iDreamPost

November Releases :థియేటర్లు ఖాళీ – టికెట్ కౌంటర్లకు జోష్ రావాలి

November Releases :థియేటర్లు ఖాళీ – టికెట్ కౌంటర్లకు జోష్ రావాలి

ఒకపక్క సినిమాలేమో వారం వారం కనీసం అయిదారు క్రమం తప్పకుండ విడుదలవుతూనే ఉన్నాయి. కానీ థియేటర్లు మాత్రం వెలవెలబోతున్నాయి. చాలా చోట్ల కనీసం కరెంటు చార్జీలు కూడా రాబట్టలేని దీని స్థితిలో యాజమాన్యాలు స్టార్ హీరోల చిత్రాల కోసం కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా నవంబర్ మరీ నీరసంగా సాగి ఒక్కటంటే ఒక్కటి గట్టిగా చెప్పుకునే హిట్టు లేక అలో లక్ష్మణా అని అరిపించేసింది. మొదటి వారంలో వచ్చిన మంచి రోజులు వచ్చాయి ,మీద అంతో ఇంతో అంచనాలు పెట్టుకున్నా దర్శకుడు మారుతీ వాటిని నిలబెట్టుకోలేకపోయారు. బిజినెస్ గట్టిగా జరుపుకున్నప్పటికీ బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది.

తర్వాత వచ్చిన రాజా విక్రమార్క, పుష్పక విమానంలు కూడా ఇదే దారి పట్టాయి. రెండోదానికి విపరీతమైన పబ్లిసిటీ చేసినా లాభం లేకపోయింది. ఆ మాత్రం కలెక్షన్లైనా వచ్చాయంటే అది దాని పుణ్యమే. ఇక 19న రిలీజైన చిన్న సినిమాలన్నీ అడ్రెస్ లేకుండా పోయాయి. ఊరికి ఉత్తరాన, రామ్ అసుర, రావణ లంక అంటూ ఏవేవో పలకరించాయి కానీ జనానికి ఏదీ కనీసం రిజిస్టర్ కూడా కాలేదు. ఇక మొన్న వచ్చిన అనుభవించు రాజా, 1997 లాంటివాటిది కూడా సేమ్ సీన్. పట్టుమని పది కోట్ల షేర్ దాటిన సినిమా ఏదీ లేకపోవడం పెద్ద విషాదం. జరిగిన బిజినెస్ ఏమో ఆకాశంలో వస్తున్న లెక్కేమో త్రిశంకు స్వర్గంలో అన్నట్టుంది పరిస్థితి.

విచిత్రంగా ఓటిటి రిలీజులకు మంచి స్పందన దక్కింది. దృశ్యం 2 ప్రైమ్ ద్వారా విడుదల కాగా సోషల్ మీడియా ట్రెండ్ ని గమనిస్తే వ్యూస్ కోట్లలో వచ్చినట్టుగా అర్థమవుతోంది. తేజ సజ్జ శివాని రాజశేఖర్ ల అద్భుతం కూడా చిన్నితెరపై నిక్షేపంగా చూడొచ్చనే అభిప్రాయాన్ని కలిగించింది. ఇవి కాకుండా ఆల్రెడీ థియేటర్లో వచ్చిన రిపబ్లిక్, రొమాంటిక్, పెద్దన్న లాంటి సినిమాలను తక్కువ గ్యాప్ లో డిజిటల్ కు ఇవ్వడంతో హోమ్ ఆడియన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. డిసెంబర్ 2 రాబోతున్న అఖండ నుంచి పరిస్థితిలో అనూహ్యమైన మార్పు వస్తుందనే అంచనాలో డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో

Also Read : Satyameva Jayathe : సత్యమేవ జయతే 2 రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి