ప్రభుత్వ వైద్యుల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ పై నిషేధాన్ని విధించింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే గవర్నమెంట్ డాక్టర్లు, ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. ఈ మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనలను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఒక జీవో విడుదల చేసింది.
ప్రభుత్వ డాక్టర్లకు డ్యూటీ అయిపోయిన తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకొనే వెసులుబాటు ఉంది. ఇప్పుడు కొత్త డాక్టర్లకు ఆ అవకాశంలేదు. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్ సిబ్బంది నియమకానికి కసరత్తు మొదలుపెట్టిన ప్రభుత్వం నియామక మార్గదర్శకాల్లో కొత్త నిబంధనను చేర్చింది. ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్ రద్దు చేసింది. ఇప్పుడు వైద్య వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్ అయ్యింది. నాన్ టీచింగ్ విభాగం నుంచి టీచింగ్ విభాగంలోకి బదిలీ ద్వారా వచ్చేవారు కూడా ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. కాని, ఇప్పటికే ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారికి నిబంధన వర్తించదు.
రాష్ట్రంలో మొత్తం 12,755 వైద్య సిబ్బంది పోస్టులను భర్తీచేయనున్నారు. అందులో10 వేలకుపైగా పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్ ఆర్‌బీ) భర్తీ చేయనుంది. అంటే డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎం పోస్టులను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీ చేస్తుంది. ఇక మిగిలిన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ బాధ్యత టీఎస్‌పీఎస్సీది.
77175