iDreamPost

పల్లెలపై ‘జగన్‌’ పట్టు

పల్లెలపై ‘జగన్‌’ పట్టు

నాలుగోదశ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేసరికి పల్లె ప్రాంతాల్లో సీయం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పట్టు స్పష్టమైపోయింది. తొలి దశ నుంచే జగన్‌ హవా ప్రారంభమైందన్నది తేటతెల్లమైంది. అయితే నాలుగో దశతో అది మరింత క్లారిటీ వచ్చింది. స్వచ్ఛమైన పల్లె వాసుల మనస్సులను చూరగొన్న జగన్‌ శిబిరంలో పంచాయతీ ఎన్నికలు ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నాయనే చెప్పాలి. సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు అందజేయడం, పాలనను, సేవలను గుమ్మం ముందుకే చేర్చడంతో జగన్‌మార్కు పాలనను పల్లెలు ఆప్యాంగానే ఆమోదించాయని పంచాయతీ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమైందని పరిశీలకులు చెబుతున్నారు.

13,095 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా ఏకపక్షంగా ప్రజలు 10,524 పంచాయతీల్లో అధికార వైఎస్సార్‌సీపీకే పట్టం గట్టారు. ఈ విషయాన్ని పంచాయతీరాజ్‌శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా ముఖంగా వెల్లడించారు. ఇదేదో అంచనాలు కావని అధికారిక లెక్కలేనంటూ ప్రత్యర్ధులు చేస్తున్న గోబెల్స్‌ ప్రచారానిని కరాఖండీగా ఖండించేసారు. ఎన్నికలు జరిగిన గ్రామాల్లో 80శాతానికిపైగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే విజయం దక్కినట్లు లెక్కతేల్చారు. ప్రతిపక్ష పాత్రలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన మద్దతుదారులు 2,063 స్థానాలకు పరిమితమైపోయారు. అంటే 15.75శాతం స్థానాల్లో మాత్రమే విజయం దక్కించుకున్నారన్నమాట. ఇక మిగిలిన వారు 488 స్థానాలను, 3.88 శాతం సీట్లను మాత్రమే పొందినట్లు మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించారు. ఈ లెక్కలేవో ఆషామాషీగా వేయలేదన్నారు. సంబంధిత రికార్డులను దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నట్లుగా ప్రకటించారు.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకొచ్చి ఏడాదిన్నర దాటిపోవడం. అధికారంలోకొచ్చిందే తడవుగా దారుణమైన ఆర్ధిక స్థితి, కరోనా ఇత్యాధి సమస్యల నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉంటుందని ప్రతిపక్షాలు ఎంతో ఆశతో ఎదురు చూసాయి. ఇదే కారణంగా జాతీయ మీడియా సైతం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేకంగానే దృష్టిపెట్టిందని చెప్పాలి. అయితే ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా రావడంతో జగన్‌పాలనకు ప్రజలు ఇచ్చిన ప్రోగ్రెస్‌ రిపోర్టుగానే చెబుతున్నారు. అదే సమయంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు పార్టీలను కలుపుకున్నా 20శాతం సీట్లను కూడా గెల్చుకోలేకపోవడం ఆయా పార్టీల సామర్ధ్యాన్ని ఇప్పుడు వేలెత్తిచూపించే పరిస్థితి ఎదురైంది.

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులగా పంచాయతీలో పోటీ చేసేందుకు కూడా అభ్యర్ధులు కరువైన పరిస్థితులు కూడా ఉన్నాయని క్షేత్రస్థాయిలో ఎన్నికలను పరిశీలించిన పలువురు పరిశీలకులు పేర్కొంటున్నారు. ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే నేరుగా ఎన్నికలకు వెళ్ళింది. మిగిలిన అన్ని పార్టీలు గ్రామాల్లో పరిస్థితులను బట్టి, మూడు గానీ, ఏవైనా రెండు పార్టీలుగానీ పొత్తులతో రంగంలోకి దిగాయి. అయినప్పటికీ పంచాయతీల్లో వార్డు సభ్యులను కూడా పూర్తిగా పోటీకి పెట్టలేని దారుణ పరిస్థితిని అవి ఎదుర్కొన్నాయి.

ఇందుకు ప్రధాన కారణం సీయం జగన్మోహన్‌రెడ్డి సంక్షేమ నినాదం ఒక కారణం అయితే, ప్రతిపక్ష పార్టీలు ప్రజలను పట్టించుకోకుండా చేస్తున్న వ్యవహారాలు కూడా కారణంగా నిలిచాయని విశ్లేషకులు తేల్చేస్తున్నారు. మూడు పార్టీలు కలిపితే ఇరవైశాతం లోపుగానే విజయం సాధించినట్లుగా ఇప్పటికే తేలింది. అయితే ఏ పార్టీకి ఆ పార్టీ ఎన్ని సీట్లు? అన్న లెక్కలు విడదీసి వేస్తే మాత్రం.. సోషల్‌ మీడియాలో ఆయా పార్టీలు చేసుకుంటున్న ప్రచారంలోని డొల్లతనం ఇట్టే బైటపడిపోతుంది. చంద్రబాబు నాయుడు మొదలుకు క్షేత్రస్థాయి నాయకుడి వరకు టీడీపీ మద్దతు ఇచ్చినప్పటికీ ఆ అభ్యర్ధి విజయం సాధిస్తే తమ పార్టీ అభ్యర్ధే విజయం సాధించినట్లుగా లెక్కలు వేసేసుకుని ప్రకటించేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రజలే ఈ పద్దతిపై పెదవి విరిస్తుండడం గమనార్హం.

ఎంతగా ఎదురుదాడి చేద్దామని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాగానీ.. వాస్తవ పరిస్థితులను గమనిస్తున్న ప్రజలు వీరి హడావిడి అస్సలేమాత్రం పట్టించుకుంటున్న దాఖలాల్లేవు. అధికార వైఎస్సార్‌సీపీకి తమ బలాన్ని ఓ సారి పరీక్షించుకునే అవకాశం పంచాయతీ ఎన్నికలు కల్పించగా, ప్రతిపక్షాల పట్టు కోల్పోవడాన్ని కూడా వారికి అనుభవంలోకి తెచ్చిందనే చెప్పాలి. పల్లెల్లో జగన్‌ పట్టు స్పష్టమైపోయిన నేపథ్యంలో ఇప్పుడు పట్టణాలవైపు అధికార వైఎస్సార్‌సీపీ దృష్టి సారించింది. రెట్టించిన ఉత్సాహంగా అక్కడ తమ బావుటాను ఎగరేసేందుకు సమాయత్తమైపోయింది. అదే సమయంలో పట్టణాల్లో తమ పరువు కాపాడుకునే ప్రయత్నాల్లో ప్రతిపక్షాలు ‘ఉమ్మడి’ ప్రయత్నాల్లో మునిగిపోయాయి.

ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో తొలుత ఎన్నికల కమిషనర్‌ను పొగిడి, సన్మానాలు, సత్కారాలు చేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు తాము ఆశించిన ఫలితాలకు భిన్నంగా పంచాయతీ ఎన్నికల రిజల్ట్‌ రావడంతో అదే కమిషనర్‌పై విమర్శల దాడికి దిగుతున్నారు. అదే సమయంలో నిమ్మగడ్డ వ్యవహారం కారణంగానే తాము మరో పదిశాతం సీట్లు కోల్పోయామని, లేకపోతే 80కి బదులు 90శాతం పంచాయతీలను గెల్చుకుని ఉండేవాళ్ళమని అధికార పక్షం వాదిస్తోంది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలు సంక్షేమ పాలననే కోరుకుంటున్నారని మరో సారి స్పష్టమైపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి