iDreamPost

పోలింగ్ పెంచుకునేందుకు ప‌రుగులు

పోలింగ్ పెంచుకునేందుకు ప‌రుగులు

సమయం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలైంది. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పోలింగ్‌ శాతం 28 కూడా దాటలేదు. అప్పటి వరకూ పోలింగ్‌ సరళిని గమనించిన మంత్రి తలసానిశ్రీనివాస్‌ యాదవ్‌ ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల ముఖ్య నేతలకు ఫోన్లు చేసి, చివరి గంటల్లోనైనా అధిక పోలింగ్‌ శాతం పెంచుకోవాలని, ఓటర్లతోపాటు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల ఓట్లు, వారి కుటుంబ సభ్యుల ఓట్లు సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆదేశించారు. అందుబాటులోని ఇళ్లలోని ఓటర్ల అందరితో మాట్లాడి పోలింగ్‌ బూత్‌కు వచ్చేలా మోటివేట్‌ చేయాలని సూచించారు. దాంతో ఆయా డివిజన్ల ముఖ్య నేతలు ఉరుకులు, పరుగులు తీశారు. సెల్‌ఫోన్లకు పని పెంచారు. ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా అందరి నీ అభ్యర్థించారు. ఇంటింటికీ తిరిగి కొంత మంది దగ్గరుండి తోడ్కోని మరీ వెళ్లారు. దీంతో సాయంత్రం 6 గంటల వరకూ 40.1 శాతం పోలింగ్‌ నమోదైంది. తలసాని అప్రమత్తత కాస్త కలిసి వచ్చినట్లుగా స్థానిక టీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

నేతల హడావిడి..

సనత్‌నగర్‌ నియోజకవర్గంలోనే కాదు.. చాలా నియోజకవర్లాల్లో ముఖ్యనేతలంతా పోలింగ్‌ పెంచేందుకు మధ్యాహ్నం అనంతరం నానా తంటాలు పడ్డారు. కార్యకర్తలను, అనుచరులను ఉరుకులు, పరుగులు పెట్టించారు. ఎందుకంటే మధ్యాహ్నం 2 వరకూ చాలా ప్రాంతాల్లో పోలింగ్‌ అతి తక్కువగా నమోదైంది. వీరే కాకుండా.. సెలబ్రిటీలు, ప్రముఖులు, వృద్ధులు తదితరులు కూడా తాము ఓట్లు వేశామని, మీరు కూడా ఓట్లు వేయాలని అభ్యర్థించారు. దీంతో నగర పౌరుల్లో కొంత అవగాహన పెరిగినట్లు కనిపించింది. సాయంత్రానికి పోలింగ్‌ శాతం పెరుగుతూ వచ్చింది. సాయంత్రం 6 లోపల 38.7 శాతానికి పోలింగ్‌ చేరుకుంది. ఆ సమయానికి ఇంకా చాలా మంది పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. సాయంత్రం 4 తర్వాత నుంచే కేంద్రాలకు వెళ్లిన ఓటర్లు పెరుగుతూ వచ్చారు. ఫలితంగా GHMC ఎన్నికల్లో పోలింగ్ శాతం 45.70కు చేరినట్లు మంగళవారం అర్ధరాత్రి ఎన్నికల అధికారులు ప్రకటించారు. 2016 గ్రేటర్‌ ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్ నమోదైంది. అయినప్పటికీ ప్రచారం జరిగినంత స్థాయిలో ఈసారి పోలింగ్‌ శాతం నమోదు తక్కువేనని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి