ప్రముఖ సినీ నటుడు, నిర్మాత.. అన్నింటికీ మించి కరోనా కష్టకాలంలో వేలాదిమందిని ఆదుకున్న మానవతావాదిగా పేరుపొందిన సోనూసూద్ పై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టిందన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. గత రెండు రోజుల్లో ఆయన నివాసం, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేసి ఏకధాటిగా 20 గంటల పాటు సోదాలు నిర్వహించడం వివాదంగా మారింది.
ఇంత హఠాత్తుగా.. అదీ ఢిల్లీ ప్రభుత్వం సోనూసూద్ ను తమ బ్రాండ్ అంబాసిడరుగా నియమించిన కొద్దిరోజుల్లోనే ఈ దాడులు జరగడం కేంద్రంపై విమర్శలకు ఆస్కారమిస్తోంది. దీనిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు చెబుతున్న కారణాలు కూడా నమ్మశక్యంగా లేవు. లక్నోకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో సోనూసూద్ ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సంస్థపై పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయి. దాన్ని సాకుగా చూపించి సోనూసూద్ నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేయడం అసమంజసమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రాజకీయ కక్షతోనే..
పంజాబ్ రాష్ట్రం మోగా ప్రాంతానికి చెందిన సోనూసూద్ సినీ నటుడిగా, నిర్మాతగా దేశవ్యాప్తంగా సుపరిచితుడు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో కోట్లాది రూపాయల సొంత వనరులు వెచ్చించి కోవిడ్ బాధితులను అనేక రూపాల్లో ఆదుకున్నారు. వేలాదిమంది వలస కార్మికులను ప్రత్యేక వాహనాలు సమకూర్చి మరీ స్వస్థలాలకు తరలించారు. ఈ విషయాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని అధిగమించి సర్వత్రా ప్రశంసలు పొందారు. మానవతా వాదిగా పేరుపొందారు.
Also Read : కాంగ్రెసులోకి కన్హయ్య కుమార్, జిగ్నేశ్ మేవానీ?
ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ ఆప్ ప్రభుత్వం.. తమ అభివృద్ధి కార్యక్రమాల ప్రచారానికి సోనూసూద్ ను బ్రాండ్ అంబాసిడరుగా నియమించడంతో బీజేపీ ఉలిక్కిపడింది. సోనూసూద్ ఆప్ తో జతకలిస్తే రాజకీయంగా ఇబ్బంది పడతామన్న ఆందోళనతోనే సోనూసూద్ పైకి ఆదాయ పన్ను అధికారులను కేంద్ర ప్రభుత్వం ఉసిగొల్పిందని ఆప్, శివసేన సహా పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి.
వచ్చే ఏడాది ఎన్నికల భయంతో..
దేశ రాజధాని అయిన ఢిల్లీలో పాగా వేయకుండా గత రెండు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బీజేపీని అడ్డుకుని.. అధికారంలో కొనసాగుతోంది. కొద్దికాలంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున కేజ్రీవాల్, సోనూసూద్ జత కడితే అసలు అధికారంలోకి రాలేమన్నది బీజేపీ ఆందోళన. దీంతోపాటు ఇతర రాష్ట్రాలకు సైతం ఆప్ క్రమంగా విస్తరిస్తూ బీజేపీకి సవాల్ విసురుతోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న యూపీ, పంజాబ్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆప్ బలం పెంచుకుంది. గుజారాత్లోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇటీవలే 20 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది.
ఇక పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అత్యధిక స్థానాలు పొంది ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని ఇటీవలి ఏబీపీ- సి ఓటర్ సర్వే అంచనా వేసింది. పెరుగుతున్న ఆప్ బలానికి.. సోనూసూద్ తోడై అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రచారం చేస్తే తన ఆధిక్యతకు గండి పడుతుందని భయపడుతున్న బీజేపీ.. కేంద్రంలోని తమ ప్రభుత్వం ద్వారా కక్ష సాధింపు చర్యలకు. పాల్పడి సోనూసూద్ ను రాజకీయాల్లో చేరకుండా వెనక్కి లాగాలని చూస్తోందని శివసేన పత్రిక సామ్నా సైతం తన తాజా సంచికలో విమర్శించింది.
Also Read : నేడు జీఎస్టీ మండలి భేటీ : పెట్రోలు, డీజిల్ పై కీలక నిర్ణయం?