పాలు నీళ్లను వేరు చేసి పాలు మాత్రమే తాగుతుందని హంసకు పేరుంది.. కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన నిర్వాకం చూస్తే నీళ్లలో కలిపిన పాలను వేరు చేయలేక బహుశా హంస మూర్ఛపోయేదేమో. పాలలో నీళ్లు కలిపి కల్తీ చేసే కల్తీ వ్యాపారాలు కూడా పాలల్లో అన్ని నీళ్లు కలపడానికి సందేహిస్తారు కానీ అలాంటిది, ఒక లీటర్ పాలల్లో బకెట్ నీళ్లు కలిపి విద్యార్థులకు పంచిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఒక ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో జరిగే అవకతవకలు ఏ రేంజ్ లో ఉంటాయో చూపిన ఘటన ఇది.
వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ లోని సోన్ భద్ర జిల్లా చోపన్ ప్రాథమిక పాఠశాలలో 171 మంది విద్యార్థులు చదువుతున్నారు. కాగా బుధవారం మాత్రం 81 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులకు పాలు పంచే క్రమంలో ఒక లీటర్ పాలలో బకెట్ నీళ్లు కలిపి మరిగించి అలా నీళ్లు కలిపిన పాలను సగం గ్లాస్ చొప్పున అందించింది వంటమనిషి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో విద్యాశాఖ అధికారులు ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. వంటమనిషిని వివరణ కోరగా తనకు లీటర్ పాలు మాత్రమే ఇచ్చారని వాటినే విద్యార్థులకు పంచానని సమాధానం ఇచ్చింది.
గతంలో ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ లోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా రొట్టెలు ఉప్పు,పెట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలు పేద విద్యార్థులకోసం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా కొందరు అక్రమార్కులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారు. చిన్నారులకు కేటాయించిన నిధులను కాజేస్తూ విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.