iDreamPost

సంక్షోభంలో పులివెందుల తెలుగుదేశం

సంక్షోభంలో పులివెందుల తెలుగుదేశం

గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తన ఉనికిని తిరిగి నిరూపించుకునే అవకాశం స్థానిక ఎన్నికల రూపంలో వచ్చిందని అందరూ భావించినా, ఆ దిశగా కేడర్ లో జోష్ రాకపోగా ముఖ్యనేతలే పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన వెంటనే కడప జిల్లాలో తెలుగుదేశం పార్టికి పెద్ద దిక్కుగా ఉన్న సి.యం రమేష్ , ఆదినారాయణ రెడ్డి, బాలకృష్ణ యాదవ్ బి.జే.పిలో చేరిపోగా వీరిని ద్వితీయ ,తృతీయ శ్రేణి నాయకులు అనుసరించారు. ఇక తాజాగా పులివెందుల్లో వై.యస్ కుటుంభాన్ని నాలుగుసార్లు ఎన్నికల్లో నేరుగా ఢీ కొట్టి ముఖ్య నేతగా పేరు తెచ్చుకున్న శాసన మండలి మాజీ డివ్యూటి చైర్మెన్ సతీష్ రెడ్డి కూడా ఆ పార్టీని వీడుతునట్టు ప్రకటించి తెలుగుదేశానికి కోలుకోలేని దెబ్బ కొట్టారు.

కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నేతగా, పులివెందుల నియోజకవర్గంలో ప్రధాన నేతగా వై.యస్ కుటుంబాన్ని ఎన్నికల్లో నేరుగా నాలుగుసార్లు ఢీకొట్టిన వ్యక్తిగా సతీష్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా తెలుగుదేశం అధిష్టానం పులివెందుల నియోజక వర్గ ప్రజలను అవమాన పరిచేలా పులివెందుల గుండాలు అంటు నోరు పారేసుకోవడం శృతిమించడంతో, ఇదే విషయంపై సతీష్ రెడ్డి కొంత పార్టీ అధిష్టాన వైఖరిపై అసంతృప్తిగా వ్యక్తపరచగా తన అభిప్రాయాలకు కనీస గౌరవం ఇవ్వకుండా అధిష్టానం వ్యవహరించిన తీరుతో కొంత ఇబ్బంది పడినట్టు తెలుస్తుంది. మొదటి నుండి పులివెందులలో పార్టీకి నాయకత్వం వహిస్తు కష్టపడుతు వచ్చిన నాకే పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కకపోతే ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి అని ఆయన సన్నిహితుల దగ్గర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించినట్టుగానే నేడు వేంపల్లిలో తన అనుచరులు , కార్యకర్తలు, శ్రేయొభిలాషలు తో సమావశం నిర్వహించి తెలుగు దేశం పార్టికి రాజీనామ చెస్తునట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబుకు తనకు మద్య గ్యాప్ పెరిగిందని, వై.యస్ కుటుంభంతో దశాబ్దాలుగా పోరాడుతున్న తనకి సరైన గుర్తింపు రాలేదని, మనస్పూర్తిగా పార్టీకి ఎంత సేవ చేసినా చంద్రబాబుకు తనపై నమ్మకం కలగలేదని, పార్టీ అధికారంలో ఉన్నా తనకి న్యాయం జరగలేదని కాబట్టి ఇక తెలుగుదేశంలో కొనసాగడంలో అర్ధంలేదని తెలుగుదేశం పార్టీతో తనకి ఉన్న పాతికేళ్ళ అనుబంధాన్ని తెంచుకుంటునట్టు చెప్పుకొచ్చారు.

గత కొంత కాలంగా రాజకీయ వ్యవహారాల్లో స్తబ్దుగా ఉన్న సతీష్ రెడ్డి స్థానిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశాన్ని వీడటం ఆపార్టీకి గట్టి దెబ్బ అనే చెప్పాలి. ఆంధ్ర ప్రదేశ్ లో మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయం కన్నా మరింత బలంగా ఉండటం , తెలుగుదేశం పార్టీ మరింత పతనావస్థకు చేరడం మరీ ముఖ్యంగా పార్టీపై చంద్రబాబుకు రోజు రోజుకు పట్టు సడలడంతో పార్టీ నాయకులతో సహా క్యాడర్ కూడా తమ దారి చూసుకునేందుకు సంసిద్దం అవుతున్నారు. ఈ క్రమం లోనే ఇప్పటికే తెలుగుదేశం సీనియర్ నేత మాజీ శాసన సభ్యులు వరదరాజుల రెడ్డి స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న ఇరు ప్రధాన పార్టీలకు సమ దూరం పాటిస్తా అని ప్రకటించగా సతీష్ రెడ్డి దారిలోనే సుగవాసి ప్రసాద్ బాబు కూడా ఉనట్టు తెలుస్తుంది. సతీష్ రెడ్డి నిర్ణయంతో ఇప్పటికే పులివెందులలో తెలుగుదేశం భూస్థాపితం అవ్వగా రాబోయే రోజుల్లో పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల మాట. ఈ సంక్షోభం నుండి తెలుగుదేశాన్ని చంద్రబాబు ఎలా బయటపడేస్తారో వేచి చూడాలి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి