రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి మూడు ప్రతిష్టాత్మక విదేశీ కంపెనీలు ముందుకొచ్చాయి. జపాన్‌కు చెందిన ఏటీజీ సంస్థ టైర్ల తయారీ కంపెనీ, చైనాకు చెందిన వింగ్‌టెక్ సంస్థ మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్, హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్‌మెంట్ సంస్థ భారీ స్థాయిలో పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఈ మూడు కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు.. తద్వారా ప్రత్యక్షంగా 22,000 మందికి ఉపాధి కల్పించడానికి ఉద్దేశించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాయి. వీటిని పరిశీలించిన పరిశ్రమల శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడులకు ముఖ్యమంత్రి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపిన వెంటనే ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు(ఎంఓయూ) చేసుకోవడానికి ఆయా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి.
విశాఖలో టైర్ల కంపెనీ..
భారీ వాహనాలు, గనుల తవ్వకంలో ఉపయోగించే యంత్రాలకు అవసరమైన టైర్ల తయారీలో పేరొందిన జపాన్‌కు చెందిన అయన్స్ టైర్ గ్రూపు(ఏటీజీ) విశాఖపట్నం సమీపంలో యూనిట్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. రూ.1,600 కోట్ల పెట్టుబడితో ఎగుమతి ఆధారిత టైర్ల యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. యూనిట్ ఏర్పాటుకు 110 ఎకరాలు కావాలని ఏటీజీ కంపెనీ కోరగా, డీపీఆర్‌ను పరిశీలించిన తర్వాత దాదాపు 80 ఎకరాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. యూనిట్‌లో దాదాపు 2,000 మందికి ప్రత్యక్షంగా, 3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది.
రేణిగుంట ఈఎంసీలో వింగ్‌టెక్ యూనిట్
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ వింగ్‌టెక్ రేణిగుంటలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)–2లో యూనిట్ ఏర్పాటుకు దాదాపు రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ యూనిట్ ద్వారా నేరుగా 10,000 మందికి ఉపాధి లభించడంతో పాటు మరో 5,000 మందికి సప్లైచైన్ విభాగంలో పరోక్ష ఉపాధి లభించనుంది. చిత్తూరు జిల్లా రేణిగుంటలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)–2లో వింగ్‌టెక్ యూనిట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఏడాదికి 40 లక్షల మొబైల్ ఫోన్లు తయారు చేయనున్నారు.
శ్రీకాళహస్తి లో పాదరక్షల యూనిట్
హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్‌మెంట్ సంస్థ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో భారీ పాదరక్షల తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి ముందుకొచ్చింది. దాదాపు రూ.750 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. అడిడాస్ వంటి ప్రముఖ బ్రాండ్ పాదరక్షలను ఈ సంస్థ తయారీ చేస్తోంది. శ్రీకాళహస్తి సమీపంలో రెండు దశల్లో ఏర్పాటు చేసే యూనిట్ ద్వారా 10,000 మందికి నేరుగా ఉపాధి లభించనుంది. ఇందులో అత్యధికంగా మహిళలకే ఉపాధి కల్పించనున్నారు. 298 ఎకరాలు కేటాయించడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది.