iDreamPost

అవినీతి చేయనప్పుడు విచారణంటే భయమేలా ఇంజనీర్‌గారు..?

అవినీతి చేయనప్పుడు విచారణంటే భయమేలా ఇంజనీర్‌గారు..?

తమ పార్టీ ప్రభుత్వ హయంలో జరిగిన పనులలో అవినీతి జరిగిందని లేదా నిధులు దుర్వినియోగం అయ్యాయని మరో పార్టీ ప్రభుత్వం విచారణ జరిపిస్తామంటేనో లేదా విచారణ జరిపిస్తుంటేనో సదరు పార్టీ హాయంలో ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి లేదా ఆ పార్టీ నేతలు ఆందోళన చేయడం, నిరసన వ్యక్తం చేయడం సహజంగా జరిగేదే. ఇంకా చెప్పాలంటే.. ఆయా పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రస్తుతం కాంట్రాక్టులకు టెండర్లు వేయకుండా నిరసన తెలియజేడయం కూడా సర్వసాధారణమే. కానీ అటు ప్రభుత్వం, ఇటు కాంట్రాక్టర్లు కాకుండా.. పనులకు అంచనాలు వేసిన, పర్యవేక్షణ చేసిన, బిల్లులు మంజూరు చేసిన అధికారులు ప్రభుత్వం నాటి పనులపై విచారణ జరిపిస్తామంటే ఆందోళన చెందుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ఏమనుకోవాలి…?

ఈ వింత పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో పంచాయతీ రాజ్‌ శాఖ చేపట్టిన పనుల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలపై ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు సిద్ధమైంది. నీరు–చెట్టు పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని అప్పట్లోనే వివిధ పత్రికల్లో కథనాలు వచ్చాయి. పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారనే విమర్శలు బలంగా వినిపించాయి. శాఖాపరమైన విచారణల్లో ఇవి నిజమని కూడా తేలింది. అయితే ఆ నివేదికలను గత ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వ చివరి సమయంలో అంటే 2018లో ఈ పనుల్లో అవినీతి భారీగా చోటుచేసుకుంది.

ఆ సమయంలో జరిగిన పనులపై వైసీపీ ప్రభుత్వం తాజాగా విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. అక్రమార్కుల అవినీతిని నిగ్గుతేల్చేలా ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఆదేశాలపై అప్పటి అధికార పార్టీ, ఇప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం నేతలు గానీ, అప్పటి పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి గానీ, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, పనులు చేసిన కాంట్రాక్టర్లు గానీ మారుమాట్లాడడంలేదు. కానీ పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీర్లు మాత్రం ఆందోళనలు చేస్తున్నారు. ఓ పక్క విధులకు హాజరవుతూనే మధ్యాహ్నం భోజన విరామ సమయంలో గత మూడు రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. విజిలెన్స్‌ విచారణను వ్యతిరేకిస్తున్నారు. ఆ విచారణను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ అందరినీ విస్తుబోయేలా చేస్తున్నారు.

2018లో జరిగిన పనుల్లో అవినీతి, నిధుల దుర్వినియోగం జరగకుంటే పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు భయపడాల్సిన అవసరం ఏముంది..? ఇంజనీర్లు ఆందోళనలు చేస్తుంటే.. అవినీతి,అక్రమాలు జరిగాయనే అనుమానాలు బలపడతాయి. అప్పటి టీడీపీ నేతలు, కాంట్రాక్టర్లతో ఇంజనీర్లు కుమ్మక్కయ్యారనుకునేలా ప్రస్తుతం చేస్తున్న ఆందోళనలు ఊతం ఇస్తాయనడంలో సందేహం లేదు. ప్రభుత్వ పనులల్లో జరిగిందనుకుంటున్న అవినీతిపై విచారణ జరిపితే నిజంగా తప్పు చేయనప్పుడు అధికారులు భయపడాల్సిన అవసరం ఏమంది..? అనేది మౌలిక ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆందోళన చేస్తున్న పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీర్లు సమాధానం చెప్పగలరా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి