iDreamPost

గూగుల్​ ప్లేస్టోర్​కు పోటీగా ఫోన్​పే కొత్త యాప్ స్టోర్!

  • Author singhj Published - 06:30 PM, Sat - 23 September 23
  • Author singhj Published - 06:30 PM, Sat - 23 September 23
గూగుల్​ ప్లేస్టోర్​కు పోటీగా ఫోన్​పే కొత్త యాప్ స్టోర్!

మన దేశంలో డిజిటల్ చెల్లింపుల హవా ఒక రేంజ్​లో నడుస్తోంది. కరోనా వల్ల డిజిటల్ పేమెంట్స్‌ చేయడం ఎక్కువైపోయింది. ఇప్పుడు జేబులో పర్సు లేకపోయినా ఫోన్ ఉంటే చాలు.. మొబైల్​లో ఒక్క క్లిక్​తో ఏదైనా కొనేయొచ్చు. ఈ ధీమా ఏర్పడటానికి కారణం ఈ రకమైన చెల్లింపులే. కొవిడ్ టైమ్​లో డిజిటల్ పేమెంట్స్​తో హవా నడిపించాయి ఫోన్​పే, గూగుల్​పే సంస్థలు. ఇప్పుడు కూడా వీటి జోరు తగ్గడం లేదు. అలాంటి ఫోన్​పే కంపెనీ ఇప్పుడు కొత్త రంగంలోకి అడుగుపెడుతోంది. గూగుల్​ ప్లేస్టోర్​కు పోటీగా ఓ కొత్త యాప్​ స్టోర్​ను తీసుకొస్తోంది. యాప్ డెవలపర్స్ కోసమని ఇండస్ యాప్ స్టోర్​ అనే నూతన వేదికను మొదలుపెడుతున్నట్లు తెలిపింది.

ఇండస్ యాప్ స్టోర్​లో తమ అప్లికేషన్లను లిస్ట్ చేయాలని డెవలపర్లను ఫోన్​పే కోరింది. ఈ యాప్ స్టోర్ 12 స్థానిక భాషల్లో త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం యాప్ స్టోర్ల విషయంలో గూగుల్ ప్లే స్టోర్​తో పాటు యాపిల్ యాప్ స్టోర్ గుత్తాధిపత్యం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వీటికి పోటీగా సవాల్ విసిరేందుకు ఫోన్​పే సిద్ధమైంది. యాప్ డెవలపర్లను ఇండస్ యాప్ స్టోర్​లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ఫోన్​పే కోరింది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇండస్​యాప్​స్టోర్.కామ్ వెబ్​సైట్ ద్వారా యాప్స్​ను అప్​డోల్ చేయాలని పేర్కొంది. మొదటి ఏడాది డెవలపర్ల నుంచి తాము ఎలాంటి ఫీజు కూడా వసూలు చేయబోమని ఫోన్​పే తెలిపింది.

తొలి ఏడాది డెవలపర్ల నుంచి ఫీజు వసూలు చేయబోమన్న ఫోన్​పే.. మరుసటి ఏడాది నుంచి స్వల్ప మొత్తంలో మాత్రమే ఫీజు తీసుకుంటామని పేర్కొంది. అలాగే డెవలపర్స్ నుంచి ఎలాంటి ప్లాట్​ఫామ్ ఫీజు గానీ, ఇన్​-యాప్ పేమెంట్స్​కు కమీషన్ గానీ వసూలు చేయబోమని స్పష్టం చేసింది. తమకు నచ్చిన పేమెంట్ గేట్​వేను ఫ్రీగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. మామూలుగా ఇన్​ యాప్ పర్చేజీల మీద గూగుల్, యాపిల్ స్టోర్లు 30 శాతం కమీషన్ వసూలు చేస్తున్నాయి. అలాగే పేమెంట్ ప్రాసెసింగ్ సిస్టమ్​ విషయంలో తమకు నచ్చిన వాటిని ఎంచుకోకుండా యూజర్లను నియంత్రిస్తున్నాయి. దీంతో వీటి మీద యాప్ డెవలపర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి: ఢిల్లీకే పరిమితమైన లోకేష్! అరెస్ట్ చేస్తారనే భయమా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి