iDreamPost

ఖుషీ క్రేజ్ మాములుగా లేదే

ఖుషీ క్రేజ్ మాములుగా లేదే

ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయినా మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నప్పుడు గొప్ప స్పందన ఆశించలేం కానీ ఖుషి మాత్రం దీనికి విభిన్నంగా కనిపిస్తోంది. ఈ నెల 31న సరికొత్త 4కె ప్రింట్ తో రీ మాస్టర్ చేయించి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ దీన్ని బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ఆన్ లైన్ టికెట్లు పెట్టడం ఆలస్యం వేగంగా బుకింగ్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ లాంటి సిటీస్ లో ఏదో కొత్త స్ట్రెయిట్ మూవీ రిలీజ్ అవుతోందన్న రేంజ్ లో హంగామాకు సిద్ధమవుతున్నారు. జస్ట్ రెండు నెలల క్రితమే జల్సా, తమ్ముడులను చూడటం గుర్తేగా

ఇంతగా ఖుషికి ఎందుకు కనెక్ట్ అవుతున్నారనే సందేహం రావడం సహజం. మూడు గంటల నిడివున్న ఈ సినిమా అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 2001లో తమిళంలో విజయ్ ఇదే టైటిల్ తో చేసిన లవ్ ఎంటర్ టైనర్ ని పవన్ రీమేక్ చేస్తున్నప్పుడు ఇండస్ట్రీలో బోలెడు అనుమానాలు తలెత్తాయి. ఒరిజినల్ వెర్షన్ ని డీల్ చేసిన ఎస్జె సూర్య దాన్ని మించిపోయేలా పవన్ ఎనర్జీని పూర్తిగా వాడుకుంటూ కాలేజీలో చదువుకునే హీరో హీరోయిన్ల మధ్య ఈగోల యుద్ధాన్ని అద్భుతంగా ఆవిష్కరించడంతో వసూళ్ల వర్షం కురిసింది. ఆర్టిసి క్రాస్ రోడ్స్ తో మొదలుకుని జిల్లా కేంద్రాల దాకా ఎన్నో రికార్డులు రెండు మూడేళ్ళ పాటు అలా భద్రంగా ఉండిపోయాయి

మణిశర్మ సంగీతం ఇప్పటికీ ఎంత ఫ్రెష్ గా అనిపిస్తుందంటే ఇప్పుడోసారి పాటలు విన్నా రెండు దశాబ్దాల క్రితం కంపోజ్ చేసినట్టు అనిపించవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతే గొప్పగా కుదిరింది. ఆన్లైన్లో ఈజీగా దొరికే సినిమాకి ఇలాంటి స్పందన అరుదు. మహేష్ ఏడో సినిమా ఒక్కడు, జూనియర్ ఎన్టీఆర్ ఏడో సినిమా సింహాద్రిలో హీరోయిన్ గా నటించి వాటి సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన భూమిక పవన్ కళ్యాణ్ ఏడో సినిమా ఖుషిలోనూ జోడి కట్టడం కాకతాళీయమే అయినా అదో గొప్ప విశేషంగా మీడియాలో చెప్పుకునేవారు. ఈ శుక్రవారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం ఖుషికి కలిసి వస్తోంది. వాటికి టాక్ పెద్దగా రాకపోతే రెగ్యులర్ ఆడియన్స్ ఛాయస్ ఖుషినే .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి