iDreamPost

‘పెదపూడి’ చెబుతున్న కరోనా పాఠం

‘పెదపూడి’  చెబుతున్న కరోనా పాఠం

తూర్పుగోదావరి జిల్లా జి. మామిడాడ మండలంలోని పెదపూడి గ్రామం కరోనా విస్తృతి పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయన్నదానికి ఓ పాఠంగా నిలుస్తోంది. రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఉన్న తూర్పు గోదావరి కరోనా వ్యాప్తి తొలుత అంతంత మాత్రంగానే ఉంది. న్యూ ఢిల్లీ సంబంధిత కేసులు తప్పితే పెద్దగా వ్యాప్తి దాఖలాల్లేవు. అయితే జి. మామిడాడకు చెందిన ఒక వ్యక్తి ద్వారా మే నెలలో దాదాపు 120 మందికిపైగా వ్యాధి వ్యాప్తి చెందిందని అధికార వర్గాలు ఖరారు చేసాయి. ఫోటోగ్రాఫర్‌గా, హోటల్‌ కేషియర్‌గా సదరు వ్యక్తి లాక్డౌన్‌ సమయంలో కూడా తన పనులు తాను చేసుకోవడంతో ఈ స్థాయిలో వైరస్‌ వ్యాప్తికి కారణమైనట్లు ప్రాధమికంగా అన్ని ప్రభుత్వ శాఖల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

అయితే పరిపూర్ణ లాక్డౌన్‌ సమయంలో హోటల్‌ తెరిచేందుకు ఎందుకు అనుమతించారు అన్నది ప్రతిపక్షాల వాదనగా ఉంది. ఏది ఏమైనా అటు యంత్రాంగం నిర్లక్ష్యంతో పాటు, సదరు వ్యక్తి ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా వ్యవహరించిన తీరు కూడా రాష్ట్రంలోనే సూపర్‌ స్ప్రైడర్‌గా, అతి పెద్ద హాట్‌స్పాట్‌గా మామిడాడ గ్రామం మారడానికి కారణమైంది. ఈ జిల్లాలో వైరస్‌ వ్యాపించిన తీరు వ్యక్తులు, వ్యవస్థల నిర్లక్ష్యాన్ని ప్రశిస్తోంది. ఒక పక్క ప్రభుత్వం శాయశక్తులా కోవిడ్‌ నియంత్రణకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే క్షేత్రస్థాయిలో చేసిన నిర్లక్ష్యపు పనుల కారణంగా ప్రస్తుతం పలువురు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

రాష్ట్రంలో 3,200 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, తూర్పుగోదావరిలో మొత్తం 243 పాజిటివ్‌లు ఉన్నాయి. ఇంకా పలు టెస్టు రిపోర్టులు రావాల్సి ఉంది. అత్యధిక జనసాంద్రత గల జిల్లాల్లో ఒకటైన తూర్పుగోదావరి జిల్లాలో ఈ అంకెలు ఆందోళన కలిగించేవే. నిపుణులు వ్యక్త పరుస్తున్న అభిప్రాయం మేరకు రానున్న నెలల్లో వైరస్‌ వ్యాప్తి విస్తృతమైతే పరిస్థితి ఏంటన్న ఆందోళన జిల్లా వాసుల్లో సర్వత్రా వ్యక్తమవుతోంది. పెద్దగా కేసులు నమోదు కాకపోవడంతో హోమ్‌ క్వారంటైన్‌ వంటి సాహసోపేతమైన విధానాలకు కూడా శ్రీకారం చుట్టేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.

అయితే అనూహ్యంగా జి. పెదపూడి మండలం పరిధిలో పెరిగిన కేసులతో యంత్రాంగం ఇప్పుడు నానా హైరానా పడుతోంది. కరోనా వ్యాప్తి, విస్తృతి పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహించినా ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయన్నదానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం ఎంత బాద్యతగా వ్యవహరిస్తుందో, అదే రీతిలో వ్యక్తుల స్థాయిలో కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరాన్ని జి. మామిడాడ చాటి చెబుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి