పట్టిసీమ పట్టిసీమ పట్టిసీమ … 2015 మార్చ్ నుంచి నిత్యం బాబుగారు జపం చేసిన మాట. 100 రోజుల్లో పట్టిసీమను పూర్తిచేస్తాం అని ప్రకటించి,అంత యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేసినందుకు కాంటాక్టర్ కు బోనస్ ఇచ్చిన బాబుగారాల పట్టీని జాతికి అంకితం చేసి నేటికీ సరిగ్గా నాలుగు సంవత్సరాలు
ఇంత ఘనమైన పట్టిసీమను బాబుగారు మరియు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఒక్క ఓటమితోనే మర్చిపోయినట్లున్నారు!
మొన్న NGT (National Green Tribunal) పట్టిసీమ, పురుషోత్తపట్నం పథకాలను operate చెయ్యొద్దని,చింతలపూడి & గోదావరి-పెన్నా పనులు నిలిపేయండని ఇచ్చిన ఆదేశాలును ఆంధ్రజ్యోతి రెండవ పేజీలో ,ఈనాడు 14వ పేజీలో వేశాయి. చరిత్ర సృష్టించాం అని చేసుకున్న ప్రచారానికి మూలమైన పట్టిసీమను ఆపమంటే బాబుగారు,దేవినేని ఉమా,లోకేష్ ఎవరు స్పందించక పోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ప్రకాశం బ్యారేజి వద్ద నలుపు,ఎరుపు నీళ్లను విడివిడిగా చూపుతూ ఎరుపు నీళ్లు పట్టిసీమ ద్వారా వొచ్చిన గోదావరి జలాలని,నల్లని నీళ్లు కృష్ణ నీరని మొదటి పేజీలో పెద్ద బొమ్మలు వేసిన ఆంధ్రజ్యోతి ,ఈనాడులు కూడా NGT ఆదేశాల మీద పెద్ద వార్తలు రాయలేదు
పట్టిసీమను సమర్ధించినోళ్లు మేధావులు,అనుమానాలను వ్యక్తం చేసినవారు రాష్ట్ర ద్రోహులు, వ్యతిరేకించినోళ్లు అసలు మనుష్యులే కాదు అన్నట్లు అప్పటి ప్రభుత్ర ప్రతినిధులు, సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు(అలా అనకూడదంట వారు రాష్ట్ర అభివృద్ధికాముకులు. పాపం బాబుగారు ఓడిపోయిన తరువాత బులుగు రంగు వెలిసిపోయినట్లుంది.నిన్న ప్రకాశం బ్యారేజి గేట్లు ముందుగానే ఎత్తలేదని బాధపడ్డారు.ఎగువన కురిసిన వర్షం వళ్ళ వొచ్చిన నీళ్లని ఒత్తి పలుకుతున్నారు) చేసిన దాడి అంతాఇంతా కాదు. రాయలసీమకు కృష్ణా నీటిలో వాటా లేదని పోస్టులు పెట్టిన వారు కూడా పట్టిసీమ వలన రాయలసీమకు నీళ్లు వొస్తాయని వాదించారు.
అయ్యా మీరు పట్టిసీమను కట్టండి,కానీ దాని వలన ఎగువ రాష్ట్రాలు మహారాష్ట్ర + కర్ణాటక claim చేస్తున్న 45 టీఎంసీ లు,తెలంగాణా అడుగుతున్న వాటా గురించి త్వరగా తేల్చండి, ఎగువరాష్ట్రాలు నీళ్లు ఆపుకుంటే మొదట నష్టపోయేది రాయలసీమ. పట్టిసీమ ద్వారా ఎన్ని నీళ్లయితే ప్రకాశం బ్యారేజిలోకి చేరుతాయో అదే మొత్తం నీటిని లేదా ఎంతో కొంత మొత్తం నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమకు ఇచ్చేలాగా GO ఇవ్వండి అని అడిగితె మీరు ద్రోహులు,మీకు సబ్జెక్టు తెలియదు,ఎగువ రాష్ట్రాలకు లేని ఆలోచనలను మీరు వాళ్లకు అందిస్తున్నారని బాబుగారు & కో ఎదురుదాడి చేశారు.
అబ్బో పట్టిసీమ,వందల టీఎంసీ ల నీళ్లు రాయలసీమకు దీని వలన వొచ్చాయని అనంతపురం టీడీపీ నాయకులు పుష్పగుచ్చాలు ఇచ్చి కేకే కట్ చేశారు. అనంతపురంలో కృష్ణా పుష్కరాలు కూడా నిర్వహించారు. వీరిలో ఏ ఒక్కరు ఈ ఎన్నికల్లో గెలవలేదు. పట్టిసీమ ప్రధాన లబ్ధిడ్డారు కృష్ణన్ డెల్టా నాయకులు కూడా ఇంత హడావుడి చెయ్యలేదు.
పోలవరం 2018కి పూర్తిఅవుతుంది అందుకే పట్టిసీమను 100 రోజుల్లో పూర్తిచేసి కృష్ణాడెల్టాకు నీళ్లు ఇస్తాము అని చెప్పిన బాబుగారు 2017లో పోలవరం ఎడమకాలువ మీద పురుషోత్తపట్నం పథకానికి శంకుస్థాపన చేశారు.ఆపథకం మీద రాయటానికి కూడా నాకు మనసు రాలేదు. పురుషోత్తంపట్టణం శంకుస్థాపన సహజంగా రాజానగరం లేక జగ్గంపేట నియోజకవర్గాల్లో జరగాలి కానీ పిఠాపురంలో నిర్వహించారు. 2014లో పిఠాపురం నుంచి టీడీపీ తిరుగుబాటు అభ్యర్థిగా గెలిచిన వర్మ ఈ ఎన్నికల్లో చిత్తయ్యారు.
ఎందుకు ఓడిపోయామో అర్ధంకావటం లేదు అని ఆత్మద్రోహం చేసుకోవటం కన్నా నిజాయితీగా ఆత్మశోధన చేసుకుంటే ఓటమికి కారణాలు ముఖ్యముగా కేవలం 23 స్థానాలకు పరిమితం కావటానికి కారణాలు అర్ధం అవుతాయి.
పోలవరంలో వైస్సార్ ఒక తట్ట మట్టన్న తీసారా ?అని ఈమధ్య కూడా దేవినేని ఉమ గారు విమర్శించారు. ప్రజలు వైస్సార్ ఒక తట్ట మట్టినన్న తీసారా అని ఆలోచించలేదు,1995-2004 మధ్య పూర్తి నిర్లక్షానికి గురైన పోలవరం వైస్సార్ వలెనే పట్టాలెక్కిందని తెలియంది ఎవరికి?
పోలవరం పూర్తికావటానికి కనీసం 5 సంవత్సరాలన్న పడుతుంది కాబట్టి కుడి కాలువ మీద తాటిపూడి ,ఎడమ కాలువ మీద పుష్కరం ఎత్తిపోతల పథకాలను నిర్మించి 2007 నుంచి నీళ్లు ఇస్తున్న విషయం దూర ప్రాంతాలవారికి తెలియకపోయినా గోదావరి ప్రజలకు తెలియదా?పట్టిసీమ పేరుతొ 2015లో నీళ్లు ఇచ్చింది ఏ పథకం నుంచి?గుడ్డిగూడెం వద్ద రాత్రికి రాత్రి తాడిపూడి కాలువ నుంచి పోలవరం కుడి కాలువలకి తొవ్విన లింక్ చూసిరండి.
పోలవరం ఆలస్యమవుతుంది కాబట్టే పట్టిసీమ,పురుషోత్తపట్నం అని చెప్పిన టీడీపీ నాయకులు ,టీడీపీ తరుపున 1994లో గెలిచిన వడ్డి వీరభద్రరావు గారిని మరిచినట్లున్నారు.వడ్డి వీరభద్రరావు 1996లో రాజమండ్రి నుంచి గోదావరి నీటి బిందెతో ఢిల్లీకి సైకిల్ యాత్ర చేసి అప్పటి ప్రధాని దేవగౌడకు వినతిపత్రం ఇచ్చారు. 2004లో వైస్సార్తోనే పోలవరం సాధ్యమని బాబుగారు చేసిన నిర్లక్షాన్ని ఎత్తిచూపుతూ రోడ్డు మీద బ్యానర్ కట్టి మరీ గుండు చేయించుకున్నారు. దేవినేని ఉమా గారికి ఈ విషయం తెలియదనుకుంటాను .
ఇప్పుడు NGT ఉత్తర్వుల మీద వట్టి వసంత్ గారిని విమర్శించవలసిన అవసరం లేదు. ఆయన పట్టిసీమ పేరుతొ గోదావరి నీటిని అక్రమంగా కృష్ణా డెల్టాకు తీసుకెళుతున్నారని 2015లో నే కోర్టుకు వెళ్లారు,అప్పుడు కోర్టు ఆయన వాదనను కొట్టేసింది.
2015లోనే ప్రభుత్వం పట్టిసీమ మీద బహిరంగ చర్చ పెట్టి, వట్టి వసంత్,ఉండవల్లి గారు మరియు ఇతరుల అనుమానాలను నివృత్తి చేసి ఉండవాల్సింది. కానీ వారు ప్రతిదాడినే నమ్ముకున్నారు.
కృష్ణా నదిలో ప్రస్తుతం ఉన్న వరద వలన పట్టిసీమ వర్షం వొచ్చే 2 నెలలో ఉండదు. ఈలోపు ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లి NGT ఉత్తర్వుల మీద లిఫ్ట్ తెచ్చుకోవచ్చు. చింతలపూడి పనులు జరక్క చాలా సంవత్సరాలు అయ్యింది. గోదావరి-పెన్నా అనుసంధానం అనేది కేవలం రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. గత ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ఈ ప్రాజెక్ట్ నిర్మించకూడదు ,కొత్త డిజైన్ లు రావాలి. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ మీద పెట్టిన ఖర్చు నామమాత్రం.
గత ప్రభుత్వ తప్పిదాల నుంచి కొత్త ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవాలి.ఆర్భాటం,హంగామా కాకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు నిజాయితీగా చెయ్యాలి. ఏదైనా కారణాలతో అనుకున్న పనులు చెయ్యలేకపోతే బహిరంగంగా ప్రజలకు వివరించాలి.