iDreamPost

ఢిల్లీ వరదలు: కొనసాగుతున్న సహాయక చర్యలు.. మూగ జీవాలపై NDRF స్పెషల్ ఫోకస్!

ఢిల్లీ వరదలు: కొనసాగుతున్న సహాయక చర్యలు.. మూగ జీవాలపై NDRF స్పెషల్ ఫోకస్!

దేశ రాజధాని ఢిల్లీ ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. వర్షాలు తగ్గినా కూడా వరదనీరు మాత్రం ఇంకా ఢిల్లీ వీధుల్లో అలాగే ఉంది. చాలా ప్రాంతాలు మోకాళ్ల లోతు నీళ్లతో ఉన్నాయి. చాలా మార్గాలు, కాలనీలు నదులను తలపిస్తున్నాయి. యమునా నదికి వరద ప్రవాహం తగ్గినా కూడా ఇంకా.. ప్రమాదకర స్థాయిలోనే ప్రవహిస్తోంది. ఢిల్లీలో ఎర్రకోట, రాజ్ ఘాట్, సుప్రీంకోర్టు, శాంతివనం రోడ్డు జలదిగ్బంధంలో ఉన్నాయి. వరద నీటి కారణంగా కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా నిలిపివేశారు.

వరదనీటి వల్ల ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. రెండ్రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీసులు సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి మంచినీళ్లు, ఆహారం అందించేందుకు ఎయిర్ ఫోర్స్ కూడా సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మూగజీవాలను రక్షించడంపై దృష్టి సారించింది. వరదనీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అక్కడ ఏమైనా ప్రాణులు, మూగజీవాలు చిక్కుకుని ఉన్నాయా? అని వెతుకుతున్నారు. అలా ఏమైనా చిక్కుకుని ఉంటే వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఈ సహాయక చర్యల్లో ఒక ఘటన అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. నోయిడా ప్రాంతం నుంచి వరదలో చిక్కుకున్న మూగజీవాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించింది. వాటిలో మూడు ఎద్దులు కూడా ఉన్నాయి. ఆ ఎద్దుల్లో భారతదేశ నంబర్ వన్ బ్రీడ్ ‘ప్రీతమ్’ బ్లడ్ లైన్ కు చెందిన ఎద్దును రక్షించేందుకు దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. ఈ విషయాన్ని 8వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రాణాలు రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలు రక్షించేందుకు కష్టపడుతున్నారు.

ఢిల్లీలోని వరద ముంపు ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ పోస్ట్ చేసిన వీడియోల్లో రెండు గేదెలను రక్షించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. గేదెలకు లైఫ్ సేవింగ్ రింగ్స్ తగిలించి.. బోటుకు రెండువైపులా వాటిని పట్టుకుని ఒడ్డుకు చేర్చారు. మేకలు, ఆవుదూడలు ఇలా అన్ని ప్రాణాల ప్రాణాలు తమకు ముఖ్యమే అన్నట్లు.. అన్నింటికి వరద ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ చేస్తున్న ఈ సహాయక చర్యలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రాణాలు కాపాడటంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కృషి అద్భుతం అంటూ చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి