iDreamPost
android-app
ios-app

పేరుకే పార్టీలు,నిర్ణయం మాత్రం ఒకరిద్దరిదే

  • Published Sep 20, 2021 | 1:01 AM Updated Updated Sep 20, 2021 | 1:01 AM
పేరుకే పార్టీలు,నిర్ణయం మాత్రం ఒకరిద్దరిదే

దేశంలో వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు ఇందిరాగాంధీతో మొదలయ్యాయని చెప్పొచ్చు. అంతకు ముందు మొదటి ప్రధానిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ హయాంలో కొంతమేర వ్యక్తి ఆరాధన నేపథ్యంలో రాజకీయాలు కొంతకాలం నడిచాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో కానీ, కేంద్ర మంత్రివర్గంలో కానీ స్వాతంత్య్ర సంగ్రామంలో సమకాలీనులుగా పనిచేసినవారు ఉండడంతో నెహ్రూకు వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు నడిపే అవకాశం రాలేదు.

ఆ తర్వాత వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి అతి సాదా సీదాగా పాలనచేయడంతో ఆయన ముద్ర రాజకీయాలపై పెద్దగా పడలేదనే చెప్పాలి. ఆ తర్వాత ప్రధాని పదవి చేపట్టిన ఇందిరాగాంధీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఇంకోమాటలో చెప్పాలంటే ఆ పరిస్థితి ఇందిరాగాంధీకి తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. 

తన తండ్రికి సహచరులుగా పనిచేసిన పలువురు నేతలు తాను ప్రధాని అయినప్పటికీ తనను ప్రధానిగా చూడక, తమ సహచరుని కుమార్తెగా చూడడం వల్ల ఇందిరాగాంధీ తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక దశలో పార్టీలోని  పెద్దనేతలు తనకు డిక్టేట్ చేయడాన్ని, అందుకు వారు ప్రయత్నాలు చేయడాన్ని ఇందిరాగాంధీ జీర్ణించుకోలేకపోయారు. ఈ పరిస్థితులను మార్చేందుకు, పార్టీలోని పెద్దలకు తనను నెహ్రూ కూతురుగా మాత్రమే కాక ఈ దేశ ప్రధానిగా చూడాలని ఇందిరాగాంధీ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఒక దశలో పార్టీలోని పెద్దలు ఆమెను పార్టీనుండి బహిష్కరించే సాహసం కూడా చేశారు. ఈ మేరకు ముంబయిలో పార్టీ ప్లినరీ కూడా నిర్వహించి ఇందిరాగాంధీకి పెద్ద సవాల్ విసిరారు. 

ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఇందిరాగాంధీ తన సత్తా చాటుకునేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అందుకే తాను కేంద్రంగా రాజకీయాలు నడపడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్ (ఐ) ని ఏర్పాటు చేసి రాష్ట్రాలకు విస్తరించారు. ఆ తర్వాత మొత్తం దేశంలో రాజకీయనాయకులపై కర్రపెత్తనం చేశారు. ఎమెర్జెన్సీ ప్రవేశపెట్టి తనను వ్యతిరేకించే వాళ్ళతో జైళ్ళు నింపారు. ఇవన్నీ ఓ రకంగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆ తదనంతరం కూడా పార్టీలో తన ఆధిపత్యం కొనసాగించారు. 

Also Read : పంజాబ్‌ కొత్త సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ

జనతాపార్టీ విఫలం అయ్యాక జరిగిన ఎన్నికల్లో వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు నడపడం సర్వసాధారణం అయింది. అందుకే రాష్ట్ర పార్టీ బాధ్యతలు, చివరికి ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా ఇందిరాగాంధీ ఇష్టాయిష్టాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. వ్యక్తిగా ఇందిరాగాంధీ తనదైన ముద్రవేసుకునే ప్రయత్నంలో తరచుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చుతూ వచ్చేవారు. ఈ పద్ధతినే తర్వాత కాలంలో రాజీవ్ గాంధీ, ఆ తర్వాత పివి నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ కొనసాగించింది. 
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఐదేళ్ళ పదవీ కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో వ్యక్తి కేంద్రంగా రాజకీయపార్టీ పనిచేయడం సాధ్యం అయింది కానీ ఈ రాజకీయాలను ప్రజలు సమర్ధించలేదు. అందుకే కాంగ్రెస్ ఘోరపరాజయం చవిచూడాల్సి వచ్చింది. 

ఈ వ్యక్తి కేంద్రంగా నడిచే రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితం అనుకుంటే ఇప్పుడు బీజేపీ కూడా ఈ తరహా రాజకీయాలను తెరపైకి తెచ్చింది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీ నాయకత్వం ఈ ప్రయోగమే చేస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీకి పెట్టని కోటలుగా నిలిచిన గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠంతో ఆపార్టీ అధినాయకత్వం చదరంగం ఆడుతున్నట్టు కనిపిస్తోంది. 

గుజరాత్ ముఖ్యమంత్రి పీఠం నుండి ఏకంగా 2014 ఎన్నికల్లో దేశ ప్రధాని పీఠంపైకి నరేంద్ర మోడీ దూకిన తర్వాత ఆ రాష్ట్రంలో ఆనందిబెన్ పటేల్ ను ముఖ్యమంత్రిగా నియమించిన బీజేపీ రెండేళ్ళ లోనే ముఖ్యమంత్రిని మార్చింది. ఆనందిబెన్ స్థానంలో విజయ్ రూపానిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి 2017 ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే ఎన్నికల తర్వాత మూడేళ్ళకు మళ్ళీ విజయ్ రూపానిని మార్చి ఇప్పుడు కొత్తగా భూపేంద్రబాయ్ పటేల్ ను కూర్చోబెట్టింది. ఈ చర్యల వల్ల బీజేపీ అధినాయకత్వం కేంద్రంగా రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చింది. పైకి చెప్పకపోయినా అప్పట్లో ఇందిరాగాంధీ పద్దతిలోనే గుజరాత్ విషయంలో బీజేపీలోని నరేంద్ర మోడీ – అమిత్ షా ద్వయం తమదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాల వల్ల పార్టీ స్థానికంగా బలహీనపడుతుందనేది కాంగ్రెస్ నేర్పుతున్న పాఠం. 

Also Read : కొత్త సీఎం కు సమయం తక్కువ.. సవాళ్లు ఎక్కువ..

ఈ తరహా రాజకీయాలకు కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలే కాదు దక్షిణాది ద్రవిడ పార్టీలు కూడా మినహాయింపేమీ కాదు. గతంలో రెండు సందర్భాల్లో అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని పన్నీర్ సెల్వం అనే నేతకు అప్పగించి ఆ పదవి తనచెప్పుచేతల్లోనే ఉండాలనే సందేశం ఇచ్చారు. అంతిమంగా జయలలిత మరణం అనంతరం పార్టీలో బలమైన నేతగా, పార్టీ ఆధిపత్యాన్ని కొనసాగించే సత్తా కలిగిన నేతగా పన్నీర్ సెల్వం నిలబడలేకపోయారు. వ్యక్తి (జయలలిత) కేంద్రంగా రాజకీయాలు నెరపడంతో   రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేసినప్పటికీ ఆయనకు పార్టీపైన కానీ, ప్రభుత్వంపైన కానీ పట్టుదొరకలేదు.

అలాగే జయలలిత మరణం తర్వాత ఇంచుమించు అదే స్థాయిలో వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు నడిపే ప్రయత్నం చేసిన శశికళ కూడా పళని స్వామిని ముఖ్యమంత్రి చేసి తాను చక్రం తిప్పే క్రమం మొదలు పెట్టారు. అయితే ఆమె అరెస్టు కావడంతో రాజకీయాలు వేగంగా మారాయి. అయితే, అటు పన్నీర్ సెల్వం కానీ, ఇటు పళని స్వామి కానీ తాము ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ పార్టీ రాజకీయాలను నిలబెట్టలేకపోయారు. 

పార్టీ జాతీయస్థాయిలో పనిచేసేది అయినా ప్రాంతీయస్థాయిలో పనిచేసేది అయినా నాయకత్వం విషయంలో వ్యక్తికేంద్రంగా  రాజకీయాలు నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయి అని చెప్పేందుకు కాంగ్రెస్, అన్నా డీఎంకే మన కళ్ళముందే కనిపిస్తున్నాయి. ఇదే తరహా రాజకీయాలకు తెరలేపిన బీజేపీ కూడా భవిష్యత్తులో కాంగ్రెస్, అన్నా డీఎంకే ఎదుర్కొన్న ఫలితాలనే చవిచూడాల్సి వస్తుందనడంలో సందేహం లేదు.

Also Read : సీఎంలను మారిస్తే ఎన్నికల్లో గెలుస్తారా?గతంలో గెలిచారా?