iDreamPost

ద్విపాత్రల్లో కొత్త పోకడ – Nostalgia

ద్విపాత్రల్లో కొత్త పోకడ – Nostalgia

మాములుగా డ్యూయల్ రోల్ సినిమాలంటే హీరో లేదా హీరోయిన్లు అన్నదమ్ములు లేదా అక్కాచెల్లెళ్లు ఉంటారు. లేదా ఒకరు క్లాసు మరొకరు మాస్ అనిపించేలా కథలను ఈ పాయింట్ చుట్టే తిప్పుతారు. గంగ మంగ, రాముడు భీముడు, ఇద్దరు మిత్రులు, దొంగమొగుడు, హలో బ్రదర్ ఇలా ఎన్ని ఉదాహరణలు తీసుకున్నా చాలా సారూప్యతలు కనిపిస్తాయి. ఆలా రెగ్యులర్ శైలిలో ఆలోచించకుండా ప్రయోగాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నిరూపించిన చిత్రమే పోలీస్ లాకప్. కమర్షియల్ సూత్రాలకు పూర్తిగా కట్టుబడకుండా ప్రేక్షకులకు ఒక విభిన్నమైన సినిమా అందించాలని ఆ యూనిట్ చేసిన ప్రయత్నం మంచి ఫలితాలను ఇచ్చింది ఆ విశేషాలు చూద్దాం.

Also Read :తండ్రి కొడుకుల డబుల్ ఎమోషన్ – Nostalgia

1991లో శత్రువు లాంటి బ్లాక్ బస్టర్ ద్వారా ఏంఎస్ రాజు నిర్మాతగా తన తొలి అడుగే విజయవంతంగా వేశారు. రెండోది కూడా కోడి రామకృష్ణ దర్శకత్వం చేయాలని షూటింగ్ జరుగుతున్న టైంలోనే నిర్ణయించుకున్నారు. లేడీ అమితాబ్ గా కర్తవ్యం నుంచి తన ఇమేజ్ ని అమాంతం పెంచేసుకున్న విజయశాంతి ఒకపక్క ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే మరోవైపు స్టార్ హీరోలతో రెగ్యులర్ సినిమాలు కూడా చేస్తున్న సమయం. భారత్ బంద్ తర్వాత వేరే సినిమాలు చేసినప్పటికీ ఆ స్థాయి పవర్ ఫుల్ సబ్జెక్టు మరొకటి పడలేదని వెతుకుతున్న కోడి రామకృష్ణ గారికి సుమంత్ ఆర్ట్స్ యూనిట్ ఇచ్చిన కథలో దమ్ము కనిపించింది. ఆలస్యం చేయలేదు.

పోలీస్ లాకప్ లో రెండు పాత్రలు ఉంటాయి. ఒకరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయితే మరొకరు సాధారణ గృహిణి. ఆవిడ భర్త కూడా ఖాకీ డిపార్ట్ మెంటే. సంఘ విద్రోహ శక్తులు రాజకీయ ముసుగులో చేయరాని దుర్మార్గాలకు తెగబడితే అన్యాయంగా నేరం మోపబడ్డ సిబిఐ ఆఫీసర్ విజయ తన పోలికలే ఉన్న ఒక మాములు మహిళతో కలిసి ఎలా వాళ్ళ ఆట కట్టించిందనే పాయింట్ తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. రాజ్ కోటి సంగీతం, ఎస్ గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం లాంటి టెక్నికల్ టీమ్ అండగా నిలబడిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ విజయశాంతి కెరీర్లో మరో మర్చిపోలేని చిత్రంగా నిలిచింది. 1993 నవంబర్ 12న విడుదలైన పోలీస్ లాకప్ ఆ ఏడాది టాప్ హిట్స్ లో ఒకటిగా నిలిచి కమర్షియల్ గానూ లాభాలను ఇచ్చింది

Also Read : అక్కినేని బ్రహ్మచారి జాడ ఎక్కుడ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి