iDreamPost

నిమ్మగడ్డ రాజకీయ ఎత్తుగడ..! స్థానికం బంతి హైకోర్టులో వేసే యోచన

నిమ్మగడ్డ రాజకీయ ఎత్తుగడ..! స్థానికం బంతి హైకోర్టులో వేసే యోచన

ముమ్మరంగా సాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కరోనా వైరస్‌ను బూచిగా చూపి ఏకపక్షంగా వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. నేడు కరోనా వైరస్‌ కేసులు నమోదువుతున్న తరుణంలో ఎన్నికలు జరపాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. ఇందుకు ఆయన ఓ రాజకీయ నాయకుడిగా ఎత్తులు వేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికల వాయిదా తర్వాత జరిగిన పరిణామాలు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రాజకీయ నాయకుడిగా మలిచాయనే అభిప్రాయాలు నెలకొన్నాయి. పార్క్‌ హయత్‌ హోటల్‌లో టీడీపీ మాజీ నేతలు, చంద్రబాబు సన్నిహితులైన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో భేటీ కావడంతో అందరి అభిప్రాయాలకు బలం చేకూరింది. నిమ్మగడ్డ అసలు నైజం బయటపడింది.

కోర్టులకు వెళ్లి ఎస్‌ఈసీ పదవిని మళ్లీ సంపాదించుకున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఆ తర్వాత రాజ్యంగబద్ధమైన ఎన్నికల కమిషనర్‌ హోదాలో కాకుండా.. రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని ఆయన పని తీరును బట్టి చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణకే నిమ్మగడ్డ మొగ్గు చూపుతున్నారు. ఎన్నికలు తదుపరి మొదలు, నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలని సుప్రిం కోర్టు జారీ చేసిన ఆదేశాలన కూడా నిమ్మగడ్డ పట్టించుకోకపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఎన్నికలు నిర్వహణపై చర్చిద్దామంటూ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపారు. ఈ సమాచారం తర్వాత ఎన్నికలు నవంబర్, డిసెంబర్‌లలో సాధ్యం కాదంటూ రాష్ట్ర మంత్రులు స్పష్టంగా చెప్పినప్పటికీ నిమ్మగడ్డ సమావేశం నిర్వహించారు.

రాజకీయ పార్టీలతో సమావేశం తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల కమిషనర్‌తో సమావేశమయ్యారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదంటూ స్పష్టంగా చెప్పారు. దీంతో నిమ్మగడ్డ సరికొత్త ఎత్తుగడ వేశారు. ముందుగా ఊహించినట్టే రాజకీయ పార్టీల అభిప్రాయాలను హైకోర్టుకు అఫిడవిట్‌ రూపంలో తెలియజేయాలని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రభుత్వం తన వైఖరిని చెప్పిన నేపథ్యంలో.. అందుకు భిన్నంగా తాను ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటే.. వివాదం అవుతుందని నిమ్మగడ్డ భావిస్తున్నట్లుగా ఉంది. అందుకే రాజకీయ పార్టీల అభిప్రాయాలను హైకోర్టుకు అఫిడవిట్‌ రూపంలో సమర్పించి.. ఆ తర్వాత ఎన్నికల నిర్వహణపై నిర్ణయాన్ని హైకోర్టుకే వదిలేయాలనే ఆలోచనను నిమ్మగడ్డ చేస్తున్నారంటూ టాక్‌ నడుస్తోంది. హైకోర్టు నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరు, విమర్శలు చేయలేరు కాబట్టి.. ఆ దిశగా నిమ్మగడ్డ వ్యవహారం నడుపుతున్నట్లుగా చర్చ నడుస్తోంది.

18 పార్టీలకు గాను నిమ్మగడ్డ నిర్వహించిన సమావేశానికి 11 పార్టీలు హాజరయ్యారు. వైసీపీ సహా ఇతర చిన్నచితకా పార్టీలు హాజరుకాలేదు. సీపీఎం మినహా సమావేశానికి హాజరైన అన్ని పార్టీలు దాదాపుగా ఎన్నికలు నిర్వహించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అంతేకాకుండా కొత్తగా మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని కూడా డిమాండ్‌ చేశాయి. ఇలాంటి నేపథ్యంలో నిమ్మగడ్డ దాఖలు చేసిన అఫిడవిట్‌ ఆధారంగా నవంబర్‌ 2వ తేదీన జరిగే విచారణలో హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు.. ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటుందా..? లేక ఎన్నికల కమిషనర్‌ అఫిడవిట్‌ను దృష్టిలో పెట్టుకుంటుందా..? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి