఖాయం. ఆకాశం నీ హద్దురా, టక్ జగదీశ్, దృశ్యం 2లను ఈజీగా క్రాస్ చేసే స్థాయిలో పుష్ప ప్రైమ్ కు మేజిక్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఏది ఏమైనా అగ్రిమెంట్ టైంలో ఇలాంటి పెద్ద సినిమాల నిర్మాతలు గడువు విషయంలో జాగ్రత్తగా లేకపోతే బాక్సాఫీస్ రన్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది

Also Read : Valimai Telugu : ఈ మాత్రం దానికి డబ్బింగ్ చేయడం ఎందుకు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి