iDreamPost

ఉప్పాడ ఉప్పెనకు జగన్ ప్రభుత్వ అడ్డుకట్ట

ఉప్పాడ ఉప్పెనకు జగన్ ప్రభుత్వ అడ్డుకట్ట

ఒక ఉప్పెన కొన్ని గ్రామాలను మింగేస్తుంది.. ఒక సునామీ ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగుల్చుతుంది.. ఒక తుఫాను మర్చిపోలేని విషాదాన్ని నింపుతుంది.. ఒక్కసారి సముద్రం ఉగ్రరూపం దాల్చితే వందల జీవితాలు ఛిద్రమవ్వాల్సిందే..

అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఓ ప్రాంతానికి ఉప్పెనలు, సునామీలు, తుఫాన్లు కొత్తకాదు.. ఐదారేళ్లకోసారి ఓ విలయం వారి జీవితాలపై తాండవం చేస్తూనే ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు ప్రకృతి భీభత్సాల్ని దిగమింగుకుని తమకుతాము ధైర్యం చెప్పుకుంటూ వాళంలు దశాబ్దాలపాటు కాలం సాగిస్తుంటారు. ఇన్నేళ్లుగా భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తూ గడుపుతున్న తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామవాసులకు ఇన్నాళ్లకు జగన్ సర్కార్ శుభవార్త తెలిపింది. ఇక్కడి తీర ప్రాంతంలో వందల కోట్లతో రక్షణ చర్యలు చేపట్టింది.

మొదట్లో 342.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉప్పాడ గత 100ఏళ్లలో కోత కారణంగా దాదాపుగా 320 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయింది. 410 ఎకరాల పంట భూములు, సరుగుడు తోటలు సహా 320 ఎకరాలను బంగాళాఖాతం మింగేసింది. ఉప్పాడ సమీపంలోని మరో గ్రామమైన కోనపాపపేటలోనూ గత పదేళ్లుగా 20ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయింది. 150 ఇళ్లు కోతకు గురయ్యాయి. తుఫాను వచ్చినప్పుడల్లా ఉప్పాడ కోతకు గురవుతోంది.

8వ ఏషియన్‌ అండ్‌ పసిఫిక్‌ కోస్ట్స్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అంచనాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలో 1990నుండి 2012 వరకు 240 చదరపు కిలోమీటర్ల మేర తీరప్రాంతం కోతకు గురైంది. కాకినాడ నుంచి తుని వరకు గల తీరప్రాంతాన్ని కలుపుతూ 1978లో నిర్మించిన బీచ్‌ రోడ్డు ఇప్పటివరకు 28సార్లు కోతకు గురైంది. 4సార్లు రోడ్డు మొత్తం కొట్టుకుపోతుండగా పక్కనే కొత్తరోడ్డు నిర్మిస్తున్నారు. బంగాళాఖాతంలో తుఫాన్లు వస్తే జిల్లా కేంద్రంలోని కాకినాడ పరిసర ప్రాంతాలు వణికిపోతుంటాయి. దశాబ్దాలకాలంగా సముద్రపు కోతతో అత్యతం విలువైన వందల ఎకరాల భూములు సముద్ర గర్భంలో కరిగిపోతుండగా కోట్లాది రూపాయల విలువైన ఇళ్లు, ఆస్తులు సముద్రపు కెరటాల తాకిడికి కొట్టుకుపోతున్నాయి.

యేడాదిన్నర క్రితం ప్రతిపక్షనేత హోదాలో ప్రజాసంకల్పయాత్రలో తీరప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చేదిశగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు.. సముద్రపు కోత సమస్యను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. దాంతో కేంద్రం నుండి వచ్చిన బృందం తీరప్రాంతాన్ని పరిశీలించి ఉప్పాడలో మినీ హార్బర్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దీనికోసం ఇప్పటికే సీఎం 320 కోట్లు విడుదల చేసారని, కేంద్రం నుండి సాయం రానుందని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు. మరో రూ.3 కోట్లతో జెట్టీల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే రూ.350 కోట్లతో తీర ప్రాంత రక్షణ చర్యలు చేపట్టడానికి సిద్ధమవుతోంది.

అసలు ఉప్పాడకు సముద్రపు కోతవల్ల ముప్పు ఉందని 1950లోనే అధికారులు గుర్తించారు. సరైన చర్యలు తీసుకోకపోతే మూల్యం తప్పదని ఏయూ శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది. 1971లో అప్పటి రాష్ట్రప్రభుత్వం గుర్తించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గోదావరి నుంచి భారీ స్థాయిలో ఇసుక కొట్టుకువస్తుండడంతో కాకినాడ సమీపంలో ఏర్పడిన హోప్‌ ఐ లాండ్‌ కారణంగానే ఉప్పాడ కోతకు గురవుతోంది. అలల తాకిడితో హోప్‌ ఐలాండ్‌లో ఇసుకదిబ్బలు పెరిగిపోయి ఉప్పాడ తీరంలో ఇసుక మేటలు వేయడానికి బదులు మట్టికోతకు గురవుతోందని తేల్చారు.

ఇలా కోతకు గురవుతున్న ప్రాంతంలో ఏటా 1.5 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తెచ్చి తీరంలో వేయాలని బీచ్‌ ఎరోజన్‌ బోర్డు సిఫారసు చేసింది. దానిద్వారా అలల తాకిడికి ఇసుకకోతకు గురవుతూ, మళ్లీ ఇసుక మేటలు వేస్తుందని పేర్కొంది. అయితే ఇసుక తరలింపు చేయాలంటే ఎక్కువ ఖర్చవుతుందని ఆ ప్రతిపాదన పక్కన పెట్టారు. సీవాల్స్‌ నిర్మించాలనే ప్రతిపాదనతో 1982లో రూ31.86 లక్షలతో ప్రణాళికలు సిద్ధం చేసారు. వీటిని రాష్ట్ర వరదనివారణ బోర్డుకు చెందిన సాంకేతిక సంఘం పరిశీలించి 1982 జూలైలో ఆమోదించింది. తాజాగా తీర ప్రాంతాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం సముద్రపు కోతపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిమేరకు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సస్టైనబుల్‌ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌సీఎస్‌సీఎం) డైరెక్టర్‌ డాక్టర్‌ రమేష్‌ రామచంద్రన్, శాస్త్రవేత్తలు పి.రామచంద్రన్, ఆర్‌ఎస్‌ రాబిన్, బి.సుబ్బారెడ్డి, ఎడ్విన్‌ రాజన్‌ ల బృందం కోనపాపపేట, ఉప్పాడ తీర ప్రాంతాల్ని పరిశీలించారు. ఉప్పాడలో సూరాడ పేట, సుబ్బంపేట ప్రాంతాల్లో శిథిలమైన జియోట్యూబ్‌ గోడను పరిశీలించారు. 2008నాటికి అంచనాలు పెరిగి జియోట్యూబ్ వాల్ నిర్మాణం రూ.12 కోట్లకు చేరుకుంది.

2008లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉప్పాడ సముద్రపు కోత నివారణకు రూ.12కోట్లతో 12ఏళ్లక్రితం జియోట్యూబ్‌ టెక్నాలజీతో సేఫ్ వాల్ నిర్మించారు. అయితే ఈ గోడ నిర్వహణను తర్వాతి పాలకులు పట్టించుకోలేదు. దాంతో వాల్ శిథిలమై కోత మళ్లీ ప్రారంభమైంది. తాజాగా ప్రభుత్వం మళ్లీ తీర ప్రాంత రక్షణపై దృష్టి పెట్టింది. అయితే గతంతో పోల్చితే సముద్రపు కోతను నివారించడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. జియోట్యూబ్‌ టెక్నాలజీ అనేది శాశ్వత పరిష్కారం కాదని, మరిన్ని కొత్త టెక్నాలజీల ద్వారా సముద్రపు కెరటాలను ఒడ్డుకు చేరేలోపే నిర్వీర్యం చేయొచ్చని, ముఖ్యంగా కెరటాల ఉధృతిని భారీగా తగ్గించడం ద్వారా తీరప్రాంతం కోతకు గురి కాకుండా చేసేందుకు పలు రాష్ట్రాల్లో కొత్త టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు.. ప్రస్తుత ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి తమ ప్రాంతాన్ని కాపాడాలని ఉప్పాడవాసులు కోరుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి