జనరల్ బిపిన్ రావత్ జనవరి 1న భారత తొలి మహా దళపతిగా భాద్యతలు చేపట్టారు. దీంతో దేశ భద్రతా చర్యల్లో కీలక ముందడుగు పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు భారత్ కు చీఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) పదివిని సృష్టించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? సీడీఎస్ తో దేశ భద్రత ఏ విధంగా బలోపేతం అవుతుంది? అనే విషయాలతో పాటు సీడీఎస్ విధులేంటో చూద్దాం….
కార్గిల్ నేర్పిన పాఠం
1999లో భారత్, పాకిస్థాన్ ల మధ్య కార్గిల్ యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఆ యుద్ధంలో మనం విజయమైతే సాధించాం కానీ, తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వ లెక్కల ప్రకారం కార్గిల్ యుద్ధంలో మనదేశం 527 మందిని కోల్పోయింది. వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో వాయుసేన ఫైటర్ జెట్, హెలికాప్టర్లను కోల్పోయింది. దాన్ని అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని అప్పటి కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కార్గిల్ ముగిసిన మూడు రోజుల అనంతరం 1999, జులై 29న అప్పటి కార్గిల్ రివ్యూ కమిటీ(కేఆర్ సీ )ని ఏర్పాటు చేసింది. సదరు కమిటీ త్రివిధ దళాలు, రా, ఐబీ ల మధ్య సమన్వయం కొరవడిందని… దాని వల్లే సరైన సమయంలో స్పందించకలేక తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని వెల్లడించింది. యుద్ధ సమయాల్లో జాప్యాన్ని నివారించి.. త్రివిధ దళాలను ఏకతాటిపై నడిపేలా సీడీఎస్ పదవిని సృష్టించాలని సూచించింది. అనంతరం ఏర్పాటు చేసిన సుభ్రమణ్యమ్క, డీ బీ షెకత్కర్ కమిటీలు సైతం సీడీఎస్ నియామకాన్ని సిఫార్సు చేశాయి. కానీ ప్రభుత్వాలు దానిపై నిర్ణయం తీసుకోవటంలో తీవ్ర జాప్యం చేశాయి. గతేడాది బాలాకోట్ దాడుల అనంతరం పాకిస్థాన్ మనదేశంపై దాడికి ప్రయత్నించటం.. దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో భారత్ మిగ్ విమానాన్ని కోల్పోవాదం జరిగింది. వాయుసేన 2005లో ప్రతిపాదించిన యాంటీ జామింగ్ పరికరాలు కొనుగోలులో ఏర్పడిన జాప్యం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో సీడీఎస్ ఏర్పాటు మల్లి తెరపైకి వచ్చింది.
మోదీ ప్రకటన…
2019 ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రసంగిస్తూ భారత్ కు త్వరలో మహా దళపతి రానున్నారని ప్రకటించారు. ఇందులో భాగంగా డిసెంబర్ 24న కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) సీడీఎస్ నియామకాన్ని ప్రకటించింది. అంతేకాకుండా సీడీఎస్ నేతృత్వంలో కొత్తగా రక్షణ శాఖ పరిధిలో సైనిక వ్యహారాలు విభాగాన్ని ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ కార్యదర్శి పరిధిలోని చాలా అంశాలను నూతన విభాగానికి బదిలీ చేసింది.
అగ్రదేశాలన్ని…
అగ్రదేశాలుగా పిలువబడుతున్న చైనా, ఫ్రాన్స్ , రష్యా, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలన్నీ త్రివిధ దళాలను సమన్వయం చేసే పదవులు, వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. భారత్ ఆవిషయంలో వెనుకబడివుంది. ఐతే ఇటీవలి కాలంలో ఎదురైన స్వీయానుభవాలు భారత్ ను సీడీఎస్ ఏర్పాటు దిశగా నడిపించాయి. సీడీఎస్ నియామకంతో రక్షణ కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించే అవకాశం ఉంది. ప్రాధాన్యతల ఆధారంగా కొనుగోళ్లు జరిపేలా ఆయుధ కొనుగోళ్ల మండలిలో సభ్యుడైన సీడీఎస్ చర్యలు తీసుకోగలరు. అలాగే త్రివిధ దళాల వ్యవహారాలపై నేరుగా రక్షణ మంత్రికి సీడీఎస్ ప్రధాన సలహాదారుగా, అణు ఆయుధాల కమాండ్ కు సంబంధించి ప్రధానికి సలహాదారుగా ఉంటారు. కాబట్టి దేశ భద్రత కోణంలో రాజకీయ వ్యవస్థ సరైన నిర్ణయాలు తీసుకొనే పరిస్థితులు మెరుగయ్యాయని చెప్పొచ్చు.