iDreamPost

కేశినేని నాని ట్వీట్‌.. సోషల్‌ మీడియా ఫైర్‌..

కేశినేని నాని ట్వీట్‌.. సోషల్‌ మీడియా ఫైర్‌..

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తూ విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్‌ కలకలం రేపుతోంది. సోషల్‌ మీడియాలో ఎంపీ కేశినేని నానిపై విమర్శల వర్షం కురుస్తోంది. బాధ్యత గల ఎంపీ ఇలా చేయవచ్చా..? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సందిస్తున్నారు.

ఇంతకీ కేశినేని నాని ఏం ట్వీట్‌ చేశాడంటే.. విజయవాడ నడిబొడ్డన ఉన్న కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని ఆరు జిల్లాలకు చెందిన కరోనా వ్యాధి గ్రస్తులకు ఐసోలేషన్‌ వార్డులుగా మారుస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ జనావాసాల మధ్యలో ఐసోలేషన్‌ వార్డులు పెట్టడం ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదు. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి… అంటూ నాని ట్వీట్‌ చేశారు.

కరోనా వైరస్‌ వ్యాపించకుండా రాష్ట్ర ప్రభుత్వం పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే లాక్‌డౌన్‌ ప్రకటించింది. ప్రతి నియోజకవర్గంలో 100 బెడ్లతో ఐసోలేషన్‌ వార్డు, జిల్లా కేంద్రంలో 200 బెడ్లతో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే వైద్య శాఖ అధికారులు ప్రభుత్వాస్పత్రుల్లో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆస్పత్రిని ఎంపిక చేశారు.

విజయవాడలో ఇప్పటికే కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో నగరంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. రాష్ట్రంలో ఏ జిల్లా, నగరంలో లేని విధంగా విజయవాడలో వైరస్‌ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. పాజిటివ్‌ కేసు నమోదైన వన్‌టౌన్‌ ప్రాంతంలో పారిశుధ్య చర్యలు చేపట్టారు. విజయవాడ నగరంలో ఇలాంటి పరిస్థితి ఉంటే ఎంపీ నాని ఐసోలేషన్‌ వార్డు నగరంలో ఏర్పాటు చేయవద్దనడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు.

మరికొంత మంది నెటిజన్లు ఎంపీ నాని ట్వీట్‌కు కౌంటర్లు సందిస్తున్నారు. ఐసోలేషన్‌ వార్డుకు, రాజధానికి ముడిపెట్టి ప్రశ్నలు వేస్తున్నారు. రాజధాని, హైకోర్టు, ఇతర అభివృద్ధి పనులన్నీ విజయవాడ దగ్గర్లోనే కావాలా..? ఇతర జిల్లాకు చెందిన ప్రజలకు రాజధానిలో ఐసోలేషన్‌ వార్డులు వద్దా..? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న కేశినేని నాని తన ట్వీట్‌ను సమర్థించుకుంటారా..? లేదా డిలిట్‌ చేస్తారా..? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి