iDreamPost
iDreamPost
ఇక్కడంటే బిగ్ బాస్ మొదలై నాలుగో సీజనే నడవడం వల్ల మనకు కొత్తగా అనిపిస్తోంది కానీ నిజానికి ఈ రియాలిటీ షోకు చాలా చరిత్ర ఉంది. అవగాహన ఉన్న వాళ్ళు తక్కువే. ఇక్కడే మొదలయ్యింది అనుకుంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే అది నిజం కాదు. దీనికి పెద్ద హిస్టరీ. ఈ కాన్సెప్ట్ తయారుచేసిన వ్యక్తి పేరు జాన్ డి మోల్ జూనియర్. డచ్ మీడియా అధినేతగా ఏదైనా కొత్తగా చేయాలన్న తపన దీనికి ఉసిగొల్పింది. 1999లో మొదటిసారి బిగ్ బ్రదర్ పేరుతో ఇది టెలికాస్ట్ అయ్యింది. విపరీతమైన ఆదరణ దక్కడంతో ఇతర దేశాల ఛానల్స్ నుంచి డిమాండ్ వచ్చి ఏకంగా 54 దేశాలకు దీని ఫార్ములాను అమ్మాడు జాన్.
ఆ తర్వాత ఇది బిగ్ బాస్ గా మారింది. ఇక ఇండియా విషయానికి వస్తే 2007లో బ్రిటిష్ షోలో పాల్గొన్న శిల్పాశెట్టి వల్ల దీని గురించి మన దేశపౌరులకు తెలిసింది. శిల్పా మీద అక్కడి పార్టిసిపెంట్స్ తీవ్రమైన జాత్యహంకారంతో కామెంట్స్ చేయడం పెను దుమారం రేగింది. తనను దూషించిన వారిపై ఏకంగా 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ ఛానల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రమక్రమంగా హిందీలో మొదలైన ఈ షో సల్మాన్ ఖాన్ యాంకరింగ్ వల్ల విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఇది సౌత్ లోనూ సక్సెస్ అవుతుందన్న ఆలోచనతో 2017లో ఒకేసారి తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, తమిళంలో కమల్ హాసన్, కన్నడలో కిచ్చ సుదీప్ లతో మొదలుపెట్టారు.
ఇంగ్లీష్ హిందీ స్థాయిలో బ్లాక్ బస్టర్ కానప్పటికీ బిగ్ బాస్ షో ఇక్కడి ప్రేక్షకులను కాంట్రావర్సీలతో బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా అరవంలో ఏకంగా ఆత్మహత్య ప్రయత్నాల దాకా వెళ్ళింది వ్యవహారం. ఇక్కడా కౌశల్ ఆర్మీ పేరుతో జరిగిన హంగామా చిన్నది కాదు. ఎవరు లేనప్పుడు ఓ పదిహేను మంది ఎలా ప్రవరిస్తారు అనే కాన్సెప్ట్ ని తీసుకుని వాళ్లలో విచిత్రమైన అపరిచితులను బయటికి తీసుకొచ్చే ఉద్దేశంతో దీన్ని రూపొందించడమే ఈ షో సక్సెస్ కి కారణం. అందులోనూ మనకంటే పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి సగటు భారతీయ మనస్తత్వంలో సహజంగా ఉంటుంది కాబట్టి ఇది ఇంతగా పాపులర్ అయ్యింది. మన మూడు రాష్ట్రాల్లోనూ ఇకపై కూడా ఇది కంటిన్యూ గా కొనసాగేలా కనిపిస్తోంది. హిందీలో భీభత్సమైన రేటింగ్ తో దూసుకుపోతున్న బిగ్ బాస్ అక్కడ 14వ సీజన్ లోకి అడుగుపెడుతున్నాడు. మసాలా కంటెస్టెంట్లు ఎక్కువగా దొరకడం అక్కడి నిర్వాహకులకు ప్లస్ అవుతోంది.