iDreamPost

OTT Subscription Prices : ఓటిటిల మధ్య ధరల పోటీ

OTT Subscription Prices : ఓటిటిల మధ్య ధరల పోటీ

కరోనా లాక్ డౌన్ తర్వాత ఓటిటి దూకుడు ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒకవేళ ఈ మహమ్మారి రాకపోయి ఉంటే అసలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అనే పదమే వినిపించేది కాదన్నది వాస్తవం. కేవలం ఏడాది కాలంలోనే ప్రతి యాప్ కు సగటు చందాదారుల సంఖ్య లక్షల నుంచి కోట్లలోకి పెరిగిపోయింది. దానికి అనుగుణంగానే క్వాలిటీ కంటెంట్ ఇవ్వడంతో పాటు ధరల విషయంలో కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ ఇవాళ నుంచి తన ఏడాది చందాను ఏకంగా 500 రూపాయలు పెంచేసింది. నిన్నటి దాకా 999 ఉన్న ధర ఈ రోజు 1499 అయ్యింది. నెలవారీ మొత్తంలోనూ మార్పులు చేసింది.

వరల్డ్ రేటింగ్ టాప్ లో ఉన్న నెట్ ఫ్లిక్స్ అనూహ్యంగా తన ఇండియా ప్లాన్ లో తగ్గుదల చేసింది. 199 నుంచే తన కంటెంట్ ని టీవీలో చూసే ఆప్షన్ ఇచ్చింది. ఒకవేళ మొబైల్ కే పరిమితం కావాలనుకుంటే 149 ది వాడుకోవచ్చు. ఇవి నెల వారి ప్యాకేజీలు. గతంతో పోలిస్తే ఇది చాలా పెద్ద తగ్గింపనే చెప్పాలి. ప్రైమ్ పెంచిన రోజే నెట్ ఫ్లిక్స్ తగ్గించడం ఖచ్చితంగా తెలివైన స్ట్రాటజీనే. ఇటీవలి కాలంలో ఓటిటిల మధ్య పోటీ తీవ్రమయ్యింది. సోనీ లివ్ ఎంట్రీ ఇచ్చాక ఓటిటి కౌంట్ పెరిగిపోయింది. డిస్నీ హాట్ స్టార్, ఆహా, ఊట్, హులు, లయన్స్ గేట్స్ ప్లే లాంటివి ఆడియన్స్ కు పలురకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ రీజనబుల్ ప్యాకేజీలే.

థియేటర్లు తెరుచుకున్నాక కూడా ఓటిటి హవా తగ్గలేదు. చిన్న సినిమాలకు జనం హాళ్లను ప్రిఫర్ చేయడం లేదు. ఎలాగూ దేంట్లోనో ఒకదాంట్లో వస్తుంది కదా ఒక నెల వేచి చూద్దాం అనే మనస్తత్వం పెరిగిపోయింది. దానికి అనుగుణంగానే బడ్జెట్ లో రూపొందిన చిత్రాలు పట్టుమని వారం రోజులు థియేటర్లో ఉండటం కష్టమై పోయింది. రాబోయే రోజుల్లో కూడా రాజీ లేకుండా కొత్త సినిమాలు ఇచ్చేందుకు డిజిటల్ సంస్థలు గట్టిగానే పోటీ పడబోతున్నాయి. అది జరగాలంటే హక్కుల కోసం పెట్టుబడి పెరుగుతోంది కాబట్టి దానికి తగ్గట్టు ఇలా రేట్లు పెంచడం తగ్గించడం చేస్తున్నాయి. అలవాటు పడ్డాక ఎక్కువైనా తక్కువైనా భరించాల్సిందేగా

Also Read : 2022 Sankranthi Releases : థియేటర్ల సర్దుబాటు జరిగే పనేనా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి