iDreamPost

ఉల్లి రైతు కోటీశ్వరుడు

ఉల్లి రైతు కోటీశ్వరుడు

రైతే రాజు అని నానుడి. ఈ మాట ఉల్లి ధర పెరగడంతో నిజమైంది. కర్ణాటకలో ఓ ఉల్లి రైతు కోటీశ్వరుడయ్యారు. ఇన్నాళ్లు తట్టకు బుట్టకు అన్నట్లు పెట్టుబడులు రావడమే గగమయ్యేది. నేడు ఉల్లి కొరతతో పెరిగిన ధర వల్ల ఉల్లి పంట వేసిన రైతుల ఇంట సిరులు పండుతున్నాయి. కర్ణాటకకు చెందిన మల్లికార్జున్‌ అనే రైతు ఎన్నో ఏళ్లుగా ఉల్లిని పండిస్తున్నాడు. లాభం సంగతి అట్లా ఉంచితే ప్రతిసారి అప్పులు మాత్రమే మిగిలేవి.

ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా భారీ ఎత్తున ఉల్లి సాగు చేశాడు. తనకున్న పది ఎకరాలతో పాటు మరో పది ఎకరాల పొలంను కౌలుకు తీసుకుని మొత్తం 20 ఎకరాల్లో ఉల్లి సాగుచేశాడు. గతంలో క్వింటాల్‌ కేవలం వందల్లో ఉండే ఉల్లి ఈసారి ఏకంగా రూ.15 వేలకు పై మాటే పలికింది. ప్రతి రోజు వందల టన్నుల ఉల్లిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాడు. దాదాపు వంద మంది కూలీలు ఆయన పొలంలో పనిచేస్తున్నారు.

ఇప్పటివరకు సుమారు 20 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టానని రైతు మల్లికార్జున్ చెబుతున్నారు. ఖర్చులు పోను కోటి రూపాయలు లాభం వచ్చినట్లు పేర్కొంటున్నారు. తన జీవితంలో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడంతో ఆ రైతు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తొలుత ఓ పెద్ద ఇల్లు కట్టుకుంటానని తెలిపారు.

దేశ వ్యాప్తంగా పెరిగిన ఉల్లి ధర సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోన్న విషయం విదితమే. ఉల్లి కోయకముందే కన్నీళ్లు తెప్పిస్తోంది. వంటింట్లో ఉల్లిని కోయాలంటేనే మద్యతరగతి ప్రజలు ఒకటికి పది సార్లు లెక్కలు వేసుకుంటున్నారు. దేశంలో ఎక్కడ చూసిన రూ.100కు పై మాటే. కొన్ని ప్రాంతాల్లో ఐతే ఏకంగా రూ.200కు చేరిది. ఉల్లి భారం తగ్గించేందుకు కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సర్కార్ రైతు బజార్లు, వ్యయసాయ మార్కెట్లలో కిలో 25 రూపాయలకే విక్రయిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి