iDreamPost

పార‌డైజ్‌లో కూడా No Onions

పార‌డైజ్‌లో కూడా No Onions

ఉల్లిపాయ దొర‌క్క‌పోతే నాలాంటి వాడికి స్వ‌ర్గం కూడా న‌ర‌క‌మే. పార‌డైజ్ రెస్టారెంట్‌లో నిన్న‌రాత్రి బిర్యాని తింటే ఆనియ‌న్స్ లేవ‌ని చెప్పారు. ఈ 20 ఏళ్ల‌లో ఇదే తొలి అనుభ‌వం.

ఎందుకో తెలియ‌దు కానీ చిన్న‌ప్ప‌టి నుంచి ఉల్లిపాయ‌లంటే ఇష్టం. మా ఊళ్లో ఉలిగ‌డ్డ‌లంటారు. అనంత‌పురంలో ఎర్ర‌గ‌డ్డ‌లంటారు. ఆ త‌ర్వాత ఊళ్లు తిరుగుతూ ఉల్లిపాయ‌ల‌కు అల‌వాటు ప‌డ్డాను. నా చిన్న‌ప్పుడు ఆనంద‌శెట్టి అనే ఆయ‌న బండిలో మిక్చ‌ర్ అమ్మేవాడు. ఆయ‌న గంట వినిపిస్తే పరిగెత్తుకెళ్లి 5 పైస‌ల మిక్చ‌ర్ కొనుక్కునేవాన్ని. 10 పైస‌లంటే ల‌గ్జ‌రీ మ‌నీ అనుకునే కాలం. ఒక చిన్న‌పొట్లంలో ఆయ‌న ఇచ్చేవాడు. ఉలిగ‌డ్డ‌లు ఇంకొంచెం అంటే న‌వ్వుతూ “పిల్ల‌లు ఎక్కువ తిన‌ కూడ‌దురా” అంటూనే వేసేవాడు. ఐదుగురు పిల్ల‌ల్ని ఆ బండి మీదే సాకేవాడు. బాధ‌ల్ని అణిచేసి , న‌వ్వుని మాత్ర‌మే బ‌య‌టికి తీసేవాడు.

త‌ర్వాత అనంత‌పురంలో టెన్త్ క్లాస్ చ‌దివాను. ర‌ఘువీర టాకీస్ ద‌గ్గ‌ర బొరుగుల నాగ‌న్న ఉండేవాడు. ఆయ‌న‌కెంత డిమాండ్ అంటే క‌నీసం అర‌గంట వెయిట్ చేయాల్సి వ‌చ్చేది. రెండు గంప‌ల‌కి ఎర్ర‌గ‌డ్డ‌లు త‌రిగి తెచ్చుకునేవాడు. చేతులు విప‌రీత‌మైన వేగంతో క‌దిలేవి. బొరుగుల మిక్చ‌ర్ వేయ‌డంలో అంత స్పెష‌లిస్ట్‌ని ఇంత వ‌ర‌కూ చూడ‌లేదు. ఎర్ర‌గ‌డ్డ‌లు ఎంత ఎక్కువ అడిగినా విసుక్కునేవాడు కాదు. ఆ పేద బండిలోనే పిల్ల‌ల్ని ప్ర‌యోజ‌కుల్ని చేశాడు. అల‌సిపోయిన ఆ చేతులు వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకున్నాయి. రెండు గంప‌ల ఎర్ర‌గ‌డ్డ‌లు త‌రుగుతూ ఎన్ని క‌న్నీళ్లు కార్చి ఉంటాడో! చేసిన క‌ష్టం పిల్ల‌ల ఉద్యోగ రూపంలో క‌నిపిస్తూ ఉంటే ఈ మ‌ధ్యే బెంగ‌ళూరులో చ‌నిపోయాడ‌ని తెలిసింది.

ఈ ఆనియ‌న్స్ న‌న్ను వ‌ద‌ల్లేదు. ఇప్ప‌టికీ పానీపూరీ, బిర్యానీ, చ‌పాతీ ఏదీ తిన్నా ఆనియ‌న్స్ ఎక్కువ అడిగి వేయించుకునేవాన్ని. ఇపుడేమో క‌ష్ట‌కాలం వ‌చ్చింది. మ‌రీ ఇంత ధ‌ర పెట్టి మ‌నం కొంటున్న‌ప్పుడు రైతుకి మంచి కాల‌మా అంటూ అదీ లేదు. అంతా ద‌ళారుల భోజ్యం.

మార్కెట్‌లో ఇప్పుడు రూ.150- రూ.200 మ‌రి ఇదే ఉల్లిరైతు గ‌తంలో గిట్టుబాటు ధ‌ర ఎంత అడిగాడో తెలుసా? కిలోకి రూ.8.50. దానికి కూడా కేంద్ర‌ప్ర‌భుత్వం స‌మ్మ‌తించ‌లేదు. ఉల్లిధ‌ర‌లు పెరిగాయి. కాబ‌ట్టి ఇప్పుడు దిగుబ‌డి చేసుకుంటామ‌ని అంటోంది. ఈ బాధ్య‌త‌ని మెట‌ల్స్ అండ్ మిన‌ర‌ల్ ట్రేడింగ్ కార్పొరేష‌న్ ( MMTC )కి అప్ప‌గించింది. దానికి దిగుమ‌తుల విష‌యంలో అస్స‌లు అనుభ‌వం లేదు.

స‌రే ఈ దిగుమ‌తి కూడా అంత సుల‌భ‌మేం కాదు. ఫ‌స్ట్ అంత‌ర్జాతీయ టెండ‌ర్లు పిల‌వాలి. ఇదంతా పూర్త‌యి ఒక ఒప్పందం కుదిరాక ఆయా దేశాల నుంచి ఉలిపాయ‌లు రావ‌డానికి క‌నీసం ఐదారు వారాలు ప‌డుతుంది. MMTCకి సొంత గోదాములు లేవు. దానికి మ‌ళ్లీ టెండ‌ర్లు పిల‌వాలి. అంతా అయిన త‌ర్వాత హోల్‌సేల్‌గా అమ్మ‌డానికి టెండ‌ర్లు పిలుస్తారు. వాళ్లు రిటైల్‌గా అమ్మితే వినియోగ‌దారునికి అందుతుంది. డిసెంబ‌ర్ ఆఖ‌రికి దేశంలోని రైతుల‌కి ఉల్లిపంట చేతికొస్తుంది. అదే స‌మ‌యానికి దిగుమ‌తులు వ‌స్తాయి. అన్నీ క‌లిసి ఉల్లిరైతుని రోడ్డుమీద ప‌డేసి పురుగుల మందు తాగేలా చేస్తాయి. ఇది కేంద్రం రైతుల‌కి చేసేమేలు.

ఆంధ్ర రాష్ర్టంలో జ‌గ‌న్ ఎంతోకొంత స‌బ్సిడీకి ఇవ్వ‌గ‌లిగాడు. ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి అనేది మంచి ప‌థ‌కం. దాన్ని ఎంతోకొంత ప‌క్కాగా అమ‌లు చేస్తే రైతు దివాళా తీయ‌కుండా ఉంటాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి