Idream media
Idream media
1965-75 మధ్య కాలంలో సైకిల్ అంటే ఒక కల, లగ్జరీ. రోడ్డు మీద బైకులు లేని రోజులు. నాకు చిన్నప్పుడు మూడు చక్రాల సైకిల్ ఉండేది. అది ఎంత గట్టి పిండమంటే , కోపం వచ్చినప్పుడు ఒక్క తన్ను తంతే మెట్ల మీద దొర్లుతూ వెళ్లి ఒక మూల బుద్ధిగా నిలబడేది. నాకు 20 ఏళ్ల వయసు వచ్చే వరకు చెక్కు చెదరలేదు. అది అట్లాస్ సైకిల్. దాని స్టామినా అలాంటిది.
మధ్య తరగతి వాళ్లు కూడా సైకిల్ కొనాలంటే ఆలోచించేవాళ్లు. మూడు నాలుగు వందలు జీతాలు వచ్చే రోజుల్లో సైకిల్ 100-150 రూపాయలుండేది. సైకిల్ మీద స్కూల్‌కొచ్చే అయ్యవార్లు చాలా తక్కువ మంది ఉండేవాళ్లు. హైస్కూల్లో మాత్రం పల్లెటూరి నుంచి వచ్చే పిల్లలు డొక్కు సైకిళ్లలో వచ్చేవాళ్లు.
అట్లాస్ సైకిల్ ప్రత్యేకత ఏమంటే ధర తక్కువ. దీనికంటే హెర్క్యులిస్ సైకిల్ చాలా ఖరీదు. రాలీస్ అనే సైకిల్‌ని మారాజులు మాత్రమే కొనేవాళ్లు. బాడుగ సైకిల్ షాపు నడిపేవాళ్లు. అట్లాస్ సైకిళ్లనే కొనేవాళ్లు. సైకిళ్ల వెనుక నెంబర్లు వేసి వరుసగా నిలబెట్టేవాళ్లు. అరగంటకి పది పైసలు.
నేను ఐదో తరగతి చదివేటప్పుడు చిన్న సైకిల్‌ని అద్దె షాపు వాళ్లు తెచ్చారు. ఎర్రటి రంగుతో ముద్దుగా ఉండేది. భూగోళాన్ని నెత్తిన ఎత్తుకున్న అట్లాస్ సింబల్‌తో మెరిసిపోయేది. దాని అద్దె అరగంటకి పదైదు పైసలు. విపరీతమైన పోటీ. గంట సేపు పడిగాపులు కాస్తే దొరికేది.
మా చిన్నాన్నకి సైకిల్ నేర్పించే పని. గ్రౌండ్‌లోకి తీసుకెళ్లి నేను పడిపోకుండా పట్టుకునేవాడు. అనేక సార్లు కింద పడి ఎలాగో నేర్చుకున్నా. ఆ రోజుల్లో ట్రాఫిక్ లేదు కాబట్టి రోడ్డు మీద కూడా తొక్కేవాన్ని.
ఆరో తరగతి , హైస్కూల్ చేరే సరికి పెద్దవాడినైన ఫీలింగ్. పెద్ద సైకిల్ నేర్చుకునే పనిలో పడ్డాను. నేర్పించే వాళ్లు ఎవరూ లేరు. చిన్న సైకిల్ అనుభవం. సీటు మీద ఎక్కితే పెడల్సు అందవు. అడ్డ పెడల్ స్టార్ట్ చేశా. పెద్ద సైకిల్ ఎంత కష్టమంటే ఎదురుగా ఎవరైనా వస్తే కంగారు పడి గుద్దేసేవాన్ని. సైకిల్ నేర్చుకున్నంత కాలం మోకాళ్లకి దెబ్బలే.
పదో తరగతి వరకు అద్దె సైకిళ్లే గతి. సొంత సైకిల్ లేదు. అనంతపురంలో స్కూల్‌కి రానుపోనూ ఐదు కిలోమీటర్లు నడిచేవాన్ని. నా బాధ చూడలేక 400 పెట్టి ( ఆ రోజుల్లో తులం బంగారం రూ.500, అంటే నా సైకిల్ విలువ దాదాపుగా రూ.35 వేలు ఇప్పటి ప్రకారం) అట్లాస్ సైకిల్ కొనిపెట్టారు. ఆ రోజు అట్లాస్ కంటే నేనే ఈ భూమిని మోస్తున్నట్టు ఫీల్ అయ్యాను.
ఆ సైకిల్‌కి లైట్ కూడా ఉండేది. పగలు కూడా లైట్ ఆన్ చేసి తిరిగేవాడిని. గాలి కొట్టే వాడికి డబ్బులు దండగ అని (చక్రానికి ఐదు పైసలు) 8 రూపాయలు పెట్టి చిన్న పంపు కూడా కొన్నాను. రోజూ ఉదయాన్నే తుడవడం పెద్ద పని. నెల రోజుల్లో కొత్త మోజు తీరింది. సీటు చిరిగిపోయినా పట్టించుకోలేదు.
సైకిళ్ల ప్రత్యేకత ఏమంటే మనకి అర్జెంట్ పని ఉన్నప్పుడు పంక్చర్ అవుతాయి. అది వేయించడమంటే…ట్యూబ్ చెక్ చేయడం, నీళ్లలో ముంచితే బుడాబుడా బుడగలు, సొల్యూషన్ , రబ్బరు ముక్క, అతికించి , గాలి కొట్టి బుడగలు రాకపోతే సంతోషించి…అప్పుడు నిజంగా సైకిల్‌ని కాలితే తన్నేంత కోపం వస్తుంది.
ఈ అట్లాస్ సైకిల్ కొంత కాలం నాకు సేవ చేసింది. నిర్దాక్షిణ్యంగా వంద రూపాయలకే అమ్మేశాను. తర్వాత కొనలేదు.
మనల్ని తీసుకెళ్లే సైకిల్‌ని వదిలి, ఎక్సర్‌సైజ్ సైకిల్‌ని ఇంటికి తీసుకెళ్లామంటే అర్థం ఒంట్లో కొవ్వు చేరిందని.
ఈ దేశ ప్రజలకి 70 సంవత్సరాలు సేవ చేసిన అట్లాస్ సైకిల్ ఇక నడవలేక మూత పడింది. జ్ఞాపకాల్లో మాత్రమే మిగిలి ఉంటుంది.
అట్లాస్ సీటు మీద ఎన్నో రహదారులు తిరిగాను. ఎన్నో సినిమాలని చూపించింది. ఎగ్జామ్ హాల్‌కి తీసుకెళ్లింది. చేతులు వదిలి తొక్కితే కోపం వచ్చి కిందపడేసింది.
చూస్తూ ఉండగానే అన్నీ మాయమై పోతాయి. అదే జీవితమంటే.