iDreamPost

జనసేన అధినేత కి వాస్తవం అర్థం కావడం లేదా? చేసుకోలేరా?

జనసేన అధినేత కి వాస్తవం అర్థం కావడం లేదా? చేసుకోలేరా?

మత్స్యకారుల తరలింపు విషయంలో సాగుతున్న రాజకీయాలు చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఏపీప్రభుత్వం చేసిన ప్రయత్నాలను తక్కువ చేయటానికి,మసిపూసిమారేడు కాయ చేసేందుకు వివిధ పార్టీల నేతలంతా కలిసి సాగిస్తున్న వ్యవహారం విస్మయకరంగా మారుతోంది. ఇప్పటికే టీడీపీ ఈ ప్రయత్నంలో ఉంది. ఆ పార్టీకి చెందిన నేతలంతా ఏకంగా విపక్షంలో ఉన్న చంద్రబాబు వల్లనే గుజరాత్ నుంచి మత్స్యకారులను ఏపీకి తీసుకొస్తున్నారని చెప్పుకోవడానికి సంకోచించ లేదు. చంద్రబాబుకు ఇలా అన్ని నేనే అనటం కొత్తేమి కాదు. అయితే ఇప్పుడు అదే క్రమంలోచంద్రబాబుకు పవన్ కళ్యాణ్‌ కూడా తోడయ్యారు. ఈయన మాత్రం క్రెడిట్ అంతా కిషన్ రెడ్డదే అన్నట్టుగా చెప్పడం మరో విశేషం.

వాస్తవానికి ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారులు ఉపాధి కోసం ఏటా గుజరాత్ తరలివెళుతూ ఉంటారు. అక్కడ అనేక సమస్యలున్నప్పటికీ తమ సొంత ప్రాంతంలో తగిన ఉపాధి లేకపోవడంతో వలసబాటలో సాగడం వారికి అలవాటుగా మారింది. ఈ ఏడాది కూడా అదే తీరులో గుజరాత్ వెళ్లారు. అయితే వాస్తవంగా వాళ్లంతా ఏప్రిల్ మొదటి వారం తర్వాత మళ్లీ సొంత ప్రాంతాలకు రావాల్సి ఉంది. ఏటా ఏప్రిల్ 14 నుంచి జూన్ 13 వరకూ రెండు నెలల పాటు సముద్రంలో వేట నిషేధం అమలు అవుతుంది. అందుకు తగ్గట్టుగా మత్స్యకారులంతా మళ్లీ రావాల్సి ఉన్నప్పటికీ ఈసారి లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు.

వారికి తగిన సదుపాయాలు కల్పించాలని మొదటి నుంచి ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గుజరాత్ సీఎంతో పలుమార్లు జగన్ నేరుగా మాట్లాడారు. వేరవల్ ప్రాంతంలో ఉన్న సుమారు 6 వేల మంది మత్స్యకారులకు ఆహారం ఇతర అవసరాలు అందించాలని కోరారు. అదే సమయంలో వారిని స్వగ్రామాలకు రప్పించేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. కేంద్రంతో మాట్లాడారు. నేరుగా అమిత్ షా ఫోన్ చేసిన సమయంలో దానిని ప్రస్తావించారు. మొత్తంగా సమస్య పరిష్కారం కోసం అవసరం అయితే సముద్ర మార్గంలో తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే రోడ్డు మార్గంలో రావడానికి లైన్ క్లియర్ కావడంతో బస్సులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా 50 స్లీపర్ బస్సులలో వారిని తరలించేందుకు సన్నద్దమయ్యారు. దానికి తగ్గట్టుగా 3 కోట్ల రూపాయలను సీఎంఆర్ఎఫ్‌ నుంచి విడుదల చేశారు.

అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో కిషన్ రెడ్డి కూడా కొంత ప్రయత్నం చేశారు. దానికి ముందు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా చొరవ చూపారు. ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు అవన్నీ తోడు కావడంతో ఎట్టకేలకు సమస్య పరిష్కారం అయ్యేలా తొలివిడత మత్స్యకారుల బృందం గుజరాత్ నుంచి ఏపీకి బయలుదేరింది. దాంతో ఇదంతా మా వల్లనే అంటే మావల్లనే అంటూ చెప్పుకోవడానికి కొందరు సన్నద్దమయ్యారు.

అందులో చంద్రబాబుతో పాటుగా పవన్ కూడా తోడుకావడం విశేషం. వైఎస్ జగన్ చేసిన కృషిని మత్స్యకారులు ధన్యవాదాలు తెలుపుతుండగా ,గుజరాత్ బీజేపీ నేత PVS శర్మ,ప్రముఖ సంస్థ “DeshGujarat” ముఖ్యమంత్రి జగన్ కు ట్విట్టర్లో అభినందనలు కూడా తెలిపారు.కానీ జనసేన అధినేత మాత్రం క్రెడిట్ మొత్తాన్ని కేంద్రానికి మాత్రమే పరిమితం చేయాలని, తద్వారా జగన్ కృషిని తక్కువ చేయాలని ప్రయత్నించడం ఆశ్చర్యం కలిగిస్తుంది…మత్స్యకారులను తరలించటానికి ఆంధ్రా ప్రభుత్వం మూడుకోట్ల నిధులు విడుదల చేసిన అంశాన్ని కూడా పవన్ ప్రస్తావించకపోవటం విస్మయకరం.వీరిని వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమాన్ని పర్యవేక్షించటానికి ముఖ్యమంత్రి జగన్ ఐఏఎస్ అధికారులు సతీష్ చంద్ర,కృష్ణబాబులకు బాధ్యతలు ఇచ్చిన విష్యం కూడా పవన్ కు తెలిసినట్లు లేదు.

గుజరాత్ లో ఇప్పటికే వలస కూలీల సమస్య తీవ్రంగా ఉంది. సూరత్ లో పలుమార్లు వలస కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికీ సమస్య మాత్రం తీరడం లేదు. కానీ ఏపీకి చెందిన మత్స్యకారులను మాత్రం తరలించేందుకు సన్నద్ధం కావడం వెనుక ఏపీ సీఎం చొరవ స్పష్టం అవుతోంది. కానీ దానిని అంగీకరించటానికి పవన్ నిరాకరిస్తున్నారు. నిజాన్ని విస్మరించి జగన్ కి బదులుగా మరొకరి కృషి వల్లే మత్స్యకారులు సొంత రాష్ట్రానికి రాగలుగుతున్నారని చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి ప్రయత్నాల ద్వారా పవన్ ఏం సాధిస్తారన్నది పక్కన పెడితే, వాస్తవాలను జీర్ణించుకోలేని ఆయన నైజం మాత్రం అందరికీ అర్థమవుతుందనడంలో సందేహం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి