iDreamPost

20 న విశాఖ లో సచివాలయం ..?

20 న విశాఖ లో సచివాలయం ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 20 నుండి విశాఖపట్టణంలోని మిలీనియం టవర్స్ లో కొత్త సచివాలయంను ఏర్పాటు చేయడానికి ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఒకవైపు అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల ఆందోళనలు కొనసాగుతుండడంతో వీలైనంత త్వరగా సచివాలయంను తరలిస్తేనే ఉద్రిక్తలు తగ్గే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

ఇందులో భాగంగా అనుకున్న సమయం కంటే ముందుగానే విడతలవారీగా సచివాలయంలోని కీలక విభాగాలను విశాఖకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ముందుగా 8వ తేదీన రాష్ట్ర క్యాబినెట్ సమావేశమై అమరావతి నుండి సచివాలయంను విశాఖపట్టణంలోని మిలీనియం టవర్స్ కు తరలింపు ఆమోదించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఈ నెల 20 లేదా 21వ తేదీన రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచి అధికారికంగా సచివాలయం తరలింపును ఆమోదించే అవకాశం కూడా కనిపిస్తుంది.

ప్రభుత్వంలోని 34 శాఖలోని కీలక విభాగాలను తరలించుటకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సచివాలయంలోని ప్రాధాన్యత శాఖలో కీలక విభాగాలైన సాధారణ పరిపాలన డిపార్ట్మెంట్ నుండి మూడు విభాగాలు,ఆర్థిక శాఖ నుంచి రెండు విభాగాలు మైనింగ్ నుంచి రెండు విభాగాలు, హోంశాఖ నుంచి నాలుగు శాఖ విభాగాలు,రోడ్డు భవనాల శాఖ నుంచి నాలుగు విభాగాలు,పంచాయతీరాజ్ నుంచి నాలుగు విభాగాలు,వైద్య ఆరోగ్య శాఖ నుంచి రెండు విభాగాలు, ఉన్నత విద్య,పాఠశాల విద్యాశాఖ నుంచి రెండేసి విభాగాలు విడతలవారీగా తరలింపు ప్రక్రియ చేపట్టే అవకాశం కనిపిస్తోంది.

సచివాలయం తరలింపులో న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశాఖ సచివాలయంలో పనిచేయనున్న ఉద్యోగులకు ఆన్ డ్యూటీ సౌకర్యం వర్తింపజేయనున్నారు. ఈసారి జనవరి 26న జరుపుకునే గణతంత్ర దినోత్సవం పెరేడ్ కూడా విశాఖలోనే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈనెల నుండి విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ లో ఆంధ్ర ప్రదేశ్ నూతన సచివాలయం పని చేయబోతుందా లేదా అనేది కొన్ని రోజుల్లోనే స్పష్టం కాబోతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి