iDreamPost

సీనియ‌ర్ నాయ‌కుడికి గెట‌వుట్ చెప్పిన ఎం.స‌త్య‌నారాయ‌ణ‌రావు

సీనియ‌ర్ నాయ‌కుడికి గెట‌వుట్ చెప్పిన ఎం.స‌త్య‌నారాయ‌ణ‌రావు

మాజీ మంత్రి , మాజీ పీసీసీ అధ్య‌క్షుడు ఎం.స‌త్య‌నారాయ‌ణ‌రావు మృతి బాధాక‌రం. భోళా మ‌నిషి, లౌక్యం తెలియ‌దు. మ‌న‌సులో ఏదీ దాచుకోడు. అచ్చ తెలంగాణ యాస‌లో ఆయ‌న మాట్లాడుతుంటే వింటూనే ఉండాల‌నిపించేది.

జీవితం , రాజ‌కీయాలు రెండూ డ్రైగా ఉండే కాలంలో అద్భుత‌మైన హాస్య ర‌సం పండించి హాయిగా న‌వ్వించేవాడు. 2001లో ఆయ‌న press meetకి అటెండ్ అయిన సంద‌ర్భం మ‌రిచిపోలేనిది.

2000వ సంవ‌త్స‌రంలో ఆంధ్ర‌జ్యోతి మూసేస్తే రాయ‌డం త‌ప్ప ఏ ప‌నీ చేత‌కాదు కాబ‌ట్టి తిరుప‌తిలో శంఖారావం అనే వార‌ప‌త్రిక పెట్టాను. గొప్ప pen man అని భ్ర‌మాపూరిత , భ్రాంతి క‌వ‌చ ద‌ట్ట‌మైన అజ్ఞానం మెద‌డంతా తివాచీలా ప‌ర‌చుకుని వుండేది. రాత‌తో త‌ల‌రాత మారుతుంద‌నే అమాయ‌క‌పు రోజులు. అక్ష‌రాన్ని రాయ‌డం వేరు, అమ్మ‌డం వేరు. రాయ‌డానికి చెయ్యి, మెద‌డులో గుజ్జు వుండాలి. అమ్మాలంటే నాలుక ప‌దునుగా వుండాలి. మాట‌లు చెప్పాలి. ప‌దాలు త‌ప్ప‌, పెదాలు క‌ద‌ల‌వు.

రిపోర్ట‌ర్‌, స‌బ్ ఎడిట‌ర్‌, ఓన‌ర్‌, పేప‌ర్ బాయ్‌గా కూడా నేనే ఉన్నా. అది బ‌త‌క‌లేదు. ఈ సంద‌ర్భంలో zp ఎన్నిక‌లు జ‌రిగాయి. కాంగ్రెస్‌కి ముగ్గురు స‌భ్యులు ఎక్కువ గెలిచారు. బీసీ మ‌హిళ కోటాలో రెడ్డెమ్మ‌ను చైర్మ‌న్ చేయాల‌ని జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి నిర్ణ‌యించాడు. ఇది చిత్తూరు నాయ‌కుడు ck.బాబుకి న‌చ్చ‌లేదు. ఆయ‌న‌కి , పెద్దిరెడ్డికి ప‌డ‌దు. త‌న వ‌ర్గం ముగ్గురు zptc ల‌ని ఆయ‌న దాచేశారు.

ఈ పంచాయ‌తీ తీర్చ‌డానికి పీసీసీ అధ్య‌క్షుడి హోదాలో స‌త్య‌నారాయ‌ణ‌రావు వ‌చ్చాడు. హోట‌ల్ భీమాస్‌లో ప్రెస్‌మీట్‌. జిల్లాలోని కాంగ్రెస్ లీడ‌ర్లంతా హాజ‌ర‌య్యారు. కాంగ్రెస్‌లో ప్ర‌జాస్వామ్యం ఎక్కువ‌ని, ఎన్ని అభిప్రాయ బేధాలున్నా చివ‌రికీ తామంతా ఒక‌టేన‌ని msr ఏదో చెబుతుండ‌గా కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు వెంక‌ట‌ర‌మ‌ణ ప‌క్క‌నున్న వ్య‌క్తితో మాట్లాడుతున్నాడు. ర‌మ‌ణ‌ది మెటాలిక్ వాయిస్‌. మెల్ల‌గా మాట్లాడినా గ‌ట్టిగా వినిపిస్తుంది.

Also Read : తెలుగు రాష్ట్రాల‌లోనూ అదే కార‌ణ‌మా..?

msrకి చిరాకు, కోపం వ‌చ్చింది. “ఏంది నీ లొల్లి, నేనీడ మాట్లాడుతుంటే ముచ్చ‌ట్లు పెడ‌తావా? ప్రెస్ మీట్‌కి నిన్ను ఎవ‌రు ర‌మ్మ‌న్నారు? ర‌మ‌ణ ఫ‌స్ట్ గెట‌వుట్” అని గ‌ట్టిగా అరిచాడు. రిపోర్ట‌ర్ల‌తో పాటు జిల్లా నాయ‌కులు కూడా షాక్‌. ర‌మ‌ణ‌కి అవ‌మాన‌మైంది (త‌ర్వాత ఈయ‌న 2 సార్లు mla చేశారు).

“మీలాంటి పెద్దోళ్లు తిట్టినా నాకు ఆశీర్వాద‌మే సార్” అని ర‌మ‌ణ సీన్‌ని కూల్ చేశాడు. msr కూడా చ‌ల్ల‌బ‌డి కాంగ్రెస్ పార్టీ చ‌రిత్ర‌, ఢిల్లీలో తాను ప‌నిచేసిన రోజులు ట్రాక్ త‌ప్పి వివ‌రించ‌సాగాడు. అడ్డు త‌గిలితే తిడ‌తాడ‌ని రిపోర్ట‌ర్లు కూడా మారు మాట్లాడ‌కుండా రాసుకున్నారు. కాసేప‌టికి ఎక్క‌డున్నామ‌ని msr అడిగితే తిరుప‌తిలో అని రిపోర్ట‌ర్లు జోక్ చేశారు.

చిత్తూరు zp చైర్మ‌న్ రెడ్డెమ్మ అని declare చేశారు. ck.బాబు ఒప్పుకుంటాడా అంటే పార్టీ ప్రెసిడెంట్ నేను చెబుతున్నా క‌దా అని అన్నాడు. msr ఏం మాయ చేశాడో కానీ, మొండిఘ‌టం ck.బాబుని కూడా దారికి తెచ్చి క‌థ సుఖాంతం చేశాడు.

ర‌మ‌ణ request చేయ‌డంతో ఈ తిట్ల పురాణం ఎవ‌రూ రాయ‌లేదు. జూన్‌, 2001లో జ‌రిగింది. 20 ఏళ్ల త‌ర్వాత msr మృతితో గుర్తొచ్చింది (ర‌మ‌ణ చ‌నిపోయి చాలా ఏళ్లైంది).

స‌త్య‌నారాయ‌ణ‌రావు అంటేనే పార్టీలో భ‌యం. open గా మాట్లాడి చిక్కులు తెచ్చేవాడు. 2002లో ఆంధ్ర‌జ్యోతి re-opening త‌ర్వాత morning walk శీర్షిక కింద ప్ర‌తి ఆదివారం నాయ‌కుల‌తో ఇంట‌ర్వ్యూలు వ‌చ్చేవి.

ఒక వారం msr అపాయింట్‌మెంట్ తీసుకుని సీనియ‌ర్ రిపోర్ట‌ర్ ఉద‌యాన్నే ఆయ‌న ఇంటికి వెళ్లారు. కుటుంబ స‌భ్యులు రిపోర్ట‌ర్‌ని లోప‌లికి రానివ్వ‌కుండా దండం పెట్టారు.

“మీరు ఏదో అడుగుతారు, ఆయ‌న ఇంకేదో చెబుతారు. ఇప్ప‌టికే కుప్ప‌తెప్ప‌లు త‌ల‌నొప్పులు వ‌చ్చాయి. ఇక‌పైన ఆయ‌న ఎవ‌రికీ ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డు” అని తేల్చి చెప్పారు. msr కూడా తానేం చేయ‌లేన‌ని దూరం నుంచే చేతులెత్తేశాడు. ఆ వారం ప‌త్రిక‌లో morning walk రాలేదు.

భ్ర‌ష్టు ప‌ట్టిన రాజ‌కీయాల్లో msr ఒక ఆశా కిర‌ణం. ఆయ‌నేం మాట్లాడినా కామెడీగా ఎందుకు ఉండేదంటే నిజ‌మే మాట్లాడ్తాడు కాబట్టి. స‌త్యానికి మించిన సెటైర్ , హాస్యం వుండ‌వు.

Also Read : ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కు సతీవియోగం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి