iDreamPost

టీడీపీ హయాంలో అభివృద్ధి వికేంద్రీకరణ ఎంత మేర చేశారు?

టీడీపీ హయాంలో అభివృద్ధి వికేంద్రీకరణ ఎంత మేర చేశారు?

అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీతోనే సాధ్యమని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ అన్న మాటలు అతిశయోక్తిగా ఉన్నాయి.గతంలో 14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణ ఎంతమేర చేశారు? హైదరాబాద్‌ తప్ప రాష్ట్రంలో ఏయే ప్రాంతాలను ప్రగతిపథంలో నడిపించారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. శుక్రవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ పాలనా వికేంద్రీకరణ కాదని..అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు. పరిపాలనా విభాగాన్ని ఒకేచోట ఉంచి అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలనేదే టీడీపీ లక్ష్యమని తెలిపారు.

తాత్కాలిక కట్టడాలతో ప్రజాధనం దుర్వినియోగం

విభజిత ఆంధ్రప్రదేశ్‌ అభ్యున్నతికి చంద్రబాబు నాయుడి అనుభవం అక్కరకొస్తుందని భావించిన ప్రజలు 2014 ఎన్నికల్లో ఆయనకు అవకాశం ఇచ్చారు. కానీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ అమరావతి జపం చేస్తూ, గ్రాఫిక్స్‌తో మోసం చేసి జనం ఆశలను అడియాశలు చేశారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల బృందాలు రాజధాని నిర్మాణం కోసమంటూ విదేశాలకు చార్టర్డ్‌ విమానాల్లో పర్యటనలు చేశారు. చంద్రబాబు ఏ దేశం సందర్శిస్తే అచ్చం ఆ దేశం మాదిరిగా అమరావతి నిర్మిస్తానని ప్రచారం చేశారు. ఇలా జపాన్‌, సింగ్‌పూర్‌ అంటూ అమరావతిని కాస్తా భ్రమరావతిగా మార్చేశారనే విమర్శలు వచ్చాయి. అమరావతిలో తాత్కాలిక కట్టడాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని జనానికి అర్థమైంది.

ఎన్ని జిల్లాలను.. ఏ విధంగా అభివృద్ధి చేశారు?

పరిపాలనా విభాగాన్ని ఒకేచోట ఉంచి.. అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలనేదే టీడీపీ లక్ష్యమని చెబుతున్న లోకేశ్‌ తమ హయాంలో మరే జిల్లాను ఎందుకు అభివృద్ధి చేయలేదు? పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను టీడీపీ ప్రభుత్వం అర్ధాంతరంగా వదిలేసింది. 13 జిల్లాల అభివృద్ధిని కూడా గాలికొదిలేసింది. అమరావతి నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిచ్చి దాన్ని మరో హైదరాబాద్‌ చేద్దామని చంద్రబాబు సర్కారు తలపోసింది. అందుకోసం ప్రజధనాన్ని విచ్చలవిడిగా దుబారా చేసింది. ఈ అభివృద్ధి కేంద్రీకృత పోకడలను జనం సమ్మతించలేదు. టీడీపీ ఐదేళ్ల పాలన పూర్తయ్యేసరికి అభివృద్ధి విషయంలో జనం చంద్రబాబుపై పెట్టుకున్న భ్రమలు తొలగిపోయాయి. అందుకే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

అసలు రాజధానిని కట్టడం ఎందుకు?

రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేనివాళ్లు మూడు రాజధానులు కడతారా? అంటున్న లోకేశ్‌ అసలు రాజధానిని కట్టడం ఎందుకు అన్నది చెప్పాలి. పరిపాలన చేయడానికి ఆల్‌రెడీ అందుబాటులో ఉన్న నగరాన్ని ఉపయోగించుకోవడం మానేసి రాజధానిని నిర్మించడం ఎందుకు? రాజధానిని పనిగట్టుకుని నిర్మించనక్కర లేదు. ఏ ప్రాంతం నుంచి పాలన చేస్తే ఆ ప్రాంతమూ, ఆ చుట్టుపక్కల ఏరియాలు సహజంగా కొన్నేళ్లకు అభివృద్ధి చెందుతాయి. అంతే తప్ప లక్షలకోట్లు ఖర్చు చేసి 20 నుంచి 30 సంవత్సరాల సమయంలో మేము అమరావతిని నిర్మిస్తాం. జీవితాంతం రాష్ట్ర ప్రజలందరూ తెలుగుదేశం పార్టీనే గెలిపించండి అంటే జనం నమ్ముతారా? అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు అనుగుణంగా ఉందా? ఇలాంటి ప్రాథమిక విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా టీడీపీ అయిదేళ్లూ హంగామా చేసింది. అది చాలక ఇప్పుడు తగుదునమ్మా అంటూ మళ్లీ అమరావతి జపం చేస్తోంది. చంద్రబాబు విజనరీ, అభివృద్ధి వికేంద్రీకరణ ఆయనతోటే సాధ్యం అంటే ఇంకా ప్రజలు విశ్వసిస్తారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి