iDreamPost

భారత్‌లోకి ప్రవేశించిన పాక్‌ పడవలో కోట్లాది విలువైన డ్రగ్స్‌

భారత్‌లోకి ప్రవేశించిన పాక్‌ పడవలో కోట్లాది విలువైన డ్రగ్స్‌

భారత జలాల్లోకి ప్రవేశించిన ఓ పాకిస్తాన్ పడవలో రూ.280 కోట్ల విలువైన హెరాయిన్‌ను కోస్టుగార్డు అధికారులు సోమవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లోని అరేబియా సముద్ర తీరానికి సమీపంలో 56 కిలోల హెరాయిన్‌ సీజ్‌ చేయడంతోపాటు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నామని రక్షణశాఖ ప్రతినిధి ప్రకటించారు. గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌(ఏటీస్‌) ఇచ్చిన సమాచారంతో కోస్టుగార్డు సిబ్బంది సోమవారం తెల్లవారు జామున సముద్రంలో గాలింపు చేపట్టారు.

అంతర్జాతీయ సరిహద్దుకు దాదాపు 15 నాటికల్‌ మైళ్ల దూరంలోని భారత జలాల్లో ఉన్న ‘అల్‌ హజ్‌’ అనే పాకిస్తాన్ పడవను గుర్తించారు. కోస్టుగార్డు రాకను గమనించిన ఆ పడవలోని వ్యక్తులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో కోస్టుగార్డు జరిపిన కాల్పుల్లో పడవలో ఉన్న పలువురు గాయపడ్డారు. ఈ పడవలోని సరుకు ఎక్కడికి, ఎవరికి చేరాల్సి ఉందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

కాగా, కరాచీకి చెందిన ముస్తఫ అనే వ్యక్తి ఈ అక్రమ రవాణా వెనుక ఉన్నట్టుగా భావిస్తున్నామని గుజరాత్‌ డీజీపీ ఆశీష్‌ భాటియా పేర్కొన్నారు. ఇక, గుజరాత్‌, కచ్‌ జిల్లాలోని కండ్ల పోర్టులో రూ.1,439 కోట్ల విలువైన 205.6 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఇందుకు సంబంధించి ఒకరిని అరెస్టు చేశామని డీఆర్‌ఐ సోమవారం ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్‌- అక్టోబర్‌ నెలల్లో ఇరాన్‌ నుంచి కండ్ల పోర్టుకు వచ్చిన 17 కంటెయినర్లను పరిశీలనలో ఉంచిన అధికారులు వాటిలోని ఓ కంటెయినర్‌లో హెరాయిన్‌ను ఇటీవల గుర్తించారు. గుజరాత్‌ ఏటీఎస్‌ విభాగం, డీఆర్‌ఐ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ నిర్వహించాయి.

ఈ కంటెయినర్లు ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ సంస్థ పేరుతో ఇరాన్‌ నుంచి దిగుమతి అయ్యాయి. అయితే, ఆ సంస్థకు చెందిన వ్యక్తి పరారవ్వగా పంజాబ్‌లోని ఓ గ్రామంలో ఆదివారం అతన్ని అరెస్టు చేశారు. కాగా, కండ్ల పోర్టులో డీఆర్‌ఐ అధికారులతో కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో 200 కిలోలకు పైగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని ఏటీఎస్‌ ఏప్రిల్‌ 21నే ప్రకటించింది.

కాగా, వివిధ ప్రాంతాల నుంచి భారతదేశంలోకి వచ్చిన 264 కిలోలకు పైగా హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, గుజరాత్‌లోని అరేబియా సముద్ర తీరం, అక్కడి ఓ పోర్టులో జరిపిన తనిఖీల్లో ఈ మొత్తాన్ని గుర్తించి సీజ్‌ చేశారు. ఇందుకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం వేర్వేరుగా చేసిన ప్రకటనల ప్రకారం పట్టుబడిన హెరాయిన్‌ విలువ రూ.1740.90 కోట్లకు పైగా ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి