iDreamPost

ప్రజా వేదిక రాజకీయం.. కరకట్టపై హైడ్రామా..

ప్రజా వేదిక రాజకీయం.. కరకట్టపై హైడ్రామా..

కృష్ణా కరకట్టపై హైడ్రామా నడుస్తోంది. చంద్రబాబు నాయుడు హాయంలో ఆయన ఇంటి పక్కనే కరకట్టపై ప్రజా వేదిక పేరుతో ఏర్పాటు చేసిన నిర్మాణాన్ని గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ వేదికను ప్రభుత్వం తీసేసింది. ఇది జరిగి నేటికి ఏడాది అవుతోంది. ఈ క్రమంలో ప్రజా వేదిక కూల్చి ఏడాది అవుతోందంటూ.. టీడీపీ నేతలు సదరు వేదిక నిర్మాణ ప్రాంతానికి వెళ్లేందుకు యత్నిస్తున్నారు. అయితే కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని పోలీసులు వారిని నిలువరిస్తున్నారు. అనుమతి లేనిదే నిరసన కార్యక్రమం చేపట్టకూడదని స్పష్టం చేస్తున్నారు. కొంత మంది టీడీపీ నేతలు పోలీసులు ఆంక్షలు పట్టించుకోకుండా వెళ్లడంతో వారిని అరెస్ట్‌ చేస్తున్నారు.  టీడీపీ నేతలు దేవినేని ఉమా, వర్ల రామయ్య తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు.

చంద్రబాబు హాయంలో తనను కలిసేందుకు వచ్చే ప్రజలను, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించేందుకు చంద్రబాబు నివాసం ఉండే లింగమనేని గెస్ట్‌ హౌస్‌కు పక్కనే తాత్కాలికంగా అప్పటి ప్రభుత్వం ఓ నిర్మాణాన్ని ఏర్పాటు చేసింది. దానికి ప్రజావేదిక అనే పేరు పెట్టింది. గత ఏడాది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరకట్ట వెంబడి వాల్టా చట్టం ధిక్కరించి చేపట్టిన నిర్మాణాలపై అధికారులు కొరడా ఝులిపించారు. అంతకు ముందు ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరిదిద్దేందుకు అక్రమ నిర్మాణమైన ప్రజా వేదికను తొలగించారు. పైకి శాశ్వత నిర్మాణంగా కనిపించినా.. అది తొలగించే సమయంలో తాత్కాలిక నిర్మాణం అని తేలడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. ప్రజా వేదిక కోసం అప్పట్లో 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇదేదో శాశ్వత నిర్మాణం అయినట్లు.. టీడీపీ నేతలు అప్పటి నుంచి రాజకీయం మొదలు పెట్టారు. దాన్ని నేటికి కొనసాగిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి