iDreamPost

ఎప్పుడూ చూడని బ్యాడ్ ఫ్రైడే ఇది

ఎప్పుడూ చూడని బ్యాడ్  ఫ్రైడే ఇది

భారతీయ సినిమా చరిత్రలో ఓ జబ్బు తాలూకు వైరస్ కి భయపడి ఫిలిం ఇండస్ట్రీతో పాటు అన్ని రంగాలు ఈ స్థాయిలో స్తంభించిపోవడం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. వేలాది థియేటర్లు, మల్టీ ప్లెక్సులు ఎక్కడికక్కడ మూతబడ్డాయి. ఏకంగా ప్రధాని మోడీనే బయటికి రావొద్దని పిలుపునిచ్చాక జనం చాలా అవసరం అయితే తప్ప గడపలు దాటేందుకు ఆలోచిస్తున్నారు. ఒకరకంగా చెప్పలంటే ఎంటర్ టైన్మెంట్ మీడియాకి ఇది మొదటి డ్రై ఫ్రైడే. ప్రతి శుక్రవారం కొత్త సినిమాల రిలీజులతో ప్రసాద్ ఐమ్యాక్స్ బయట టీవీ ఛానెళ్ల హడావిడితో అదో రకమైన పండగ వాతావరణం నెలకొనేది. చిన్న సెంటర్లలో సైతం ప్రేక్షకులు సినిమా హాళ్లకు వెళ్లేందుకు ఉత్సాహం చూపించేవారు.

కానీ ఇప్పుడు సీన్ రివర్స్. ప్రతిచోటా శ్మశాన వైరాగ్యం రాజ్యమేలుతోంది. ఎక్కడ గుంపులు కాదు కదా కనీసం సదరు థియేటర్ స్టాఫ్ కూడా వాటి దరిదాపుల్లో కనిపించడం లేదు. ఎప్పటికి సద్దుమణుగుతుందో అర్థం కానీ పరిస్థితి. ఇంకొద్ది వారాలు త్యాగం చేయండని మోడీ పిలుపునివ్వడం చూస్తుంటే ఏప్రిల్ కూడా ఖర్చయిపోయేలా ఉంది. అసలీ కరోనా గొడవ లేకపోతే నాని వితో ఉగాది చాలా హుషారుగా మొదలయ్యేది. ఆపై ఏప్రిల్ 2న ఒకేరోజు నిశ్శబ్దం, ఉప్పెనలు అలరించేవి. కానీ ఇవీ వాయిదా పడే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే రానా అరణ్య పోస్ట్ పోన్ చేశారు.

ఇండియా మొదటిసారి క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన నేపధ్యాన్ని తీసుకుని రూపొందించిన 83 సైతం వాయిదా పడింది. ఇందాక అధికారికంగా ప్రకటించారు. ఒకవేళ కరోనా ప్రభావం తగ్గినా ఏప్రిల్ లో విడుదల ప్లాన్ చేసేందుకు అన్ని బాషల నిర్మాతలు జంకుతున్నారు. ఒకవేళ ధైర్యం చేసి రిలీజ్ చేశాక ఇంకా కరోనా భయాలు తగ్గకపోయి జనం రాకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అందుకే మే దాకా వేచి చూడాలని భారీ చిత్రాల నిర్మాతలు ఆలోచిస్తుండగా ఒకవేళ ప్రభుత్వం అనుమతిస్తే ఏప్రిల్ నెల మొత్తం చిన్న సినిమాలతో నింపేసేలా ప్లానింగ్ జరుగుతోందట. మొత్తానికి కోవిడ్ 19 వల్ల ఊహించని బ్యాడ్ ఫ్రైడే టాలీవుడ్ కు ఎదురయ్యింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి