iDreamPost

కోడికి మళ్లీ కష్టమొచ్చింది..!

కోడికి మళ్లీ కష్టమొచ్చింది..!

కోవిడ్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో పౌల్ట్రీ పరిశ్రమ కూడా ఉంది. లాక్డౌన్‌నిబంధనల సడలింపుల అనంతరం జనం గుడ్లు, చికెన్‌ల వైపు మొగ్గు చూపడంతో కాస్తంత కోలుకుంది. అయితే ఇప్పుడు కొత్తగా ఆ రంగాన్ని బర్డ్‌ఫ్లూ (ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా) భయపెడుతోందంటున్నారు ఆ రంగానికి చెందిన ప్రముఖులు.

ప్రస్తుతం కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, ఒడిస్సా, హర్యానా రాష్ట్రాల్లో సామూహికంగా చనిపోయి ఉన్న పక్షుల్లో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్ళను ఆయా రాష్ట్రాల్లోని పశుసంవర్ధక శాఖాధికారులు గుర్తించారు. గుర్తించిన ప్రాంతాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో సైతం పక్షుల్లో ఈ విధమైన వైరస్‌ను గుర్తిస్తుండడంతో, దీని విస్తృతి నెమ్మదిగా పెరుగుతోందన్న అంచనా వేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశంలోని మిగతా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వివిధ జిల్లాల్లో మృతి చెందిన పక్షుల్లో శాంపిల్స్‌ సేకరించి పరీక్షించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. దీంతో సంబంధిత రంగాలకు చెందిన నిపుణులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. వలస పక్షుల ద్వారా ఈ వైరస్‌ ఇక్కడి పక్షులకు సోకుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. పక్షుల నుంచి మనుషులకు కూడా వ్యాపించడానికి అవకాశం ఉంటుందంటున్నారు.

కేరళలోని బాతుల పెంపకం కేంద్రాల్లో మృత్యువాత పడ్డ పక్షుల్లో సైతం బర్డ్‌ఫ్లూ జాడలు కన్పించడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఫౌల్ట్రీరంగం ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే అక్కడ పన్నెండువేలకు పైగా బాతులు మృతి చెందినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా పౌల్ట్రీల్లో పెరిగే కోళ్ళు, బాతులు నాటు వాటితో పోలిస్తే కాస్తంత సున్నితంగానే ఉంటాయి. ఏ మాత్రం తేడా వచ్చినా వేలల్లోని మృతి చెందుతుంటాయి. ఈ నేపథ్యంలో గాలి ద్వారా వ్యాపించే ఈ వైరస్‌ ప్రభావం పౌల్ట్రీలకు సోకితే పక్షులను కాపాడుకోవడం గగనమైపోతుందని ఆందోలన చెందుతున్నారు. కోవిడ్‌ అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందనుకున్న తరుణంలో బర్డ్‌ఫ్లై ఉపద్రవం పొంచి ఉండడం పౌల్ట్రీ నిర్వాహకుల్లో ఆందోళనలను పెంచుతోంది.

కాగా దేశంలో పౌల్ట్రీరంగం మాంసం, గుడ్లు ఉత్పత్తి మార్కెట్‌ విలువ రానున్న మూడేళ్ళలో రూ. 4,340 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రపంచంలోని అతిపెద్ద పౌల్ట్రీ ఉత్పాదక దేశాల్లో భారతదేశం కూడా ఒకటిగా ఉంది. ప్రజల ఆహారపు అలవాట్లలో గణనీయంగా చోటు చేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో మాసం, గుడ్లు డిమాండ్‌ పెరుగుతున్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి