iDreamPost

నారప్పా – ఈ పోలికలతో చిక్కప్పా

నారప్పా –  ఈ పోలికలతో చిక్కప్పా

విక్టరీ వెంకటేష్ హీరోగా తమిళ్ బ్లాక్ బస్టర్ అసురన్ రీమేక్ గా రూపొందుతున్న నారప్ప షూటింగ్ యమా ఫాస్ట్ గా జరిగిపోతోంది. సమ్మర్ కి రిలీజ్ చేయాలనే టార్గెట్ తో నాన్ స్టాప్ గా కానిచ్చేస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న పోలికల చర్చ నారప్పకు ఎంతో కొంత ఇబ్బంది కలిగించేలా ఉంది. మొన్న శుక్రవారం రిలీజైన పలాస 1978 మంచి టాక్ తో రివ్యూస్ తో ఓపెనైన సంగతి తెలిసిందే. కమర్షియల్ రేంజ్ పక్కనబెడితే ఇందులో కంటెంట్ అయితే అధిక శాతం ప్రేక్షకులకు ఓ మోస్తరుగా నచ్చిందనే చెప్పాలి.

దీనికి నారప్పకి లింక్ ఏంటి అనుకుంటున్నారా. విషయం ఉంది. పలాసలో వెనుకబడిన కులానికి గ్రామంలో పెత్తనం చెలాయించే అగ్రవర్ణానికి మధ్య జరిగే యుద్ధం నేపథ్యంలో రివెంజ్ డ్రామాగా చూపించారు. నారప్పలో కూడా మెయిన్ పాయింట్ ఇదే. పలాసలో అన్నను చంపిన వాళ్ళ కోసం తమ్ముడు కత్తి పడతాడు. నారప్పలో కొడుకుని చంపిన వాళ్ళ మీద ప్రతీకారం. దీని ఫ్లాష్ బ్యాక్ లోనూ పలాస టైపులో మంచి సోషల్ డ్రామా ఉంటుంది. అయితే పలాస లిమిటెడ్ రేంజ్ ఆడియన్స్ కు మాత్రమే రీచ్ అవుతోంది. కానీ నారప్ప అలా కాదు. వెంకటేష్ ఇమేజ్ దానికి కొండంత అండగా నిలుస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ తనకోసమైనా సినిమాకు వస్తారు.

పలాసలో దాదాపు అందరూ కొత్త వారే కావడంతో పికప్ కావడం గురించి ట్రేడ్ అనుమానపడుతోంది. ఒకరకంగా చెప్పలంటే రంగస్థలంలోనూ ఇలాంటి థీమ్ ఉంటుంది. కాకపోతే దాంట్లో కమర్షియల్ అంశాలను బలంగా జోడించడంతో పాటు రామ్ చరణ్ అనే ఫ్యాక్టర్ ఆడియన్స్ ని థియేటర్ వైపుకు తీసుకొచ్చింది. ఎలా చూసుకున్నా నారప్ప, పలాస, రంగస్థలం మూడు సినిమాల్లో దర్శకుల ఉద్దేశాలు ఒకటే. కాకపోతే ప్రెజెంట్ చేసిన విధానంలోనే తేడాలు. ఫలితాలు కూడా దానికి తగ్గట్టే వస్తున్నాయి. ఒకవేళ ఒకవేళ పలాస థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా టీవీలోనో డిజిటల్ స్ట్రీమింగ్ లోనో ప్రేక్షకులు చూసేస్తారు. మరి నారప్ప ఈ పోలికల చిక్కు నుంచి ఎలా తప్పించుకుంటాడో వేచి చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి